“ రోజూ బండిపై తీసుకెళ్లి పాలు పోసి రావడానికి 70 కిలోమీటర్లు తిరగాలి సార్. పెట్రోలు ఖర్చు పెరిగింది. డీజిల్ రేట్లు పెరగడంతో వంట నూనెల దగ్గర నుంచి అన్ని రేట్లు పెరిగాయి. ఏదో నాలుగు పాడి గేదెలు పెట్టుకొని బతుకుదామనుకుంటే పెరిగిన ధరలతో గిట్టుబాటవడం లేదు. కుటుంబం జరగడానికి సరిపోకుంటే ఇంకేం చెయ్యాలి సార్ !” అంటూ అతను పాల క్యాన్లను బండిపై సర్దుకుంటూ వాపోయాడు. గుంటూరు సమీపంలోని ఓ కుగ్రామం నుంచి వచ్చి పాలు పోసే వ్యక్తి ఆవేదన ఇది.
“అన్నీ పెరిగాయి. అదేమంటే రవాణా ఖర్చులు పెరిగాయంటున్నారు. అందుకే ప్రతీ వస్తువు ధర పెరుగుతుందంటున్నారు. మరి మావారికి వచ్చే జీతం పెరగలేదు. వచ్చే ఆదాయానికి వ్యయానికి పొంతన లేదు. దొరికిన చోటల్లా అప్పులు చేస్తున్నాం.
ఎన్నాళ్లిలా.. మీకు చేయూత పథకం ఇస్తున్నాం. అమ్మ ఒడి ఇస్తున్నామంటారు. గతం కంటే 30 శాతం ఖర్చు పెరిగింది. ఈ పథకాల డబ్బులెంత.. పెరిగిన ఖర్చెంతో వాళ్లకు లెక్క తెలియదా !” అంటూ ఒంగోలుకు చెందిన ఓ ప్రైవేటు చిరుద్యోగి భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది.
టిఫిన్ బండ్లు పెట్టుకున్న వాళ్లు దివాళా తీస్తున్నారు..
ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్లూ వీళ్లూ అన్లేదు. అన్ని వర్గాల ప్రజలు కనీసం నిత్యావసరాలు కొనుక్కునేందుకే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయాలు పెరగడం లేదు. ఇంటి ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
“ గుంటూరులోని ఏ సెంటర్లోనైనా టిఫిన్ బండి వ్యక్తిని అడగండి. పెరిగిన ధరలతో నష్టాల పాలవుతున్నట్లు చెబుతారు. ఈ రోజు కనిపించిన టిఫిన్ బండి నాలుగు రోజుల తర్వాత కనిపించదు. నష్టాన్ని తట్టుకోలేక బండి తీసేసి హోటల్లో పనికి వెళ్తున్నారు !”అంటూ రాజేష్ అనే అతను తానూ టిఫిన్ బండితో నష్టాల పాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రజల బాధలు వదిలేసి తిట్టుకునే నేతలు అవసరమా !
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు పెరుగుతున్న ధరలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరి వీటి గురించి మన ప్రియతమ నేతలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు ! జీఎస్టీ వస్తే అన్ని సరకుల ధరలు తగ్గుతాయని నమ్మ బలికారు. స్లాబులను మార్చేసి విపరీతంగా పన్నులు బాదేస్తున్నారు. దీనికి తోడు పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో రవాణా ఖర్చు పెరిగి ఆ భారమంతా ప్రజల నెత్తినే పడుతోంది. సగటు ప్రజలు ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని మన నేతలు కేంద్రాన్ని నిలదీసే దమ్ముందా !
ఇప్పుడు గడప గడపకూ మన ప్రభుత్వమంటూ నేతలు ఇళ్లకే వస్తున్నారు. కేంద్రాన్ని నిలదీసే సత్తా ఉందో లేదో అడగాలి. కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధులనే కాదు. ఎందుకు నోరు విప్పడం లేదని ప్రతిపక్ష టీడీపీ నేతలనూ ప్రజలు నిలదీయాలి. ప్రజలు ఇన్ని కష్టాల్లో ఉంటే ధరలు తగ్గించాలని ఎందుకు అడగరని బీజేపీతో దోస్తీ కట్టిన జన సైనికులను ప్రశ్నించాలి. ప్రజల బాధలను పట్టించుకోని ఇలాంటి పార్టీలకు అసలు ఓట్లు అడిగే నైతిక హక్కుందా ! ప్రజల సమస్యలు వదిలేసి పరస్పరం తిట్టుకునే నాయకులు మనకు అవసరమా.. ఆలోచించాల్సిందే.
Contribute to Telugillu
Encourage Independent Journalism
