‘‘మహానాడుకు పోవాల కదా.. ఏంది గమ్మునున్నారంటే.. ఆ.. వాహనాలు.. ఖర్చు ఎక్కడ పెట్టుకుంటామని మా నాయకుడు పట్టించుకోలేదండి. మేమే మోటారు సైకిళ్లు ఏసుకొని నలభై మందిమి వచ్చాం !’’ అంటూ ఓ టీడీపీ అభిమాని వ్యక్తం చేశాడు. మహానాడు సభకు చాలా ప్రాంతాల నుంచి పార్టీ అభిమానులు స్వచ్చందంగా కదిలారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందనే విశ్వాసం ద్వితీయ శ్రేణి నేతల్లో పాదుకోలేదు. కింది స్థాయిలో ముఠా కుమ్ములాటలూ సమసిపోలేదు.
టీడీపీ నాయకత్వంలో ఈ నిరాశా నిస్పృహలు ఇప్పటివి కావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వెనకడుగు వేసినప్పుడే దెబ్బ కొట్టింది. పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూసేకన్నా గమ్మనుండడమే మేలని చంద్రబాబు భావించారు. అప్పటికే ఉత్సాహంగా పోటీ సిద్దమైన నాయకులు పార్టీ నిర్ణయంతో డీలా పడ్డారు. ఆ ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు. బహుశా మహానాడుకు వచ్చిన స్పందనతో కదలిక రావొచ్చు.
మరోవైపు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఇంత ఉందా అని వైసీపీలో ఆందోళన రేకెత్తింది. ఇప్పటిదాకా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరించింది. సంక్షేమ జపంతోనే ఓట్లు రాలతాయని ధీమాగా ఉన్నారు. ఇప్పుడు గుబులు మొదలైంది.
ఇప్పటికిప్పుడు ప్రజల్లో సానుకూల భావన తీసుకురావడం అంత తేలిక్కాదు. పెంచిన పన్నులు, ధరలు తగ్గించలేరు. పెరిగిన విద్యుత్, రవాణా చార్జీల నుంచి వెనకడుగు వేయలేరు. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌నూ తగ్గించుకోలేరు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చు.
ఇక మిగిలిందల్లా వ్యతిరేక ఓటును వీలైనంత చీలిక పేలికలు చేయడమే. ఒకటీ అరా శాతం ఓట్లు కలిగిన పార్టీలను ఎగదోలితే చాలు. ఈ దఫా ఎన్నికల్లో ఆయా పార్టీలు ఎంత ఎక్కువగా ఓట్లు చీలిస్తే వైసీపీ మళ్లీ గట్టెక్కడానికి అంత సులువవుతుంది. ప్రస్తుతం అధికార పార్టీ నేతలు ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇంకోవైపు వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ ఎన్ని త్యాగాలకైనా సిద్దపడుతుందని చంద్రబాబు చెప్పారు. పవన్‌తో పొత్తు ఖరారైతే అందులో బీజేపీ ఉంటుందా.. ఉండదా అనేదీ కీలకంగా మారబోతోంది. దేశ వ్యాప్తంగా కమలనాధులు ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. సగటు ప్రజలపై విపరీతంగా భారాలు మోపుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పేరెత్తితేనే అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
దీంతో కాషాయపార్టీ ఎవరి పక్షాన ఉంటే వాళ్లకు ఈ సెగ తగలక మానదు. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు గుండుగుత్తగా టీడీపీకే పడుతుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పటినుంచి పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపడుతూనే పొత్తులపై ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
