ఇటీవల ప్రజల్లో జనసేన గ్రాఫ్ పెరిగింది. శ్రమదానంతో రోడ్ల గుంతలు పూడ్చడంతో మొదలైంది. కౌలు రైతుల భరోసా యాత్ర వల్ల కొంచెం ఊపందుకుంది. ఆ తర్వాత ఏంటనేది జనసేనాని కార్యాచరణ ఇవ్వలేదు. అయినా ఆ జోష్‌తో ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాలపై క్షేత్ర స్థాయిలో జనసైనికులు స్పందిస్తున్నారు. ఇటీవల జనసేన, బీజేపీ సీఎం అభ్యర్థి పవన్ అంటూ కమలనాధులు వ్యూహాత్మకంగా లాక్ చేశారు. కార్యకర్తల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. ఇప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకుంటే గత ఎన్నికల పరిస్థితులే పునరావృతం కావొచ్చు.
వాస్తవానికి జనసేన పార్టీ బలమెంతో పవన్ కల్యాణ్‌కు తెలుసు. బీజేపీకీ ఎరుకే. ఊహించడానిక్కూడా వీల్లేని బలంతో సీఎం ఎలా అవుతారు ! ఈమధ్యన కొంచెం పుంజుకున్నా దాంతో వైసీపీని ఢీ కొట్టే పరిస్థితి లేదు. జనసేన టీడీపీతో కలవకూడదనే ఎత్తుగడతో బీజేపీ ఇలా ఇరికించేసింది. దాన్ని కార్యకర్తలు భుజానికెత్తుకుంటే కాషాయపార్టీతో ఏరికోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్లే.
ఈపాటికే కేంద్ర పెద్దలు సీఎం జగన్‌తో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. బీజేపీకి ఇంతకుమించిన మిత్రుడు ఎక్కడా దొరకడు. అందువల్ల జనసేన టీడీపీ వైపు మొగ్గుచూపకుండా కమలనాధులు ఎప్పటికప్పుడు తగు వ్యూహాలు అమలుచేస్తుంటారు.
జనసేన ఈ దఫా కొన్ని సీట్లయినా సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టలేకున్నా.. అధికారంలో భాగస్వామ్యం లేకున్నా ఉనికిని కాపాడుకోవడం చాలా కష్టం. అధికార వైసీపీని ఢీకొట్టే సత్తా ఒక్క టీడీపీకే ఉంది. గతంలో మాదిరి హడావుడి పొత్తులతో ఎన్నికలకు పోతే నష్టమే. ఈసారి ముందస్తు పొత్తులతో కలిసి పోరాడితేనే కొన్ని సీట్లయినా సాధించుకోవడం సాధ్యపడుతుంది.
ఈ దిశగా జనసేన యంత్రాంగాన్ని ముందుకు నడిపించాలి. క్షేత్ర స్థాయిలో నిర్మాణం లేకున్నా.. అభిమానులు బాగా సందడి చేస్తున్నారు. వీళ్ల బుర్రలను బీజేపీ నేతలు ఖరాబు చేయకముందే పవన్ మేలుకోవాలి. కచ్చితంగా పొత్తుల గురించి పార్టీ శ్రేణులకు వివరించాలి. పొత్తు లేకుంటే ఎదురయ్యే ఇబ్బందుల గురించి అవగాహన పెంచాలి. జనసేనాని ఎలా ముందుకెళ్తారో మరి.