కాళేశ్వరం.. తెలంగాణ ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టు. కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా జాతీయ హోదా ఇవ్వలేదు. అయినా కేసీఆర్ సర్కారు దాదాపు రూ. లక్ష కోట్లు అప్పు చేసి ఈ ప్రాజెక్టు నిర్మించింది. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మురళి మాట్లాడుతూ కాళేశ్వరం దొంగ స్కీం అన్నారు. కమీషన్ల కోసం రూపొందిన ప్రాజెక్టని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ డీపీఆర్ డిజైన్ చేసినప్పుడు రూ.36 లక్షల కోట్ల అంచనాతో ఆమోదించారు. ఆ తర్వాత దాన్ని రూ.42 లక్షల కోట్లు చేశారు. ఇప్పుడు లక్ష కోట్లు దాటిందంటున్నారు. ఇదంతా కూడా మూడు నాలుగు సార్లు ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు పోగేసుకోవడానికే. ఇది కేసీఆర్ వేసిన స్కెచ్ అని రిటైర్డ్ ఐఏఎస్ మురళి విమర్శించారు.
కాళేశ్వరం కింద 15 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు. ప్రపంచంలోనే ఇంత మూర్ఖపు ప్రాజెక్టు ఇంకొకటి లేదన్నారు. ఎకరా వరికి నీరు పారించాలంటే దీనికయ్యే కరెంట్ ఖర్చు రూ.50 వేలు అని మురళి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికీ తెల్ల ఏనుగు అని.. ఇంకో ఐదేళ్లలో దాన్ని మూసేయాల్సి వస్తుందని మురళి స్పష్టం చేశారు.
దళితుల ఓట్ల కోసమే దళిత బంధు..
దళితుల ఓట్ల కోసమే దళితబంధు అని.. దళితుల ఉన్నతికి ఈ బంధు ఏమాత్రం పనికి రాదని మురళి స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 100 మందికి చొప్పున దళితబంధు ఇవ్వాలంటే రాష్ట్రంలోని 18 లక్షల మందికి వచ్చేసరికి 156 ఏళ్లు పడుతుందన్నారు. ఫాంహౌస్ లు ఉన్న సినిమా సెలబ్రెటీలు, సివిల్స్ ఇతర ఉన్నతాధికారులకు రైతు బంధు డబ్బులు పడుతున్నాయంటే అదెంత వృథా స్కీమో అర్థం చేసుకోవచ్చని మురళి ఎద్దేవా చేశారు.
తెలంగాణలో విద్యావ్యవస్థను కేసీఆర్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేస్తోందని మురళి ఆరోపించారు. రాష్ట్రంలో టీచర్ల జీతాలకు 12వేల కోట్లు ఇస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.40-45వేలు ఖర్చు పెడుతున్నారు. అదే ప్రైవేటు స్కూళ్లలో రూ.7వేలు వెచ్చిస్తున్నారు. వారిలో 90శాతం ఏ గ్రేడ్ వస్తే.. ప్రభుత్వ స్కూళ్లలో 63శాతం సీగ్రేడ్ వస్తోందని ఆరోపించారు. నాణ్యమైన విద్య విషయంలో కేసీఆర్ కనీసం ఐదు నిమిషాలు సమీక్ష నిర్వహించడం లేదని చెప్పారు.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
