గడచిన ఐదారు రోజులుగా ఏపీ ప్రజలకు బాగా కనెక్ట్ అయిన అంశం ఏదంటే టీడీపీ మహానాడేనని సర్వత్రా వినిపిస్తోంది. అటు ప్రధాన స్రవంతి మీడియాలోనూ ఎక్కువ కవరేజి మహానాడుకే దక్కింది. సీఎం జగన్ దావోస్ పర్యటనలో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు.. ప్రభుత్వం నిర్వహించిన సామాజిక న్యాయ భేరీకి తగిన ప్రాధాన్యం దక్కలేదు. దీనికి ప్రధాన కారణం గతంలో నిర్వహించిన మహానాడుల కన్నా ఇప్పుడు జరిగిన దానికి ప్రజల స్పందనలో చాలా వ్యత్యాసం ఉంది. రెండోరోజు సభకు హాజరైన అశేష జనవాహినిలో మార్పును కోరుకుంటున్నట్లు వ్యక్తమైంది.
సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో గొప్ప మెరుపుల్లేవు. విశాఖలో ఏవో కొన్ని ఐటీ స్టార్టప్ కంపెనీలు.. అదానీ గ్రూపుతో పవర్ సెక్టార్లో ఒప్పందాలు మినహా ఆహా అనుకునేంత పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించలేకపోయారు. మొత్తం లక్షా 25 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి. అందులో సగానికిపైగా పవర్ సెక్టార్కు సంబంధించినవే.
ఈ పెట్టుబడులతో ఉపాధి కల్పన చాలా పరిమితంగా ఉంటుంది. ఉపాధి కల్పన ప్రాధాన్యం కలిగిన రంగాల్లో పెట్టుబడులు ఆశించిన మేర రాలేదు. పైగా ఏపీ ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లడం వల్ల వినిమయ సరకుల ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు అవకాశం లేకుండా పోయింది. అందువల్లే పెద్దగా ప్రజల్లో చర్చనీయంశం కాలేదు.
మంత్రుల యాత్రకు ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదు
ఇక మంత్రుల సామాజిక న్యాయ భేరీ సభలకూ స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ మంత్రులుగా ఉన్నప్పటికీ గల్లా పెట్టె సీఎం దగ్గర ఉంటుంది. దేనికైనా నిధులు మంజూరు చేసే స్థాయి మంత్రులకు లేదనేది ఆయా వర్గాల ప్రజల్లో నెలకొంది. ఇప్పటిదాకా వివిధ కులాల కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కేటాయించలేదు.
కార్పొరేషన్ల చైర్మన్లు, మంత్రులు కేవలం ప్రభుత్వ పథకాల ప్రచారం చేయడానికేనన్నట్లు మిగిలిపోయారు. దీనికితోడు ఆయా వర్గాల వారీ సంక్షేమ శాఖలు గతంలో అమలు చేస్తున్న పథకాలు నిలిపేయడంతో కొంత అసంతృప్తి నెలకొంది. భూమి కొనుగోలు పథకంతోపాటు ఇతర స్వయం ఉపాధి పథకాలు లేకపోవడంతో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఈ కారణాలతో మంత్రుల యాత్రకు బడుగు బలహీన వర్గాల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు.
మహానాడులో ఆత్మ విమర్శకు చోటేదీ !
మహానాడుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ హయాంలో చేసిన తప్పొప్పులపై లోతైన సమీక్ష చేసుకుంటుందని అంతా భావించారు. నిజాయతీగా తప్పులను ఒప్పుకొని ప్రజలను క్షమాపణ కోరాలి. ఈసారి అధికారానికి వస్తే ఏం చేస్తామనేది సూచన ప్రాయంగానైనా ప్రజలకు వెల్లడించాలి.
మహానాడు అంటేనే పార్టీలో అంతర్గత మేథోమధనం. దీనికి భిన్నంగా కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికే పరిమితమైంది. వైసీపీ సర్కారుపై విమర్శలపైనే దృష్టి పెట్టింది. కొందరు నేతలు మరీ చౌకబారు విమర్శలకు పాల్పడ్డారు. పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపినా తటస్టంగా ఆలోచించేవాళ్లను మహానాడు నిరాశపర్చింది. ఇప్పటికైనా అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం జనం కోణంలో ఆలోచించి మార్పులు చేసుకుంటాయా !
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
