బీజేపీకి జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో బలమైన పార్టీలే గట్టి పోటీనిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్కుప్రత్యామ్నాయం గా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీని ఎదిరించడానికి చాలా పార్టీలు భయపడడానికి కారణం సీబీఐ, ఈడీ అండ్ ఐటీ శాఖలు మోదీ షాల జేబులో ఉండడమే అనేది బహిరంగ రహస్యం. అందుకే కేసీఆర్ మోడీపై డైరెక్ట్ అటాక్ చేస్తుంటే.. ఇదంతా లాలూచీ కుస్తీ అనే చాలామంది అనుకున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా ఇది లాలూచీ కుస్తీ కాదు.. సీరియస్ పోరాటమే అనే సంకేతాలు ఇవ్వడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రంలో అధికారం నిలుపుకోవాలన్నా కేసీఆర్‌కు కొత్త అజెండా కావాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు రూపంలో కేసీఆర్‌కు ఓ అస్త్రం దొరికింది. తర్వాత ఎన్నికల్లో కేసీఆర్‌కు ఇంకో అస్త్రం కావాలి. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి మోడీని, బీజేపీని ఎంత విమర్శించినా పెద్దగా మైలేజ్ రాదు.
“దేశం కోసం నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నా, నాకు మద్దతు ఇవ్వండి’’ అని ప్రజలకు అప్పీల్ చేయడం కేసీఆర్‌కు తేలిక. ఇది అటు లోక్ సభ స్థానాలే కాదు.. అసెంబ్లీ స్థానాలు గెలవడానికి కూడా జాతీయపార్టీ అనేది కేసీఆర్‌కు ఉపయోగపడుతుంది.
ఒకవేళ మోదీషా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభకు ముందస్తుగా ఎన్నికలకు వెళ్లినా.. మోడీ హవాని తెలంగాణలో ఆపడానికి కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ ఉపయోగపడుతుంది. ఒక జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్‌కు వస్తే ప్రధానమంత్రి అనే కొండ వస్తుంది. ఆ కొండ రాకపోతే కనీసం రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడానికి అయినా ఉపయోగపడుతుంది. అందుకే కేసీఆర్ జాతీయపార్టీ ఆలోచన చేస్తున్నట్లు భావించొచ్చు.
కేసీఆర్ జాతీయ పార్టీలో పీకే చేరతారా !
ఇక పీకే విషయానికొస్తే ఆయన కేసీఆర్ దగ్గర డబ్బు కోసం పనిచేస్తున్నాడా..నిజంగానే కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకంతో పనిచేస్తున్నాడా అనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది. పీకే గనుక కేసీఆర్ పెట్టే పార్టీలో చేరి బాధ్యతలు తీసుకుంటే నమ్మకం ఉన్నట్లు స్పష్టమవుతుంది. ప్రశాంత్ కిషోర్‌కు చాలా రాజకీయ ఆశలున్నాయి. అంతకుముందు నితీష్ కుమార్ కి చెందిన జేడీ(యు) లో అయన కొన్నాళ్లున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించి ఫెయిలయ్యారు. ఇప్పుడు బీహార్ లో పాదయాత్ర చేస్తున్నారు.
మతతత్వ అజెండా స్థానంలో ప్రజా సమస్యలకు చోటు
రాజకీయంగా ఎదగాలని ఆశ ఉన్న ప్రశాంత్ కిషోర్ తన సలహాలతో కేసీఆర్ స్థాపిస్తున్న పార్టీలో చేరడంపై అభ్యంతరం ఉండకూడదు. కేసీఆర్‌కు పీకే కేవలం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గానే ఉండిపోతే ఆయన కేసీఆర్ దగ్గర డబ్బు కోసం పనిచేస్తున్నట్లు అనుకోవచ్చు. కేసీఆర్ జాతీయ పార్టీ వల్ల ప్రజలకి మాత్రం కొంత మంచి జరిగే అవకాశం ఉంది. బీజేపీని గట్టిగా నిలదీసే ఒక కొత్త గొంతు దేశానికి దొరుకుతుంది. రాజకీయ చర్చల్లో మతతత్వ అజెండా స్థానంలో కొద్దిగా అయినా ప్రజల సమస్యలు అజెండాగా మారే అవకాశం ఉంది. ఈ మేరకు కేసీఆర్ కొత్త పార్టీ వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది.
Contribute to Telugillu
Encourage Independent Journalism
