వైసీపీ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి ఇప్పటికి మూడేళ్లయింది. ఈ కాలంలో ప్రభుత్వం 95 శాతం హామీలు నెరవేర్చామని ప్రకటించింది. నవరత్నాలన్నింటినీ అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఎక్కడా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ముందు చెప్పినట్లు రాజకీయాల్లో విశ్వసనీయత పెరగాలి. విలువలతో కూడిన రాజకీయాలకు వైసీపీ కట్టుబడి ఉందన్నారు. దీని విషయంలో ఎంత మార్పు వచ్చిందనేది ఆ పార్టీ చెప్పాల్సిందే. ఇక ఇచ్చిన హామీల్లో నెరవేరనివి.. నెరవేర్చినవి.. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజా సమస్యల్లో వచ్చిన మార్పులను పరిశీలిస్తే..
సీఎం జగన్ పగ్గాలు చేపట్టాక గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వచ్చింది. దాదాపు ఓ పది శాఖలకు సచివాలయాల పరిధిలో సిబ్బంది ఏర్పడ్డారు. సుమారు 1.35 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2.26 లక్షల మంది వలంటీర్లు వచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద నగదు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేస్తున్నారు. అమ్మ ఒడి, చేయూత, మత్స్యకారులకు, చేనేతలకు, నాయీ బ్రాహ్మణులకు, దర్జీలు, ఆటోవాలా, రజకులకు నగదు పథకాలు అమలు చేస్తున్నారు.
డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ, రైతులకు రైతు భరోసా, కాపు నేస్తం, ఈడబ్ల్యూఎస్ నేస్తం కింద నేరుగా నగదు అందిస్తున్నారు. ఇవన్నీ ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టింది. వీటితోపాటు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, 17 లక్షల మందికి జగనన్న కాలనీల నిర్మాణం కొనసాగుతోంది. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు వచ్చాయి. నాడు– నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని మరిన్ని వ్యాధులకు విస్తరింపజేశారు.
నెరవేరని హామీలు..
ఇక నెరవేరని హామీలు చూస్తే.. ఉద్యోగులకు సీపీఎస్ రద్దు కాలేదు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న హామీ గడప దాటలేదు. కౌలు రైతులందరికీ పంట రుణాలు ఇప్పిస్తామన్నారు. రైతు భరోసాతోపాటు పంటల బీమా వర్తింపజేస్తామన్నారు. అందుకనుగుణంగా కౌలు సాగు చట్టాన్ని రూపొందించడంలో విఫలమయ్యారు. చట్టంలో తీసుకొచ్చిన మార్పులతో కౌలు రైతులు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది.
రెండున్నర లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగలేదు. కొత్త పరిశ్రమలు రాలేదు. ఉపాధి అవకాశాలు పెరగలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన హామీలను సాధించలేకపోయారు. పెళ్లి కానుక పథకం అమలు కావడం లేదు. బీసీల్లో చట్టసభలకు ఎన్నిక కాలేని కొన్ని కులాలకు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ నెరవేరలేదు.
రద్దయిన సంక్షేమ పథకాలు..
ఇక ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు ఎప్పటినుంచో ఉన్న భూమి కొనుగోలు పథకం, ఎన్ఎస్ఎఫ్డీసీ, ఇతర స్వయం ఉపాధి పథకాలు రద్దు చేశారు. బ్యాంకులతో సంబంధం లేకుండా సంక్షేమ శాఖలు, కార్పొరేషన్ల నుంచి ఆయా వర్గాల ఉపాధికి ఊతమిచ్చే పథకాలన్నీ పడకేశాయి.
మొత్తంగా సంక్షేమ శాఖలు నిర్వీర్యమయ్యాయి. డ్రిప్, ఇరిగేషన్ పరికరాలు 90 శాతం రాయితీతో ఇచ్చే కార్యక్రమం అటకెక్కింది. ఉపాధి హామీ నిధుల్లో వేతన కంపొనెంట్ బాగా తగ్గిపోయింది. గత ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇప్పటిదాకా అప్పగించలేదు.
ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు కొత్తగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. భారాలు పెరిగాయి. కొవిడ్ వచ్చి కుటుంబాలను అతలాకుతలం చేసింది. ప్రజల ఆస్తులు కరిగాయి. కొలువులు ఊడాయి. ఆదాయాలు పడిపోయాయి. నిజ వేతనాలు బాగా తగ్గాయి. మొత్తంగా ఉపాధికి పెద్ద ఎత్తున గండి పడింది. దీనికి ఉపశమనంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టలేదు. సంక్షేమ పథకాల కింద ఇచ్చే నగదు ఆదుకుంటుందనేది ప్రభుత్వ భావన.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపిన అదనపు భారాలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెద్ద ఎత్తున భారాలు మోపాయి. పెట్రోలు, డీజిల్ ధరల అసాధారణ పెంపుతో ప్రజల జీవన వ్యయం 30 శాతం పెరిగింది. జీఎస్టీలో 5 శాతం శ్లాబును 12 శాతానికి పెంచారు. నిత్యావసరాలు కొండెక్కాయి. వంట గ్యాస్ ధర రెండింతలు పెరిగింది.
ఆస్తి, ఇంటి పన్నుల పెంపుతో ఇళ్ల అద్దెలు పెరిగాయి. రవాణా, విద్యుత్ చార్జీలు మోత మోగిస్తున్నాయి. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టడంతో గ్యాస్ సబ్సిడీ కథలా మారుతుందని రైతుల్లో ఆందోళన నెలకొంది.
ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం..
ఇక అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వ చర్యలు కొన్ని వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మూడు రాజధానుల ప్రస్తావనతో మూడేళ్లు గడిచిపోయింది. నెలాకరుకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఆర్థిక పరిస్థితులున్నాయి. ప్రభుత్వానికి సామగ్రి సరఫరా దారులు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు.
ఈపాటికే అప్పులు రూ.2.30 లక్షల కోట్ల నుంచి సుమారు రూ.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి. నిత్యం అప్పులు, లేదా కేంద్ర సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గడచిన మూడేళ్లలో జరిగిందేమిటి.. వివిధ వర్గాల ప్రజలు ఏమేరకు సంతోషంగా ఉన్నారనేది ఎవరికి వాళ్లే అంచనా వేసుకోవచ్చు.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
