రాష్ట్రంలో రహదారులు, వంతెనల అభివృద్ధికి ఎన్డీబీ (న్యూ డెవలప్మెంటు బ్యాంకు ) విడుదల చేసిన 300 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఏమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్దన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆ నిధులను కూడా దారి మళ్లించారా అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాష్ట్రం లో రహదారుల నిర్మాణం, మరమ్మతుల పనులు చేసిన కాంట్రాక్టర్లకు దాదాపు 35 వేల కోట్ల రూపాయల బకాయి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఎందుకు బిల్లులు చెల్లించలేదని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. దీని వల్ల ఎన్డీబీ ప్రాజెక్టు పనులు నిలిచిపోయింది వాస్తవం కాదా అని నిలదీశారు.
ఎన్డీబీ ప్రాజెక్టులో మొదటి దశ కింద ప్రభుత్వం తన వాటా కింద 900 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఇప్పటిదాకా ఒక్క రూపాయి ఇవ్వకపోవడానికి కారణమేంటని విష్ణువర్దన్‌రెడ్డి ప్రశ్నించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నాయని ప్రతిపక్షాల మీద తప్పుడు ప్రచారం చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి అర్హత లేదన్నారు. ప్రభుత్వ చేతగాని అసమర్థత పాలన వల్ల ప్రజలు విసిగిపోయినట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను విపక్షాల పార్టీలపై నెట్టేసి వైసీపీ నేతలు తప్పించుకోవాలని చూడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
Contribute Telugillu
Encourage Independent Journalism
