రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. దేశమంతా యువత ఆక్రోశంతో అట్టుడుకుతుంటే రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు కనీసం నోరు మెదపడం లేదు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువతను వైసీపీ సర్కారు అరెస్టు చేసి స్టేషన్లలో కుక్కింది. ఈ అన్యాయమేంటని ప్రశ్నించిన సీపీఎం నేతలనూ స్టేషన్లో నిర్బంధించింది. ఇంతకీ యువత ఆశలపై నీళ్లు చల్లిన అగ్నిపథ్‌పై మీ వైఖరేంటీ ! కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా.. వ్యతిరేకిస్తున్నారా !
ప్రస్తుతం మన సైనిక బలగాలు 15 లక్షల దాకా ఉన్నాయి. రక్షణ బడ్జెట్లో ఆయుధాలకు కేటాయించిన దానికన్నా వీళ్ల వేతనాలు ఎక్కువేం కాదు. ఇప్పటికే పదవీ విరమణ పొందిన వారికి రూ.1.20 లక్షల కోట్లను పింఛను కింద వెచ్చిస్తున్నారు. ఒకవైపు రక్షణ పరికరాల కొనుగోలులో వేల కోట్ల ముడుపులు చేతులు మారుతున్నట్లు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు నుంచి అనేక అనుభవాలున్నాయి. ఇప్పుడు త్రివిధ దళాల్లో కాంట్రాక్టు పద్దతిని ప్రవేశ పెట్టి సాయుధ బలగాల బడ్జెట్‌కు ఎసరు పెట్టాలని కేంద్ర పెద్దలు నిర్ణయించారు. అందులో భాగంగానే అగ్నిపథ్ ను తీసుకొచ్చారు.
రెండు లక్షల కోట్ల కోసమా ఇంత రాద్దాంతం!
ఈ పథకం ద్వారా 75 శాతం మందిని తాత్కాలికంగా, ఆరు నెలల శిక్షణ ఇచ్చి మూడున్నర సంవత్సరాల సర్వీస్ కొరకు నియమిస్తారు. తర్వాత అందులో 25 శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన తీసుకుంటారు. ఈ విధానం మొదలైన దశాబ్దం తర్వాత సైనిక బలగాల స్వరూపం మారిపోతుంది. పూర్తిస్థాయి సైన్యంలో 75 శాతం మంది తాత్కాలిక ప్రాతిపదికన నియమితులైనవారే ఉంటారు. వీరికి పెన్షన్ ఉండదు. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి మిగిలే మొత్తం అప్పటికి సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్లు.
ఈ మిగులు ఆలోచనే ఈ పథకం రూపకల్పనకు కీలకం. మిగులు డబ్బుతో సైనిక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని కేంద్రం చెబుతోంది. అంటే సైనికుల పెన్షన్ డబ్బులు ఆదా చేస్తే కానీ దేశ భద్రత అవసరాలను తీర్చలేమని చెప్పదలుచుకున్నారా! మన దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా బలహీనపడి పోయిందా!
సాయుధ బలగాల్లో వివక్ష తలెత్తితే దేశ రక్షణకే ముప్పు
మరోవైపు దేశ భద్రతకు కీలకమైన సైనిక దళాల సామర్థ్యం బలహీనపడే అవకాశం ఉందనేది ఓ వాదన. కేవలం నాలుగేళ్ల సర్వీస్ మాత్రమే ఉన్నవారికి కమిట్మెంట్ ఎలా ఉంటుంది ! బయటికెళ్లి తమ జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనే దానిమీదనే శ్రద్ధ ఉంటుంది. సైనికపరంగా ఉండవలసిన మానసిక దృఢత్వం ఉండదనే భావన వ్యక్తమవుతోంది.
మరో ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే శాశ్వత, తాత్కాలిక సైనిక దళాల మధ్య వివక్ష తలెత్తితే అది దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఏదైనా యుద్ద పరిస్థితులు ఎదురైనప్పుడు తాత్కాలిక సైనికుల మానసిక స్థితి యుద్ధానికి సన్నద్ధం అవుతుందా! కాక పోతే దేశ భద్రతకు ఎదురయ్యే పెను సవాలును ఎవరు ఎదుర్కొంటారు!
ఇప్పుడు యువకులు చేస్తున్నది ఆవేశపూరితమైన ఆందోళన. ఎక్కువ కాలం నిలవదు. పైగా పోలీసు కేసుల్లో ఇరుక్కుని తమ జీవితాలను నాశనం చేసుకోవడానికి కారణమవుతుంది. కేంద్ర పెద్దలు యువత నిరసనలను పట్టించుకోకపోవచ్చు. ఏడాది పాటు శాంతియుతంగా సాగిన రైతు ఉద్యమం మాత్రమే కేంద్రం మెడలు వంచి విజయం సాధించింది. ఇప్పటికైనా రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు యువత ఆందోళనలపై నోరు విప్పాలి. కేంద్ర పెద్దలతో మాట్లాడి యువతలో నెలకొన్న ఆవేశాలను తగ్గించాలి.
Contribute telugillu
Encourage Independent Journalism
