“అన్నా! ఎస్సీలు ఎస్సీ కాలనీల్లోనే నివసించాలా ! బయట ఉంటే కరెంటు రాయితీ ఇవ్వరా !” అంటూ ఆ యువకుడు ఫోన్ చేసి అడుగుతుంటే ఆశ్చర్యమేసింది. అసలు విషయమేమిటని ఆరా తీస్తే.. నెలకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం కరెంటు ఉచితంగా అందిస్తోంది. గత ప్రభుత్వాల నుంచి ఈ పథకం అమలవుతోంది. ఇప్పుడు ఎస్సీఎస్టీ పేటల్లో ఉన్నవాళ్లకే ఇది వర్తిస్తుందట. బయట ఎక్కడ ఉన్నా వర్తింపజేయడం లేదు. అందుకే కులాల వారీ వేర్వేరుగా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అది ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండల కేంద్రం. గూడు లేని పేదలకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల జాగాలు ఇచ్చింది. టంగుటూరులోని మాదిగలకు వాళ్ల పల్లెకు ఆనుకొని స్థలాలు వచ్చాయి. మాలలకు వాళ్ల నివాసాలకు సమీపంలోనే ఇచ్చారు.
ఓసీ, బీసీలకు ఆలకూరపాడు రోడ్డులోని ఓ రెండు కిలోమీటర్ల దూరాన భూమి కొని అందులో ప్లాట్లు కేటాయించారు. ఇక ఎస్టీలకు వెంకటాయపాలెం వద్ద ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తమాషా ఏమిటంటే లబ్దిదారులంతా ఆయా పల్లెల్లోమాత్రమే నివసించడం లేదు. ఉపాధి, అవసరాలకు తగ్గట్లు టంగుటూరు గ్రామంలో చాలా మంది నివాసముంటున్నారు.
గతంలో ప్రభుత్వాలు పేదలకు ఎక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చినా అన్ని కులాలకు కలిపి ఒకే చోట ఇచ్చేది. వైఎస్ హయాంలో ఇందిరమ్మ కాలనీలు అలాగే వచ్చాయి. అక్కడ అన్ని కులాలు నివాసముంటున్నాయి. ఎన్టీఆర్, టీడీపీ హయాంలో ఇచ్చిన ఎన్టీఆర్ కాలనీల్లోనూ కులాలకు అతీతంగా ఇళ్లు కట్టించి ఇచ్చారు.
గతంలో ఇదే టంగుటూరు గ్రామ పంచాయతీలో పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీలోనూ అన్ని వర్ణాల వారికి ప్లాట్లు దక్కాయి. ఇప్పుడు కులాలు చూడం.. మతాలు చూడబోమంటున్న ప్రభుత్వంలో కులాల వారీ వేర్వేరుగా ఇళ్ల జాగాలు ఇవ్వడం విశేషం.
కేవలం టంగుటూరులోనే ఇలా కులాలను వేరు చేస్తూ ఇళ్ల స్థలాలు ఇచ్చారా లేక రాష్ట్రమంతా ఇలాగే మంజూరు చేశారా అనేది తెలీదు. దీనిపై వైసీపీ కార్యకర్త ఒకరు స్పందిస్తూ “ అందరికీ ఒకేచోట ఇస్తే అగ్రవర్ణాలు అంగీకరించడం లేదు. బీసీలనైతే కలుపుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీలను వేరు పెడుతున్నారు. ఎక్కడ ఓట్లకు గండిపడుతుందోనని నాయకులూ కిమ్మనడం లేదు!” అని చెప్పాడు. కనీసం పేదల్లోనైనా కుల ప్రభావం తగ్గి ఐక్యత పెంపొందుందనుకుంటే.. ప్రభుత్వమే ఇలా కులాల వారీ ప్రజలను వేరు చేయడం విచారకరం.
Contribute telugillu
Encourage Independent Journalism
