తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీపై ఏపీలో అనేక రకాలుగా చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజనకు కేసీఆర్ కారణమంటున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ను ఎలా తిరస్కరించారో కేసీఆర్ పరిస్థితి ఏపీలో అంతేననే వాదన ముందుకు తెస్తున్నారు. ఇవన్నీ ప్రజలు పట్టించుకునే దశలో లేరు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఉక్రోషం ప్రజల్లో బలంగా నెలకొంది. విభజన హామీలు నెరవేర్చలేదనే బాధ ఉంది. 25 మంది ఎంపీలను ఇస్తే బీజేపీ మెడలు వంచుతానన్న పార్టీ నమ్మక ద్రోహం ఉంది. హోదా బదులు ప్యాకేజీకి తలొగ్గిన బేలతనం ఉంది. హామీలేవీ నెరవేర్చకున్నా బీజేపీని పల్లెత్తు మాట అనని కుటిల రాజకీయాల నుంచి ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు.
తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగాలే నాడు కేసీఆర్‌ను ఉద్యమానికి ఉసిగొల్పాయి. వాస్తవానికి ఆనాడు పార్లమెంటులో కాంగ్రెస్ విభజన బిల్లు పెట్టినా బీజేపీ మద్దతు ఇవ్వనిదే రాష్ట్ర విభజన జరిగే అవకాశం లేదు. కాంగ్రెస్ ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటే.. కాదు కూడదు పదేళ్లు ఇవ్వాల్సిందేనని బీజేపీ పట్టుబట్టింది. అలాంటి పార్టీ అధికారానికి వచ్చాక ఏపీ ప్రజలను వంచించింది. పార్లమెంటు సాక్షిగా దేశ ప్రధాని ఇచ్చిన హామీ చట్టంతో సమానం. దానికి బీజేపీ తూట్లు పొడిచింది. ఆ ఆక్రోశం ప్రజల్లో ఇప్పటికీ రగులుతూనే ఉంది.
ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నముస్లిం మైనార్టీలు
దేశ వ్యాప్తంగా బీజేపీ రెచ్చగొడుతున్న వైషమ్యాలతో ఇక్కడ ముస్లిం మైనార్టీ వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ప్రజల్లో చీలిక తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ నేతల వ్యాఖ్యలపై రాష్ట్రంలోని ప్రధాన పక్షాలైన వైసీపీ, టీడీపీ, జనసేన నోరెత్తడం లేదు. దీంతో ముస్లింలు, క్రిస్టియన్లు ఆయా పార్టీలపై కస్సుబుస్సుమంటున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో తాము వైసీపీ సహకరించేది లేదని క్రైస్తవ సంఘాలు బాహాటంగా ప్రకటిస్తున్నాయి. ఇదే భావన మూడు పార్టీల్లో ఉన్న ముస్లిం సోదరుల్లో బలీయంగా ఉంది.
ఏపీకి తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్‌ను కేంద్రం అమ్మేస్తామంటే ఇక్కడ మూడు పార్టీలు ఎన్నో నాటకాలు ఆడాయి. ఇక్కడ వ్యతిరేకిస్తున్నామంటారు. కేంద్ర పెద్దల దగ్గర సాగిలపడుతుంటారు. ఈ కుటిల రాజకీయాలను రాష్ట్ర ప్రజలు స్వయంగా చవిచూస్తున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్లు బీజేపీ గుజరాత్లో కన్నా ఏపీలోనే బలంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు బీజేపీ పక్షాన ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇప్పుడు బీజేపీ విధానాలను ధైర్యంగా ఎదుర్కొనే ప్రత్నామ్నాయ పార్టీని ప్రజలు ఆదరించడానికి సిద్దంగా ఉన్నారు.
బడుగు బలహీన వర్గాల్లో నెలకొన్న ఆక్రోశం
రాష్ట్రంలోని ఎస్సీఎస్టీబీసీ, మైనార్టీ వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. తమకు చెందాల్సిన వెల్ఫేర్ బడ్జెట్‌ను ఊరుమ్మడి పథకాలకు మళ్లించారనే ఆక్రోశం ఉంది. ఈ వ్యతిరేకత ప్రతిపక్ష టీడీపీకి ఏమేరకు మరలుతుందో చెప్పలేం. ఎందుకంటే గతంలో ఆ పార్టీ పాలనను తిరస్కరించి జగన్‌కు పట్టం గట్టారు. సరైన ప్రత్యామ్నాయం లేనందున మళ్లీ వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని ప్రతిపక్ష టీడీపీ ఊహల్లో విహరిస్తోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఒకప్పుడు ఢిల్లీలో వరుసగా మూడు సార్లు సీఎంగా చేసిన షీలా దీక్షిత్‌ను కేవలం ఓ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టి కోలుకోలేని దెబ్బతీశాడు. అదే స్థాయిలో బీజేపీని తిప్పికొట్టాడు. మొన్నటి ఎన్నికల్లో పంజాబ్‌లోనూ కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఆప్ విజయ దుందుభి మోగించింది. ఈ రెండు పార్టీల పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఇక్కడ కాంగ్రెస్ ఆనవాళ్లు లేవు. బీజేపీ వ్యతిరేకతే ఏపీలో కేసీఆర్ పార్టీ సత్తా చాటడానికి భూమిక అవుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ముఠాల కుమ్ములాటలు కేసీఆర్ పార్టీకి బలంగా మారొచ్చు. సోషల్ ఇంజనీరింగ్‌తో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యమిస్తూ సరైన అజెండాతో వస్తే ఎంపీ సీట్లు గెలవడమే కాదు. ఏకంగా అసెంబ్లీలో పాగా వేయొచ్చు.
Contribute Telugillu
Encourage Independent Journalism
