రైతులపై ప్రేమ కురిపించడంలో అధికార ప్రతిపక్షాలు తెగ పోటీ పడుతున్నాయి. మేమంత చేశామంటే.. మేం అంతకన్నా ఎక్కువ చేశామంటూ మైకులతో మోత పుట్టిస్తున్నారు. ఇక వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఒకడుగు ముందుకేసి అసలు వార్తలు రాసే వాళ్లకూ శిక్షణ ఇవ్వాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వం నుంచి నేటిదాకా రైతులపై అంత అభిమానం చూపించి ఉంటే.. రైతులు వ్యవసాయం చేయలేక కాడి కిందేసి నగరాల్లో కూలీలుగా మారుతున్నారెందుకు ! వ్యవసాయం అంత బాగుంటే వాళ్ల వారసులు పంటల సాగు నుంచి ఎందుకు వైదొలుగుతున్నారు ?
పంటల బీమా పథకం అనేది ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న వాళ్లందరికీ ఇవ్వరు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల ఎవరైతే పంట నష్టపోయారో వారికి మాత్రమే పరిహారం ఇస్తారు. గతంలో బీమా కంపెనీలు పరిహారం ఎగవేసేందుకు సవాలక్ష కొర్రీలు వేసేది. ఈ గొడవంతా ఎందుకని ప్రభుత్వమే పంటల నష్ట పరిహారం చెల్లించడానికి పూనుకుంది.
కొన్ని పంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని నష్టాన్ని అంచనా వేసింది. ఎక్కువ పంటలు అధిక వర్షాలు, తుపాన్ల తాకిడితో దెబ్బతిన్నాయి. పత్తి, మిర్చి మాత్రం గులాబీ, తామర పురుగుల వల్ల నష్టం వాటిల్లింది. ఒక్కో రైతు లక్షల్లో పెట్టుబడిని కోల్పోయాడు. ప్రభుత్వం నుంచి అందిన సాయం మాత్రం నామమాత్రమే.
సాగు దారుడెవరు.. ఈక్రాప్‌లో నమోదవుతున్నదెవరు!
ఇదంతా ఒక ఎత్తయితే ఈ క్రాప్‌లో ఎవరి పేర్లు నమోదయ్యాయనేది కీలక అంశం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలు సాగు చేసేది 70 శాతానికి పైగా కౌలు రైతులే. ప్రభుత్వం సీసీఆర్సీ కార్డులు ఇచ్చిన వాళ్ల పేర్లు మాత్రమే ఈ క్రాప్‌లో నమోదు చేస్తారు. అసలు సెంటు భూమి లేకుండా పూర్తిగా కౌలుపైన ఆధారపడిన వాళ్లు 15 లక్షలమంది ఉంటారు. ఎకరా రెండెకరాలుండి మరికొంత కౌలుకు తీసుకునే వాళ్లు మరో 20 లక్షల మంది ఉంటారు.
ప్రభుత్వం సుమారు 6 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు ఇచ్చింది. వీళ్లలో భూ యజమానుల బంధువులు, స్నేహితుల పేర్లే 90 శాతం ఉంటాయి. ఇంకా అమెరికా, హైదరాబాద్, బెంగళూరులో ఉన్న వాళ్లు కూడా ఇక్కడ కౌలు రైతులుగా సీసీఆర్సీ కార్డులు పొందారు. వాస్తవ కౌలు సాగుదార్ల పేర్లు పది శాతానికి మించి ఈ క్రాప్‌లో నమోదు కాలేదు. గత ప్రభుత్వ హయాం నుంచి కౌలు రైతులు దగా పడుతూనే ఉన్నారు.
ఓ గ్రామాన్ని పరిశీలించి వాస్తవాలు నిగ్గు తేల్చాలి
ఇప్పుడు చెప్పండి. పంటలు సాగు చేసింది ఎవరు.. పరిహారం పొందింది ఎవరు ! అధికార ప్రతిపక్షాలకు చెందిన రైతు నేతలు కలిసి ఓ గ్రామానికి వెళ్లండి. సదరు గ్రామంలో ఎంత మంది కౌలు రైతులున్నారు.. అందులో ఎంతమంది పేర్లు ఈ క్రాప్‌లో నమోదయ్యాయో లెక్కలు తీయండి. అప్పుడు తేల్చండి కష్టమెవరిదో.. పరిహారం ఎవరికి చెందుతుందో ! అప్పటిదాకా మైకులు పగలగొట్టకుండా ఆలోచించి వాస్తవాలు తెలుసుకునేందుకు సిద్దం కావాలి.
ప్రతీ ఆర్బీకే పరిధిలో ఏఏటికాయేడు కౌలుకు భూమి కావాల్సిన వాళ్ల పేర్లు నమోదు చేయాలి. సాగు చేయని భూ యజమానుల నుంచి ప్రభుత్వమే భూమిని లీజుకు తీసుకొని కౌలు రైతులకు ఇవ్వాలి. కౌలు ధరను ప్రభుత్వం నిర్ణయించాలి. వివిధ పంటల పెట్టుబడికి తగ్గట్లు పంట రుణాలను పంటలు సాగు చేసేవాళ్లకు ఇప్పించాలి. విత్తనాల దగ్గర నుంచి అన్ని రకాల ఇన్పుట్స్ అందించాలి.
తర్వాత పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. పంట రుణాన్ని మినహాయించి మిగిలిన సొమ్మును రైతులకు ఇవ్వాలి. ప్రభుత్వం ఈ పాత్ర పోషించనంత కాలం రాష్ట్రంలో వ్యవసాయం బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. కనీసం ఆహార పంటల సాగు వరకైనా ఈ పద్దతిని పాటించాలి. దీంతో అధికార ప్రతిపక్షాలకు రైతులపై ఎంత ప్రేమ ఉందో తేలిపోతుంది.
Contribute telugillu
Encourage Independent Journalism
