“ఇప్పుడు మనకు కావాల్సింది బట్టీపట్టే చదువులు కాదు. ప్రశ్నలకు జవాబులు రాసే పరీక్షలు కాదు. ప్రశ్నలు ఉద్భవించే చదువులు కావాలి. సమస్యను ఇచ్చి పరిష్కరించమనే పరీక్షలు ఉండాలి. పిల్లల్లో సృజనాత్మకతను గుర్తించే విద్యా విధానం రావాలి. నారాయణ, చైతన్య సంస్థల వల్ల ఏదో నాలుగు ముఖ్యమైన చాప్టర్లు వల్లెవేసే దౌర్భాగ్యపు చదువుల్లోకి పిల్లలను నెట్టేస్తున్నాం. నాలుగు ఇంగ్లిష్ ముక్కలు మాట్లాడినంత మాత్రాన విజ్ఞానవంతులైపోరు. దీనికి భిన్నంగా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునే స్థాయికి భావితరాన్ని తీర్చిదిద్దాలి.” అంటూ ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు వ్యక్తం చేశారు. ‘తెలుగిల్లు’కు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఇవే.
నర్సరీ నుంచే పిల్లలను స్కూలుకు పంపుతున్నాం. ఆ పసివాడు దేనితో ఆడుకుంటున్నాడు. ఆటపాటల ద్వారా ఏం నేర్చుకుంటున్నాడనే పరిశీలన అవసరం. డే టు డే పరిశీలించి నెలవారీ నివేదికలు రూపొందించాలి. కొత్త విషయాలు ఏం నేర్చుకున్నాడనేది ప్రతీ చిన్నారి లెర్నింగ్ షీట్ తయారు చేయాలి.
ఏఏ విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారనేది గమనించాలి. కిండర్ గార్డెన్ వరకు ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు.. ఏం మాట్లాడుతున్నారు.. దేన్ని ఆసక్తిగా వింటున్నారు.. మరి దేన్ని తదేకంగా చూస్తున్నారనేవి విద్యార్థి వారీగా మొత్తం విశదీకరించాలి. అప్పుడు మాత్రమే సరైన పునాదులు వేయగలుగుతాం.
బట్టీ పట్టే విధానానికి స్వస్తి చెప్పాలి..
ప్రాథమిక విద్య నుంచే బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలకాలి. నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. సంగీతం.. క్రీడలు.. ఇతర వ్యాపకాలపై ఆసక్తిని రేకెత్తించాలి. క్లాస్ రూంలో పుస్తక పఠనం పరిమితంగా ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్కు ప్రాధాన్యమివ్వాలి. ఉపాధ్యాయులు బోధించిన దానికి భౌతిక ఉదాహరణలు చూపించగలగాలి.
పరీక్షలంటే బట్టీ పట్టి రాసేదిగా ఉండకూడదు. సమస్యను ఇచ్చి పరిష్కరించమనాలి. దాన్ని ఎలా పరిష్కరిస్తున్నానేది ప్రామాణికంగా తీసుకోవాలి. ఓ విద్యార్థికి వ్యక్తిగత పరీక్షే కాదు. బృందంతో కలిసి సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించాలి. ఓ సమస్యను పరిష్కరిస్తే దాని వెంటనే పది ప్రశ్నలు ఉద్భవించేట్లు తీర్చిదిద్దాలి.
ఇలాంటి విద్యా విధానంతోనే పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. హైస్కూలు విద్య నుంచే భారత రాజ్యాంగం, చరిత్ర పాఠ్యాంశాలుండాలి. అదీ మాతృ భాషలోనే కొనసాగాలి. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని గ్రహించే శక్తిని అనేక రూపాల్లో ప్రోత్సహించాలి. చూడడం.. వినడం.. చదవడమే కాదు. ప్రాక్టికల్స్ ద్వారా నాలెడ్జ్ అందించాలి.
పన్నెండో తరగతి వరకు చదివినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలి
పన్నెండో తరగతి వరకూ పరీక్షలనేవి కేవలం విద్యార్థి వ్యక్తిగత పరిశీలన కోసమేనన్నట్లు నిర్వహించాలి. అవి అంతర్గత పరిశీలన కోసమే వినియోగించాలి. దేనిపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాడనేది స్కూలు రికార్డు అందించగలగాలి. పన్నెండో తరగతి చదివినట్లు మాత్రమే సర్టిఫికెట్ ఇవ్వాలి. మార్కులు.. ర్యాంకుల ప్రస్తావన ఉండకూడదు.
అక్కడ నుంచి ప్రవేశ పరీక్షల ద్వారా తమకు నచ్చిన రంగంలో ఉన్నత చదువులను ఎంచుకుంటారు. పన్నెండేళ్ల పాటు స్కూలు విద్య ఆ విద్యార్థిని సమున్నత భావాలతో కూడిన యువతగా మార్చేస్తుంది. ఇష్టమైన చదువులో గొప్ప గొప్ప ఆవిష్కరణలకు ఊపిరులూదుతారు. ప్రపంచం తల పైకెత్తి చూసేలా సమాజ ఉన్నతికి బాటలు వేస్తారు.
జాతిపిత కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ఆచరణాత్మక కార్యాచరణను అందించగలుగుతారు. విలువలతో కూడిన వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తారు. ఇవన్నీ ఈ ప్రభుత్వాల నుంచి ఆశించడం పేరాశేనేమో. ఎప్పటికైనా ఇలాంటి విద్యా విధానంతోనే మనం ప్రగతి బాటలో పయనించగలం.