జన గణ మన సినిమాతో వ్యవస్థనే ప్రశ్నించేశాడు దర్శకుడు. సినిమా చూస్తున్నంత సేపు మనకు దిశ సంఘటనే గుర్తుకు వస్తుంటుంది. సమాజంలోని విద్యా, న్యాయ, పోలీసు, రాజకీయ వ్యవస్థలన్నింటిపై ప్రశ్నలు కురిపించాడు. వాటి ఉనికి మీదే అనుమానం కలిగించాడు. సమాజంలో ఇవి ఎలాంటి స్థితిలో ఉన్నాయో చూపించాడు. వర్ణ వివక్ష, కుల, మత, జాతి విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపించాడు. ఓ రైతు బిడ్డ రైతుగానే మిగిలిపోవాలా? ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్తే నేరమా? వెళ్లనివ్వదా ఈ సమాజం అని సూటిగా ప్రశ్నించాడు.
ఇక మీడియా చేసే రాద్దాంతం మీద ఘాటుగా చురకలు అంటించాడు. ఏ వార్తకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో, ఏ వార్తను సెన్సేషన్ చేయాలో.. నేషన్ మూడ్‌ను ఎలా కంట్రోల్ చేయాలో అన్నీ కూడా మీడియానే చేస్తోందని సెటైర్లు వేసినట్టుంది. మనం నిజాలను మరిచిపోయి.. మీడియా చెప్పిందే నిజమేమో అని భ్రమపడేలా చేస్తోందని మండిపడ్డారు.
ఇందుకు నిదర్శనంగా ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ ఉదంతాన్ని ఉద్ఘాటించాడు. ఒకప్పుడు మీడియా ఆయన్ని దేశద్రోహి అని రాతలు రాసింది. చివరకు న్యాయస్థానం మాత్రం నిర్దోషిగా విడుదల చేసింది. ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. మీడియా మాత్రం నాడు దేశద్రోహి అంటూ రాసిన మచ్చ పోలేదని చెప్పుకొచ్చాడు.
అలా మీడియా ఈ సమాజంలో ఎలాంటి పాత్రను పోషిస్తోంది.. రాజకీయ నాయకుల చేతిలో పడి ఎలా అయింది.. ఏ వార్తను ఎలా రాస్తోంది.. నిజాలను దాచి మీడియా రాసిందే నిజమనుకునే పరిస్థితి వరకు వచ్చిందటూ చెప్పే కంక్లూజన్ అదిరిపోతుంది.
పోలీసు వ్యవస్థ డొల్లతనాన్ని కళ్లకు కట్టాడు..
ఇక పోలీసు వ్యవస్థ మీదా చురకలు అంటించాడు. ఎన్ కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది.. అసలు విచారణ చేసిన పద్దతి ఏంటి.. వారే దోషులు అని పోలీసులు ఎలా నిర్దారించారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. దిశ లాంటి ఓ ఘటన జరిగితే సమాజం మొత్తం కూడా నిందితులను చంపేయాలి.. ఎన్ కౌంటర్ చేసేయాలంటూ ఆగ్రహ జ్వాలతో రగలిపోతుంటుంది. ఈ సినిమాలోనూ అలానే జరుగుతుంది. వారిని ఎన్ కౌంటర్ చేసేస్తారు. అసలు వాళ్లు ఆ తప్పు చేశారా? లేదా? అని ఏ ఒక్కరూ ఆలోచించరు.

చివరకు ఇదే విషయాన్ని లాయర్‌గా అరవింద్ ప్రశ్నిస్తే.. వాళ్లను చూస్తేనే తెలుస్తుంది కదా? అని జడ్జ్ నోరు జారతాడు. రంగు, రూపం, వేషధారణ బట్టి కూడా చేస్తారా? అంటూ ఈ సమాజానికి కనువిప్పు కలిగేలా ప్రశ్నలు సంధించాడు. అసలు రాజకీయ నాయకులు ఈ వ్యవస్థను ఎలా వాడుకుంటున్నారు.. ఓట్ల రాజకీయం ఎలా ఉంటుందో చూపించాడు.
ఈ చిత్రం సీక్వెల్‌పై అంచనాలు పెంచింది..
ద్వితీయార్థం అంతా కూడా కోర్టులో వాదనలు, ప్రతివాదనలతోనే సరిపోతుంది. లాయర్ అరవింద్ ఇలా వాదిస్తున్నాడేంటి అని మొదట్లో అనిపించినా.. ముందుకు వెళ్తున్న కొద్దీ అసలు కథ బయటకు వస్తుంది. ఇక అలా పోతూ ఉంటే ట్విస్టులకు కొదవే ఉండదు. మొత్తానికి ఇది అంతం కాదు ఆరంభం అంటూ చివర్లో వదిలిన క్లూతో.. సీక్వెల్ మీద అంచనాలు పెంచేశాడు.
జన గణ మన సినిమా అందరికీ కనువిప్పుగా ఉంటుంది. ఎవరిని.. ఎవరు.. ఎలా.. ఎందుకు ప్రభావితం చేస్తున్నారు.. చుట్టూ ఉన్న సమాజంలో నిజానికి చోటు ఎంత ఉంది.. అబద్దానికి బలం ఎంత ఉంది? అనేది చూపించాడు. న్యాయ వ్యవస్థ మీద జనాలకు ఉన్న నమ్మకం ఎంతనేది, విద్యార్థి లోకాన్ని బాగా చూపించాడు దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ.
ఈ కథను రాసింది షరీస్ మహమ్మద్. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించారు. సినిమా ముగిసిన తరువాత పృథ్వీ రాజ్ పాత్ర సంధించిన ప్రశ్నలు మాత్రం మెదడుని తొలిచేస్తూనే ఉంటాయి. మరోసారి హ్యాట్సాఫ్ టు పృథ్వీరాజ్ సుకుమారన్.
సేకరణ : Das Vanthala FB wall నుంచి