తెలుగు దేశం పార్టీ మహానాడు సభకు జనం పోటెత్తారు. వైసీపీ ప్రభుత్వంపై తెలుగు తమ్ముళ్లు యుద్ధం ప్రకటించారు. సభకు హాజరైన ప్రజల్లో ప్రభుత్వంపై కసి కనిపించింది. జగన్ సర్కారును దించే దాకా తగ్గేది లేదన్నట్లు ఉరకలెత్తారు. లక్షల మంది జన సందోహాన్ని చూసి చంద్రబాబు నాయుడు కళ్లు మెరిసిపోయాయి. ఆయన ప్రసంగం తమ్ముళ్లలో ఉత్తేజాన్ని నింపింది. ఉపన్యాసం చివర్లో మధ్యంతర ఎన్నికలకు సిద్దంగా ఉండాలని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అటు వేదికపై ఉన్న నాయకుల్లో కూడా ఈసారి విజయాన్ని కైవసం చేసుకుంటామనే ధీమా వ్యక్తమైంది.
మహానాడు సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ జగన్ సర్కారు రాష్ట్ర ప్రజలను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని ధ్వజమెత్తారు. గడచిన మూడేళ్లలో సీఎం వైఎస్ జగన్ లక్షా 75 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే అవినీతి సొమ్ము మొత్తాన్ని నయాపైసాతో సహా కక్కిస్తామని హెచ్చరించారు. ఓ వైపు పన్నులు, చార్జీలు పెంచుతూ ప్రజలను బాదేస్తూ ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేశారని చంద్రబాబు నిలదీశారు.

వైసీపీ ప్రభుత్వం రాగానే రెండున్నర లక్షల పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత వలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను వంచించినట్లు చంద్రబాబు తెలిపారు. తమ హయాంలో ఐటీ ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు.
దళిత గిరిజనుల విదేశీ విద్యకు ఈ ప్రభుత్వం మంగళం పాడిందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం బడ్జెట్లో 54 శాతం సంక్షేమానికి వెచ్చిస్తే.. జగన్ ప్రభుత్వం కేవలం 41 శాతమే ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రభుత్వం సంక్షేమ జపం చేయడం వట్టి బూటకమన్నారు.
ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది..
నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వం ఇదంటూ చంద్రబాబు విరుచుకు పడ్డారు. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో లేదో తెలీదు. ప్రకాశం జిల్లాలో వెలుగొండ మొదటి సొరంగం పనులు 90 శాతం పూర్తయినా నీటిని విడుదల చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదంటూ దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం రాగానే పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని సహజ వనరులను వైసీపీ నేతలు దోచేస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సైట్ నుంచి లేటరైట్, గ్రానైట్ గనులను చెరబట్టారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారుల సమస్యలను తాము అధికారానికి రాగానే పరిష్కరిస్తామన్నారు. జగన్ సర్కారు పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పారు.
ఈ చేతగాని ప్రభుత్వం వల్ల కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని చంద్రబాబు పిలుపునిచ్చారు.
వైసీపీ సర్కారుపై యుద్దం ప్రారంభమైంది..

మహానాడు వేదికగా వైసీపీ సర్కారుపై యుద్దం ప్రారంభమైందని చంద్రబాబు హెచ్చరించారు. ఇక్కడ నుంచి ప్రతీ కార్యకర్త ప్రజల్లో నిరంతరం చైతన్యం నింపడానికి కృషి చేయాలని కోరారు. ప్రతీ జిల్లాలో మినీ మహానాడు నిర్వహించి ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. పోలీసు కేసులకు బెదరవద్దన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా టీడీపీ ప్రభుత్వం రాగానే తొలగిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రజా కంటక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా తమ్ముళ్లు విశ్రమించవద్దని సూచించారు.
ఇంకా సభలో నారా లోకేష్, అచ్చెంనాయుడు, నందమూరి బాలకృష్ణ, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, దామచర్ల జనార్దన్రావు ప్రసంగించారు. మహానాడుకు అద్భుతంగా ఏర్పాట్లు చేసినందుకు చంద్రబాబు జిల్లా నేతలను అభినందించారు.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
