జనసేనాని పొత్తుల సంగతి తేల్చేశారు. అయితే జనసేన.. టీడీపీ.. బీజేపీ. లేకుంటే జనసేనతో బీజేపీ. అదీకాకుంటే జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పొత్తులు పెట్టుకోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కేంద్రంలోని బీజేపీ సర్కారు సాగిస్తున్న అరాచక పాలనకు నైతిక బాధ్యత వహిస్తారా ! పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం సబబేనని సమర్థించుకుంటారా ! వంట గ్యాస్ ధర పెంపు సరైనదేనని టముకు వేసుకుంటారా ! విశాఖ ఉక్కు అమ్మకాన్ని ఆమోదిస్తారా ! ఐతే ఓకే. ఇవే సంగతులు జనానికి చెప్పండి సార్ !
అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గిన వేళ.. ప్రజలు కరోనాతో కునారిల్లుతున్న దుస్థితిలో పెట్రోలు, డీజిల్ ధరలను అమాంతం పెంచేశారు. 30 రూపాయల విలువలేని పెట్రోలును వంద దాటించారు. పాతిక రూపాయల డీజిల్‌ను వందకు చేర్చారు.
వంటగ్యాస్‌ను రెండు రెట్లు పెంచారు. కాషాయ పార్టీని చూస్తేనే ప్రజలకు అసహ్యం వేస్తుంటే.. మేం ముగ్గురం తగ్గేదేలేమంటున్నారు. ఈ ధరల పెంపును జనసేన, టీడీపీ, రాష్ట్ర బీజేపీ స్వాగతిస్తున్నాయా లేదో స్పష్టం చేయాలి. పెంచడం సమంజసమేనని ఓట్లు అడగాలి.
విశాఖ ఉక్కును అమ్మేసినా పర్లేదని ఓట్లు అడుగుతారా !
ఎన్నో ఆత్మ బలిదానాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంటును అత్యంత చౌకగా తాబేదార్లకు కట్టబెట్టాలని కేంద్ర సర్కారు కృత నిశ్చయంతో ఉంది. ఈపాటికే రైళ్లు, స్టేషన్లు అమ్మేశారు. టెలికం రంగాన్ని ప్రైవేటు ఆపరేటర్లకు బలిచేశారు. ఇనుము, బొగ్గు ఖనిజాలను కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టారు.
ఇప్పుడు సింగరేణి గనుల్లో బొగ్గు తవ్వకాలను తగ్గించి అదానీ బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. రూ.3,500కు దొరికే బొగ్గును రూ.24,500కు కొనుగోలు చేసేట్లు ఒప్పించారు. ఇంతకన్నా అరాచకం ఏముంటుంది ! దీన్ని సమర్థిస్థారో లేదా ముందు తేల్చండి ! ఇది సరైనదేనని ఓట్లు అడగండి.
విభజన హామీలు నెరవేర్చకున్నా మీకు ఆమోదమేనా ?
ఇంతవరకు విభజన హామీలు పూర్తిగా నెరవేరలేదు. ప్రత్యేక హోదాను అటకెక్కించారు. కడప స్టీల్ ప్లాంటు ఊసే లేదు. రెవెన్యూ లోటును పూర్తిగా చెల్లించలేదు. అయినా సరే మాకు సమ్మతమేనని ప్రజలకు చెబుతారా ! దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ప్రజల ఆస్తులను తాబేదార్లకు ధారాదత్తం చేస్తుంటే ఆమోదిస్తారా.. దీన్ని ప్రజలకు చెప్పి ఓట్లు అడగ్గలరా !
వ్యవసాయమనేది ఉమ్మడి అంశం. దీనిపై కేంద్రం పెత్తనం ఏమిటి ! వ్యవసాయ మార్కెట్లను తమ అదుపాజ్ఞల్లోకి తెచ్చుకొని అదానీకి అప్పజెప్పే పన్నాగానికి పాల్పడితే పంజాబ్ రైతులు వాతలు పెట్టారు. తిరిగి అవే సాగు చట్టాల ముసాయిదాలను దొడ్డిదోవన అమలు చేయడానికి కేంద్రం పూనుకుంటోంది. నదులపై హక్కులు ఎవరివి.. వాటికి కేంద్రం బోర్డులు ఏర్పాటు చేయడాన్ని ఎలా ఆమోదిస్తారు ! రాష్ట్ర హక్కులను కేంద్రానికి తాకట్టు పెడతారా !
అసలు రాష్ట్ర విద్యుత్ రంగంపై కేంద్రం అజమాయిషీ ఏంటీ ! కేంద్ర ముసాయిదా చట్టం ప్రకారం డిస్కంలను ప్రైవేటుకు ఇస్తారా ! అందుకోసమే కదా వైసీపీ సర్కారు మీటర్లు పెట్టింది ? మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న మీరు అందుకు ఒత్తిడి చేస్తున్న కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు ! మీ దోబూచులాట.. పిల్లిమొగ్గలను జనం నిశితంగా గమనిస్తున్నారు. మీ వైఖరి ఇలాగే ఉంటే.. మళ్లీ అన్నయ్యే వస్తాడు. ఈసారి బాదుడే బాదుడు కాదు. ఇరగదీసి కుమ్ముడే కుమ్ముడు.. అంతే ! ఆ తర్వాత మీ ఇష్టం.
- Encourage Independent Journalism