వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్)ని వరుసగా రెండోసారి నియమించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమకు పీకేతో పనిలేదని వైసీపీ పెద్దలు ప్రకటించారు. తాజాగా ఐ– ప్యాక్ లోని రిషితో మరోసారి వైసీపీ చేతులు కలపనున్నట్లు సమాచారం. బుధవారం తాడేపల్లిలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో వైసీపీ అధినేత సీఎం జగన్ అధికారికంగా ఈ విషయంపై ప్రకటించే అవకాశం ఉంది.
ఇటీవల పూర్తి చేసిన ‘గడప గడపకూ ప్రభుత్వం’ పై సమీక్షించేందుకు వివిధ జిల్లాల ఇన్చార్జి మంత్రులు, పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ మాట్లాడతారు. ఐ-ప్యాక్ టీమ్ లీడర్ రిషి రాజ్ సింగ్ను పార్టీ నేతలకు జగన్ పరిచయం చేస్తారని తెలుస్తోంది. రిషి సూచించిన వ్యూహాల ప్రకారం ఎలా పని చేయాలో వారికి దిశానిర్దేశం చేస్తారు.
వచ్చే ఎన్నికల్లో వరుసగా పార్టీ విజయం కోసం కృషి చేసేందుకు వైసీపీతో ఐ-ప్యాక్ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. మే రెండో వారం నుంచి పార్టీ క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించింది. ఐప్యాక్ సభ్యుల బృందం వచ్చే ఎన్నికల్లో పార్టీ అవకాశాలు పార్టీ అభ్యర్థుల సానుకూల ప్రతికూల అంశాలపై అట్టడుగు స్థాయి నుంచి వివరాలను సేకరించే పనిని కూడా ప్రారంభించింది.
సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు బృంద సభ్యులు కార్యాచరణలోకి దిగారు. ఆటుపోట్లను పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మార్చడానికి ఏం చేయాలనే దానిపై ఐప్యాక్ సభ్యులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు.
ఐప్యాక్ టీమ్ సభ్యుల మరో బృందం కూడా మీడియా నిర్వహణ సమస్యలపై పని చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ మీడియా విభాగాలు సక్రమంగా ప్రసారం చేయగలుగుతున్నాయా.. పార్టీకి మీడియాకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉందా అని బృందం సభ్యులు ఆరా తీస్తున్నారు.
తటస్థ వైఖరిని కొనసాగించే మీడియా సంస్థలను గుర్తిస్తున్నారు. ఏవో తాయిలాలు పెట్టి అలాంటి మీడియా సంస్థలను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అనుకూల మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులను కూడా ఆకర్షించేందుకు ఐ-ప్యాక్ వ్యూహాలు రచిస్తోంది.
దీనిపై ఓ సీనియర్ జర్నలిస్టు స్పందిస్తూ “చంద్రబాబు సర్కారు హయాంలో కరవు కాటకాలు జనాన్ని పీడించాయి. విద్య, వైద్యం తలకు మించిన భారమైంది. సీఎం అమరావతి రాజధాని జపం చేయడం తప్ప మిగతా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదు. వైసీపీ ఇచ్చిన హామీలతో ఓ సారి చూద్దామని జగన్కు అవకాశమిచ్చారు.
ఈ ప్రభుత్వం గడచిన మూడేళ్లలో ఉన్న పథకాలు ఎత్తేసి కొత్తవి తెచ్చింది. కరోనాతో చిద్రమైన సగటు ప్రజల జీవితాలను నిలబెట్టడానికి నవరత్నాలు సరిపోతాయనే భ్రమల్లో ఉంది. నిత్యావసరాలు, పెట్రో, గ్యాస్ ధరలతోపాటు రవాణా, కరెంటు చార్జీలు బెంబేలెత్తిస్తున్నాయి. వీటి నుంచి ప్రజలను ఏమార్చడం అంత తేలిక్కాదు!’ అని వ్యాఖ్యానించారు.