“కొత్త పథకం ప్రకారం నేను నాలుగు సంవత్సరాలు సైన్యంలో పని చేస్తా. నెలకు రూ. 25,000-30,000 జీతం వస్తుంది. నాలుగేళ్ల తర్వాత నన్ను సైన్యం నుంచి తొలగించొచ్చు. అప్పుడు నేను పకోడీలు అమ్ముకోవాల్సిందే !’’ అంటూ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. భారత సైన్యంలోకి అడుగుపెట్టేందుకు రోహిత్ కుమార్ గత నాలుగేళ్లుగా సిద్ధమవుతున్నాడు. అతనిది రైతు కుటుంబం. పేదరికం నిరంతరం తోడుగా ఉంటుంది.
రోహిత్ సొంతూరు బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా ఆనంద్‌పూర్. సైన్యానికి “కటాఫ్ మార్కులు” అనే ప్రశ్న లేదు కాబట్టి కుమార్ సైన్యంలో చేరేందుకు దృష్టి సారించాడు. ఇప్పుడు అగ్నిపథ్ పథకం కింద నాలుగు సంవత్సరాల పాటు యువకులను నియమించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇది అతని ఆశలపై నీళ్లు చల్లింది.
ప్రతి బీహార్ గ్రామంలో యువకుల గుంపులు తెల్లవారుజామున కఠినమైన వ్యాయామాలు చేయడం అసాధారణం కాదు. ఆర్మీ ఉద్యోగాలపై గౌరవం, ఆర్థిక భద్రత వల్ల వాళ్లను త్రివిధ దళాల్లోకి వెళ్లేట్లు చేస్తోంది. ఈ పథకం ప్రకారం నాలుగేళ్ల వ్యవధి పూర్తయిన తర్వాత శాశ్వత క్యాడర్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అగ్ని వీరుల్లో 25 శాతం మందికే సాయుధ బలగాల్లో అవకాశం
అయితే మొత్తం అగ్నివీరుల్లో కేవలం 25 శాతం మందిని మాత్రమే సాయుధ బలగాల్లోకి తీసుకుంటారు. అగ్నివీర్లకు మొదటి సంవత్సరంలో రూ . 4.76 లక్షలు లభిస్తాయి, నాలుగో సంవత్సరంలో రూ. 6.92 లక్షలకు అప్‌గ్రేడ్ అవుతుంది.

ఆర్మీ ఉద్యోగార్ధులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన రోజు నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మొదట బీహార్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి, అక్కడ ఆశావహులు రోడ్లు, రైల్వే ట్రాక్‌లను దిగ్బంధించారు. జెహానాబాద్, నవాడా, ఛప్రా, సహర్సా, ముజఫర్‌పూర్‌తో సహా అర డజనుకు పైగా జిల్లాల్లో నిరసనల సందర్భంగా వాళ్లు రైలుకు నిప్పంటించారు. బస్సును తగులబెట్టారు. హింసాత్మక చర్యలకు దిగారు. దాదాపు రెండు డజన్ల రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. ఇతర మార్గాల్లో కుదించారు.
పూర్వపు పద్దతిలో నియామకం కొనసాగించాలని నిరసనలు
నవాడలో స్థానిక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అరుణాదేవి వాహనంపై ఆందోళనకారులు దాడి చేశారు. వాహనంలో పార్టీ జెండాను చూసి ఆందోళనకారులు రెచ్చిపోయి ఉంటారని ఆమె విలేకరులతో అన్నారు. ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు.
బీహార్‌తో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లో నిరసనలు కొనసాగాయి. ఈ నిరసనలు చాలావరకు యాధృచ్చికంగా జరిగినవే. ప్రభుత్వం ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పూర్వపు పద్దతిలో నియామకం చేపట్టాలని నినదించారు.
పాట్నాలోని కార్గిల్ చౌక్ వద్ద అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఏఐడీఎస్వో కార్యకర్తలు నిరసన తెలిపారు. బీహార్‌లోని ఛప్రా జిల్లా మఖ్దుమ్గంజ్కు చెందిన పద్దెనిమిదేళ్ల శైలేష్ కుమార్ రాయ్ కూడా ఆర్మీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
“నేను ఆర్మీకి తప్ప మరే సెక్టార్‌కి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అమలు చేస్తే నా జీవితమంతా నాశనమతుంది’ అని రాయ్ వాపోయాడు.“జూన్ 20 నుంచి మేం నిరసన కొనసాగిస్తాం. అవసరమైతే ఢిల్లీ దాకా వెళ్తాం. ఆర్మీలో చేరిన తర్వాత నేను స్థిరమైన కెరీర్‌ను కలిగి ఉంటాననే ఆశతో నేను రెండేళ్లుగా సిద్ధమవుతున్నా. ఇప్పుడు కేవలం నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగిగా మారాల్సి వస్తుందని రాయ్ అన్నాడు.
ఎమ్మెల్యేలు.. ఎంపీలు నాలుగేళ్లకోసారి ఎన్నికవుతారా !
ఇతర పోటీ పరీక్షలకు అవసరమైన వనరులు లేనందున గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత శారీరక ధృడత్వం సాధించే దిశగా సాధన చేస్తారు. వైద్య పరంగా ఫిట్‌గా ఉండేట్లు జాగ్రత్తలు పడతారు. అందుకే దాదాపు ప్రతి బీహార్ గ్రామంలో యువకుల సమూహాలు ఉదయాన్నే పరిగెత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయడం పరిపాటిగా మారింది.
‘‘ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి ఐదు కిలోమీటర్లు పరిగెత్తాం. ఆ తర్వాత మేము శారీరక వ్యాయామాలు చేస్తాం. తర్వాత ఇంటికి తిరిగి వచ్చి ఇంటి పనులు చేసుకుంటూ చదువుకుంటాను. మళ్లీ సాయంత్రం ఇలాగే చేస్తాం. ఇంత కష్టపడి నాలుగేళ్లకు పరిమితమైన ఉద్యోగంలో చేరడం అర్థరహితం”అని చెప్పాడు.
ఏసీ గదుల్లో ఉండేవాళ్లకు మా బాధలేం తెలుసు !
నాలుగేళ్లుగా ప్రిపేర్ అవుతున్న ఛప్రాకు చెందిన చంద్రకేత్ కుమార్ ది కూడా ఇదే ఆలోచన. “ ఉదయం 4 లేదా 5 గంటలకు అందర్నీ నిద్రలేపి రన్నింగ్‌కు తీసుకెళ్లాలి. అలసటగా ఉన్నా నిద్ర పట్టకున్నా పట్టించుకునేది లేదు. నాయకులు ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చుని తమకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని సౌకర్యాలను ఉచితంగా పొందుతారు ”అని ప్రభుత్వ నేతల తీరును కుమార్ ఎండగట్టాడు.
“కేవలం నాలుగు సంవత్సరాల ఉపాధి హామీ కోసం దేశం కోసం తమ ప్రాణాలను అర్పించడానికి ఏ యువకుడూ ఇష్టపడడు. నాలుగేళ్ల తర్వాత పదవీ విరమణ చేయాల్సి వస్తే ఎవరైనా ఆర్మీలో ఎందుకు చేరతారు? నేతల కోసం ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు తీసుకువస్తుందా? ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నాలుగేళ్లకోసారి ఎన్నికవుతారా?” అని కుమార్ ప్రశ్నించారు.
మమ్మల్ని నాశనం చేసినా భవిష్యత్ తరం కోసం పోరాడతాం
త్వరలో కటాఫ్ వయస్సును అందుకోలేనని కుమార్ ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వం మమ్మల్ని నాశనం చేసింది, అయితే భవిష్యత్తులో సైన్యానికి సిద్ధమయ్యే యువత అభ్యున్నతి కోసం తాము ఆందోళన చేస్తామని చెప్పాడు.
సాధారణ ఆర్మీ ఉద్యోగార్ధులు కాకుండా, నిరసనకారులలో రెండు సంవత్సరాల క్రితం వైద్య పరీక్షలలో ఉత్తీర్ణులైన యువకులు ఉన్నారు, అయితే కొవిడ్ వ్యాప్తి కారణంగా వారి వ్రాత పరీక్షలను వాయిదా వేశారు. అగ్నిపథ్ స్కీమ్‌లో మొత్తం ప్రక్రియను మళ్లీ మళ్లీ పూర్తి చేయాలనే ఆందోళన ఈ అభ్యర్థుల్లో ఉంది .
“నేను రన్నింగ్ టెస్ట్‌కు అర్హత సాధించా. మెడికల్ టెస్ట్ కూడా పాసయ్యాను. కానీ గత ఏడాదిన్నర కాలంలో రాత పరీక్ష ఎనిమిది సార్లు వాయిదా పడింది. ఇప్పుడు అగ్నిపథ్ పథకం కింద ఇప్పటికే రన్నింగ్, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు కూడా మొత్తం ప్రక్రియను మళ్లీ పూర్తి చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు”అని రోహిత్ కుమార్ అన్నాడు. రాత పరీక్షల్లో బాగా రాణించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఇన్స్టిట్యూట్లో 1.5 లక్షల రూపాయలను కుమార్ ఖర్చు చేశాడు. ఇప్పుడు తనకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
– ‘ది వైర్’ సౌజన్యంతో
Contribute Telugillu
Encourage Independent Journalism
