హింస ఏ మతం పేరుతో జరిగినా తప్పేనని సినీ నటి సాయి పల్లవి అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దానిపై ఆమె ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. “నేను చెప్పిన మాటలను వేరే అర్థం తీసుకున్నారు. దానికి వివరణ ఇవ్వాలని నాకు అనిపించింది. కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. ఆ ఇంటర్వ్యూలో మీరు లెఫ్ట్‌కు సపోర్టు చేస్తారా.. రైట్ వింగ్‌కు సపోర్ట్ చేస్తారా అని నన్నడిగారు. నేను తటస్థంగా ఉంటానని చాలా స్పష్టంగా చెప్పాను. ఏదైనా ఒక సంస్థతో ఐడెంటిఫై కావడానికన్నా ముందు మనం మంచి మనిషిగా, మానవత్వంతో ఉండాలని నేను కోరుకుంటాను” అని సాయిపల్లవి వెల్లడించారు.
ఇన్‌స్టాలో, ట్విటర్లో ఆమె మాట్లాడుతూ ఈ వివరణ ఇచ్చారు. దాదాపు నాలుగు నిమిషాల వీడియోను సాయి పల్లవి విడుదల చేశారు. సమాజంలో అణచివేతకు గురవుతున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ కల్పించాలన్నదే తన భావమని చెప్పారు.“కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన తర్వాత నాకు ఆ దర్శకునితో మాట్లాడే అవకాశం దొరికింది. అప్పట్లో అక్కడి ప్రజల దురవస్థను చూసి చాలా డిస్ట్రబ్ అయినట్లు ఆయనతో అన్నాను.
ఒక మనిషిగా ఆ మారణహోమానికి సంబంధించిన విషాదాన్ని, ఆ ప్రభావానికి ఇప్పటికీ గురవుతున్న తరాల కష్టాలను నేను తక్కువ చేసి చూడలేను. కొవిడ్ సమయంలో జరిగిన మూక హత్యలను కూడా సమర్థించలేను. ఆ వీడియోను చూసి నేను చాలా కలత చెందాను. హింస ఏ రూపంలో ఉన్నా తప్పేనని నేను నమ్ముతాను. ఏ మతం పేరుతోనైనా హింస జరగడం సరైనది కాదు. ఇదే నేను చెప్పదలచుకున్నది” అని సాయి పల్లవి ఈ వీడియోలో వివరించారు.
“చాలా మంది ఆన్లైన్లో మూక దాడులను సమర్థించడం చాలా బాధాకరం. మనలో ఎవరికీ మరొకరి ప్రాణం తీసే హక్కు లేదు. ఒక మెడికల్ గ్రాడ్యుయేట్‌గా నేను అందరి ప్రాణాలూ ముఖ్యమేనని, అందరూ సమానమేనని భావిస్తాను” అని ఆమె అన్నారు. విద్యార్థి జీవితమంతా ‘భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను’ అని పాడుతూ పెరిగాను. మతం, కులం, సంస్కృతి అంటూ మనుషుల్ని వేరు చేసి చూడకూడదు.
నేను గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను పూర్తిగా చూడకుండానే కొందరు వాటి మీద వ్యాఖ్యలు చేశారు. నేను ఏం తప్పు చేశానో తెలియక విస్తుపోవాల్సి వచ్చిందని సాయి పల్లవి వివరించారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అందరూ శాంతి, ప్రేమతో ఉండాలని ఆశిస్తున్నట్లు ఆమె వీడియోలో పేర్కొన్నారు.
– గోపి జినగం
Contribute telugillu
Encourage Independent Journalism
