ఆయనేం చిన్నాచితకా వ్యక్తి కాదు. అధికార వైసీపీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. కనుమూరి రఘురామకృష్ణం రాజుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. పార్టీ అతని లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్‌కూ నోటీసులిచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆయన ఇప్పటికీ అధికార పార్టీ ఎంపీగానే కొనసాగుతున్నారు. కొద్దిరోజులుగా రచ్చబండ పేరుతో రఘురామ లేవనెత్తుతున్న అనేక అంశాలు నేడు ప్రజల మస్తిష్కాల్లో తిరుగుతున్నాయి. జవాబుల్లేని అనేక ప్రశ్నలున్నాయి. వాటికి క్లారిటీ ఇస్తారా.. మౌనమే సమాధానమంటారా !
నిన్నటి రచ్చబండలో రఘురామ పలు అంశాలు లేవనెత్తారు. గడచిన మూడేళ్లలో గత ప్రభుత్వం కొనసాగించిన పథకాలకు అదనంగా వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడిలాంటి వాటికి వెచ్చించింది సుమారు రూ. 8వేల పై చిలుకు కోట్లు మాత్రమే.
పేర్లు మార్చినా గతంలో కొనసాగిన పథకాలకు ఎంతయితే ఖర్చు పెట్టారో ఇప్పుడూ కొద్దిగా అటోఇటో అంతే వ్యయం చేశారు. మరి రూ. 5 లక్షల కోట్లు అప్పులు ఎందుకయ్యాయని ప్రశ్నించారు. దీనిపై కాగ్ అడిగినా లెక్కలు చెప్పడం లేదని ఆరోపించారు. మూడేళ్లలో అన్ని లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పలేరా !
గతంలో కళాశాలలకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంటు, వసతి దీవెన పథకాల సొమ్మును తల్లుల ఖాతాలకు వేయడంలో ఆంతర్యం ఏమిటి ! తల్లుల ఖాతాలో వేసిన సదరు సొమ్ము తిరిగి మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి చేరుతుందని రఘురామరాజు ఆక్షేపించారు. దీని వల్ల విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు.
పది రూపాయలు పెట్టి టీ తాగితేనే డిజిటల్ చెల్లింపులు చేస్తున్న నేటి కాలంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు ఇందులో ఏదైనా లోగుట్టు ఉందేమోననే అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు ఉండేది. బడుగుల విదేశీ విద్యకూ సాయం అందేది. అవన్నీ రద్దు చేశారు. ఎస్సీఎస్టీబీసీ, మైనార్టీల స్వయం ఉపాధికి ఆయా సంక్షేమ శాఖల ద్వారా నిధులు వెచ్చించేది. వాటన్నింటినీ అటకెక్కించారు.
కొత్త పరిశ్రమలు రాక నిరుద్యోగం పెరిగి యువత అల్లాడుతోంది. ఇన్ని అప్పులు చేసి ఒక్క పరిశ్రమ స్థాపించారా.. కొత్తగా ఉద్యోగాలు కల్పించారా అంటే లేదు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని రఘురామరాజు ప్రశ్నించారు.
ఇలా అనేక అంశాలపై రఘురామకృష్ణంరాజు తన అనుమానాలు, అభిప్రాయాలను ప్రజల ముందుంచుతున్నారు. అవి తప్పు అనో వాస్తవమనో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. లేకుంటే అవి జవాబుల్లేని ప్రశ్నలుగానే ప్రజల మస్తిష్కాల్లో నిల్చిపోతాయి. ప్రభుత్వంపై అనుమానాలను రేకెత్తిస్తాయి. రఘురామ అధికార పార్టీ ఎంపీగా ఈ అంశాలన్నింటినీ అడుగుతుంటే.. రేపు జనం కూడా అడుగుతారు కదా ! ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి మరి.