మూడేళ్ల నుంచి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. వెళ్లినప్పుడల్లా శాలువాలు కప్పి తిరుమలేశుడి ప్రతిమను అందజేస్తున్నారు. దాంతోపాటు ఓ డజను విన్నపాలు నివేదిస్తున్నారు. ఆంక్షలు పెట్టి అప్పులకు అనుమతినివ్వడం తప్ప ఏ ఒక్క విన్నపం మీదనైనా స్పష్టతనిచ్చారా ! ప్రధాని మోడీ నోరు విప్పరు. ఈయనా అంతే. ఇక తిరుమలేశుడి దయ.. మన ప్రాప్తం అనుకోవాల్సిందేనా !
ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. 45 నిమిషాలపాటు చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి నివేదించారు. అందులో ప్రధానమైంది పోలవరం ప్రాజెక్టు. దీని అంచనాను రూ.55,548 కోట్లకు ఆమోదించాలని అడగని రోజు లేదు. ప్రతీసారి సీఎం విన్నవించడం.. ఆ తర్వాత రోజుకో కొర్రీ వేయడం.. పూటకో ప్రకటన చేయడం షరా మామూలే అయిపోయింది. కనీసం ఇప్పటికైనా ఆమోదిస్తారా.. ఒప్పుకోరా అనేది స్పష్టత లేదు.
పోలవరం ప్రాజెక్టులో భాగమైన తాగునీటి పథకం తమకు సంబంధం లేదంటారు. విద్యుత్ ఉత్పత్తికి తామెందుకు నిధులు ఇస్తామంటారు. అసలు భూసేకరణతో తమకు సంబంధం లేదని వాదిస్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించబోమంటారు. పెరిగిన అంచనా వ్యయాన్ని ఆర్థిక శాఖ ఒప్పుకుంటే జలవనరుల శాఖ కొర్రీ వేస్తుంది. వీళ్లు అంగీకరిస్తే ఆర్థిక శాఖ పక్కనపెడుతుంది. లేదంటే మధ్యలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముందుకొచ్చి తూచ్.. ఇవన్నీ మొదట్నించి లెక్కలు తేల్చాలంటోంది. పూటకో మాట. రోజుకో నిర్ణయం.
ఒక్క అంశంలోనైనా పీఎం నుంచి స్పష్టత ఏదీ !
ఇక రెవెన్యూ లోటు. విభజన సమయంలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన సొమ్ము అంచనాలోనూ కొర్రీలు వేశారు. ఇంకా పదో వేతన సంఘం బకాయి, డిస్కంల పునర్ వ్యవస్థీకరణ ప్యాకేజీ, సామాజిక పింఛన్లు, రైతుల రుణ మాఫీకి సంబంధించి రూ.32,625 కోట్లు రావాలి. కేంద్రం మధ్య వర్తిగా ఉండి నాడు తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి మరో రూ.6,627 కోట్లు రావాలి. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు.. ఎన్ని దశల్లో ఇస్తారు.. తెలంగాణతో మాట్లాడి విద్యుత్ బకాయిలు ఇప్పిస్తామని కనీస ప్రకటన కూడా చేయలేదు. అంతా వన్ సైడ్ కంఠశోషే.
కడప స్టీల్ ప్లాంటు గురించి ఏంటనేది స్పష్టత లేదు. ఇది విభజన హామీల్లో కీలకమైంది. ప్రస్తుతం రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఒక్క విశాఖ స్టీలు ప్లాంటును కారుచౌకగా తాబేదార్లకు కట్టబెట్టేందుకు సిద్దమయ్యారు. కడపలో రాష్ట్ర సర్కారు ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కనీసం దానికి ఇనుప ఖనిజ గనులను కేటాయించాలని అడుగుతుంటే.. దీనిపై స్పష్టత నివ్వలేదు.
మరోవైపు ప్రైవేటు కంపెనీలకు గనులు కట్టబెడుతున్న కేంద్రం రాష్ట్రంలోని విశాఖ స్టీలుకు ఇవ్వడం లేదు. రేపు కడప స్టీలుకు ఇస్తారన్న గ్యారెంటీ లేదు. దీనిపై సీఎం జగన్ నివేదనే తప్ప ప్రధాని స్పందించరు. ఇంతకన్నా దారుణం ఏముంటుంది ! ఇంకా బీచ్ శాండ్ నుంచి మినరల్స్ వెలికితీసే ప్రాజెక్టులు, మెడికల్ కళాశాలలకు అనుమతులు ఇవ్వాలని ప్రధానికి నివేదించారు. ఎన్నాళ్లీ నివేదనలు.. ఏమిస్తారో.. ఇవ్వరో కేంద్రం ఎందుకు స్పందించదని ఏపీ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
Make a contribution to Encourage Independent Journalism
