వంద కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే.. వాటిని న్యాయ సమీక్షకు పంపిన తర్వాతనే ఖరారు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదానీ బొగ్గు కొనుగోలు వ్యవహారంలో ఈ నిబంధనకు అధికారులు కొత్త భాష్యం చెబుతున్నారు. రివర్స్ టెండరింగ్ పద్దతిని తమకు ఇష్టమొచ్చినట్లు మల్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తం మీద టన్ను రూ.24,500 లెక్కన కొనుగోలు చేసేందుకు సిద్దమయ్యారు.
ఏపీ పవర్ డెవలప్మెంటు కార్పొరేషన్ ఈ ఏడాది జనవరిలో ఏపీ జెన్కోకు అవసరమైన 12.5 లక్షల టన్నుల బొగ్గు కోసం టెండర్లు పిలిచింది. టన్ను రూ..40 వేల చొప్పున 5 లక్షల టన్నులు సరఫరా చేస్తామని అదానీ ఎంటర్ ప్రైజెస్ బిడ్ దాఖలు చేసింది. అగర్వాల్ కోల్ కంపెనీ రూ.17,480 చొప్పున 7.5 లక్షల టన్నులకు టెండర్ వేసింది. నాడు ఈ ధరలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు రివర్స్ టెండరింగ్ కు పంపారు.
ఆ తర్వాత మరోసారి ఏపీపీడీసీఎల్ రెండు వేర్వేరు టెండర్లను ఆహ్వానించింది. అందులో కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రానికి 18 లక్షల టన్నులు, ఇతర థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం 13 లక్షల టన్నుల సరఫరా కోసం బిడ్లను కోరింది. కృష్ణపట్నం థర్మల్ కేంద్రానికి అదానీ ఎంటర్ ప్రైజెస్, మిగతావాటికి సరఫరాదారుగా చెట్టినాడు సంస్థ ఎల్1గా నిలిచాయి. ఈ రెండు సంస్థలు మాత్రమే టెండర్లు వేయడం గమనార్హం. టన్ను రూ.24,500 చొప్పున అదానీ నుంచి, టన్ను రూ.19,500 చొప్పున చెట్టినాడు కంపెనీ నుంచి కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్దం చేశారు.
వాస్తవానికి గతంలో టెండర్లు పిలిచిన దానికన్నా ఇప్పుడు రెట్టింపు పరిమాణంలో బొగ్గు కొనుగోలుకు బిడ్లు ఆహ్వానించారు. మొత్తం రూ.6,945 కోట్ల విలువైన బొగ్గు కొనుగోలు చేస్తున్నారు. వంద కోట్లకు పైన టెండర్లను కచ్చితంగా న్యాయ సమీక్షకు పంపాలి. గతంలో రివర్స్ టెండరింగ్ పంపించాం. ఇప్పుడు మళ్లీ పంపాల్సిన అవసరం లేదని అధికారులు కొట్టిపారేస్తున్నారు.
బొగ్గు ధరలను కోల్ ఇండియా నిర్ణయించి రాష్ట్రాలకు పంపాలి. దీనికి భిన్నంగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఏపీ జెన్కో సంస్థకు లేఖ పంపింది. దీంతో అదానీ బొగ్గు కొనుగోలుకు మార్గం సుగమమం అయింది. ఇప్పుడు యూనిట్‌పై రూ.7 నుంచి రూ.9 అదనపు భారం పడుతుంది. ఇక వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయం.
Make a contribution to Encourage Independent Journalism
