“సెంటు భూమి లేదు. పొద్దస్తమానం రెక్కలు ముక్కలు చేసుకుంటేనే పూట గడుస్తుంది. నాకు అమ్మ ఒడి వస్తుంది. పదెకరాల ఆసామికీ వస్తోంది. ఇంకేంది చెప్పండి. అదేమంటే లెక్కలేసి మీకు అంతిస్తున్నాం.. ఇంతస్తున్నామంటారు. మా దగ్గర పన్నుల కింద ఎంత నొక్కేసేది కూడా చెబితే సంతోషిస్తాం! ” అంటూ బేల్లారీ కార్మికుడు కన్నెర్రజేశాడు. ఉదయం తొమ్మిదింటికే నెత్తి మాడుతోంది. అడ్డాలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. పనులకు ఎవరూ పిలవలేదు. ఆ ఉక్రోషం కూడా కలవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.
ఏపీ సర్కారు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల తీరుతో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తీవ్రంగా పెరిగాయి. దేశంలో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నిర్వహించిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌లో ఇదే విషయం స్పష్టమైంది. ఏపీ 20వ స్థానంలో నిలిచింది. గినీ ఇండెక్స్ ప్రకారం అసమానతల్లో 34 నుంచి 43వ స్థానానికి ఎగబాకింది. ప్రత్యక్ష నగదు బదిలీలో ఏపీ ర్యాంకు 19వ స్థానానికి పడిపోయింది.
సంక్షేమమంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలను అనుసరించి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీఎస్టీబీసీ, మైనార్టీల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో నిధులు కేటాయించేది. సాగు భూమి, పరిశ్రమలు, వాణిజ్యంలో 90 శాతం అగ్ర వర్ణాలే ఉంటాయి. అందుకే ఈ నిమ్న వర్గాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. ఏటా కొన్ని కుటుంబాలనైనా దారిద్య్రరేఖ నుంచి కొద్దిమందినైనా బయటపడేస్తుంటారు. ఏపీ ప్రభుత్వం ఇలాంటి సంక్షేమానికి గండి కొట్టింది. కేవలం ఓటు బ్యాంకుల కోసం సంక్షేమ నిధులను దారి మళ్లించింది.
పునాది వర్గాలను అట్టడుగునే ఉంచుతున్నారు..
ఎస్సీ, ఎస్టీలకు భూమి కొనుగోలు పథకం ద్వారా ఏటా యాభై వేల కుటుంబాలకు ఎంతో కొంత సాగు భూమిని అందించే పథకాన్ని అటకెక్కించారు. ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా కొద్దిమంది యువతనైనా పారిశ్రామిక వేత్తలుగా.. లేదా స్వయం ఉపాధితో పేదరికాన్ని దాటి బయటకు వచ్చేది. అసలు బ్యాంకులతో సంబంధం లేకుండా ఆయా కార్పొరేషన్లు పునాది వర్గాల అభ్యున్నతికి తోడ్పడేది. ఇప్పుడు వీటన్నింటినీ మూలకు నెట్టేశారు. ఏ ఒక్క పథకం అమలు కావడం లేదు.
ప్రభుత్వం కులానికో కార్పొరేషన్ పెట్టింది. ఎస్సీల్లో మూడు, బీసీల్లో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద కేంద్రం నుంచి రూ.130 కోట్లు వచ్చింది. ఈ పథకం కింద వచ్చిన నిధులను ఆర్థిక శాఖ తొక్కి పట్టింది. ఈ ఏడాది బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్ కింద సుమారు రూ.17,500 కోట్లు కేటాయించింది.
బూటకపు సంక్షేమంపై కార్పొరేషన్ల చైర్మన్లను నిలేస్తాం..
ఈ నిధులన్నీ ఏమయ్యాయని ఓ దళిత నాయకుడ్ని అడిగితే.. “ ఫీజు రీయింబర్స్ మెంటు, ఆరోగ్యశ్రీ,, జగనన్న గోరు ముద్ద, అమ్మ ఒడి, చేయూత, ఆసరా, వాహన మిత్ర పథకాలన్నింటి ద్వారా ఎస్సీలకు ఎంత లబ్ది చేకూరిందో లెక్కలేస్తారు. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు వచ్చి మా దగ్గర వల్లె వేస్తారు. ఈ పథకాలేదో మా వరకే ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తుంటారు. ఈసారి రమ్మనండి వాళ్ల సంగతి తేలుస్తాం!”అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇదే విషయమై మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగను సంప్రదిస్తే.. మాల, రెల్లి, మాదిగ కార్పొరేషన్లకు సంబంధించి ఇంకా బడ్జెట్ విభజన పూర్తి కాలేదు. ఎవరికెంత ఇవ్వాలనేది ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బడ్జెట్ కేటాయింపులు జరగ్గానే ఎస్సీల అభివృద్ధి కోసం కార్పొరేషన్లు కృషి చేస్తాయి. కచ్చితంగా ఎస్సీల అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు.
సంక్షేమ పథకాల అమలు తీరుపై ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు స్పందిస్తూ..ఇది ఓటు బ్యాంకులను బలోపేతం చేసుకోవడానికే తప్ప నిమ్న వర్గాలకు ఒరిగేదేమీ లేదు. అణగారిన వర్గాల బడ్జెట్‌ను అందరికీ పంచడం సరికాదు. మిగులు నిధులుంటే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అప్పు చేయనిదే పూట గడవని ప్రభుత్వం పునాది వర్గాల వృద్ధికి కేటాయించిన నిధులను ఇలా ఓటు బ్యాంకుల కోసం వాడుకోవడం దుర్మార్గం. ఆర్థిక అసమానతలతోపాటు సామాజిక అంతరం కూడా పెరుగుతుంది. అందుకే గడచిన మూడేళ్లలో అట్రాసిటీ కేసులు కూడా పెరిగినట్లు వెల్లడించారు.
Make a contribution to Encourage Independent Journalism
