సాగుకు యోగ్యం కాని 66 వేల ఎకరాల్లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వస్తున్నాయి. సుమారు 30 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ బీడు భూములను లీజుకు ఇస్తే ఎకరానికి రూ.30 వేలు కౌలు ఇప్పిస్తామని సీఎం జగన్ చెప్పారు. బావుంది. హర్షించాల్సిన అంశమే. మరోవైపు సాగు చేయాల్సిన భూమిలో తాము ఇక పంటలు పండించలేమని రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక కొంత.. కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ సక్రమంగా లేక పంటలు ముంపునకు గురై నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ప్రభుత్వానికి కనిపించడం లేదా !
కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ కింద రెండేళ్ల నుంచి సుమారు 35 వేల ఎకరాలను బీడు పెట్టినట్లు తెలుస్తోంది. ఈఏడాది అమలాపురం ఏరియా మొత్తం పంట విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలకే సరైన నిర్వహణ లేక డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. పంటల ముంపుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడ 80 శాతం కౌలు రైతులే పంటలు సాగు చేస్తారు. ఒక ఏడాది కౌలు చేసిన రైతు నష్టాల దెబ్బకు మరుసటి ఏడాది కనిపించడం లేదు. అర్బన్ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికుడవుతున్నాడు.
రాష్ట్ర వ్యాప్తంగా సెంటు భూమి లేని 15 లక్షలకు పైగా కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. సుమారు ఆరు లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు ఇచ్చామంటున్నారు. ఒక్కసారి ఆ జాబితాను పరిశీలిస్తే.. వాళ్లసలు నిజంగా కౌలు రైతులేనా అని ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది.
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు రైతుల నుంచి భూములు లీజుకు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా సాగు చెయ్యని భూయజమానుల నుంచి భూమిని లీజుకు తీసుకొని కౌలు రైతులకు అప్పగించవచ్చు. ఆ పని ప్రభుత్వం ఎందుకు చేయడం లేదనేది ప్రశ్న.
నిన్న విడుదల చేసిన పంటల బీమా పరిహారం కౌలు రైతుల్లో ఒక్క శాతానికి అందలేదని ఏపీ రైతు సంఘం నేత పి జమలయ్య వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి రైతులు తామర పురుగు వల్ల ఎకరానికి రూ. లక్షకు పైగా నష్టపోయారు.
వాతావరణ సమస్యల వల్ల పంట నష్టపోలేదంటూ ఇక్కడ మిర్చి రైతులకు పరిహారం చెల్లించలేదు. గులాబీ పురుగుతో పత్తి దిగుబడి రెండు మూడు క్వింటాళ్లకు పడిపోయింది. కేవలం రూ.3,600 మాత్రమే ఇచ్చారు. కౌలు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదని జమలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతీ 70 కుటుంబాలకు ఓ వలంటీరు ఉన్నాడు. ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలున్నాయి. ఎవరు పంటలు సాగు చేస్తున్నారు.. ఎవరు చేయడంలేదో గుర్తించడం ప్రభుత్వానికి అంత కష్టమా ! ఎకరానికి ఎంత నష్టం వాటిల్లిందనేది తెలుసు కోవడమూ కష్టం కాదు. అయినా వాస్తవాలు చూడకపోవడం ఉద్దేశపూర్వకమా.. అలసత్వమో ప్రభుత్వ పెద్దలే స్పష్టం చేయాలి.
Contribute telugillu
Encourage Independent Journalism
