రాష్ట్రపతి ఎన్నికలతో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 18 విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ మాజీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు ఇచ్చారు. యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు ఇచ్చారని… తాను కేసీఆర్ తో మాట్లాడనని శరద్ పవార్ చెప్పారు. విపక్షాల కూటమిలో కాంగ్రెసే ప్రధాన పార్టీగా ఉంది. అంటే ప్రెసిడెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికే కేసీఆర్ మద్దతు ఇస్తున్నారన్న మాట. ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ హాట్ గా మారింది.
కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పారు. ఆ రెండు పార్టీలతో దేశానికి నష్టమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పలు ప్రాంతీయ పార్టీల నేతలను కూడా కలిశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే చర్చ వచ్చింది.
తర్వాత కూటమి కాదు జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడతాననే సంకేతం ఇచ్చారు కేసీఆర్. పార్టీ పేరు ఖరారైందని.. జూన్ నెలాఖరులో భారతీయ రాష్ట్రీయ సమితి పార్టీ పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారనే వార్తలు వచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగానే జాతీయ పార్టీ ఉండబోతుందని టీఆర్ఎస్ లీడర్లకు కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహించిన విపక్షాల భేటీకి ఆహ్వానం వచ్చినా వెళ్లలేదు కేసీఆర్. కాంగ్రెస్ కూడా మమతా సమావేశానికి వస్తున్నందున.. ఆ పార్టీతో వేదిక పంచుకోవడం ఇష్టం లేకే కేసీఆర్ మమతా బెనర్జీ సమావేశానికి హాజరుకాలేదని తెలిసింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంభిస్తారని అంతా భావించారు.
అనూహ్యంగా కాంగ్రెస్ కూటమి బలపరిచిన యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చారు కేసీఆర్. దీంతో ఇప్పుడు కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. ప్రెసిడెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో వెళుతున్న కేసీఆర్.. భవిష్యత్ లోనూ ఆ కూటమితోనే ఉంటారా అన్న చర్చ వస్తోంది. జాతీయ స్థాయిలో కేసీఆర్ పార్టీ లేనట్టేనా అన్న అనుమానాలు వస్తున్నాయి.
కేసీఆర్ జాతీయ పార్టీ లేనట్టేనా !
కొత్త పార్టీపై వెనక్కి తగ్గినందునే కొన్ని రోజులుగా కేసీఆర్ మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను కాదని తనతో కలిసివచ్చేందుకు ప్రాంతీయ పార్టీల నేతలు ముందుకు రాకపోవడం వల్లే కేసీఆర్ సైలెంట్ అయినట్లు సమాచారం.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమితోనే కేసీఆర్ ముందుకు వెళితే.. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయా అనే చర్చ కూడా కొన్ని వర్గాల్లో సాగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాడుతోంది. కేసీఆర్ టార్గెట్ గానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుగా వెళుతున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోవడం తెలంగాణ కాంగ్రెస్ కు ఇబ్బందికరమే. ఇప్పటికే కాంగ్రెస్ , టీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో కమలం లీడర్లు మరింత వాయిస్ పెంచవచ్చు. మొత్తంగా రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ తీసుకున్న స్టాండ్.. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.