సినిమా చూస్తున్నంత సేపూ మనసంతా ఏదో మట్టి పరిమళాల గుభాళింపు..
జయమ్మగా సుమ పాత్రని దర్శకుడు విజయకుమార్ కలివరపు తీర్చిదిద్దిన విధానం చాలా బావుంది.
ఆమె కళ్లల్లో ధీరత్వం.. మాటల్లో నిజాయతీ.. చేతల్లో తెగింపు సిక్కోలు వాసుల పోరాట పటిమను గుర్తు చేసింది.
“చావడం సులువే ! బతికి బాధ్యతలు తీసుకోవడమే చాలా కష్టం” అని ఓ సందర్భంలో దర్శకుడు జయమ్మ ద్వారా ఓ మాట చెప్పించాడు.
అది నిజంగా వాస్తవం. నన్ను అమితంగా ప్రభావితం చేసింది.
గొప్ప కథలు వేరెక్కడో దొరకవు.
మన మట్టిలోనే ఉంటాయి.
మన జీవితంలోనే ఉన్నాయి.
మన ఊళ్లోనే కనిపిస్తాయి.
అలాంటి కథనే జయమ్మ పంచాయితీ గా వెతికి పట్టుకున్నాడు దర్శకుడు విజయ్.
ప్రతీ పాత్రని తీర్చిదిద్దిన విధానం అద్భుతం.
ఎంతో సహజంగా అనిపించాయి.
శ్రీకాకుళం మాండలికం మంచి అనుభూతినిస్తోంది.
మూఢనమ్మకాలు, అంటానితనంలాంటి సున్నితమైన అంశాలను కూడా ఎంతో చాకచక్యంగా నడిపారు.
అందుకు విజయ్ ని ప్రత్యేకంగా అభినందించాలి.
ఇలాంటి సినిమాలు మన మూలాల్ని గుర్తు చేస్తాయి.
దర్శకుడు చెప్పాలనుకున్న అంశాల్ని నిజాయతీగా క్లుప్తంగా తెరకెక్కించాడు.
విజయ్ నుంచి ఇలాంటి మరిన్ని మంచి కథలు రావాలి.
మరింత గొప్ప స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
తెలుగు చిత్ర సీమలో ఇలాంటి ప్రయోగాలకు దర్శకుడు విజయ్ కలివరపు ఓ మెరుపు తెచ్చారు.
తమిళం.. మళయాళంలోనే ఇలాంటి చిత్రాలు ఎక్కువగా కనిపించేవి.
విజయ్ ఆ కొరత తీర్చినట్లుంది.
అమెజాన్ ప్రైమ్ లో ఈ ‘జయమ్మ పంచాయితీ’ అందుబాటులో ఉంది.
చక్కగా కుటుంబ సమేతంగా చూడొచ్చు.
ఇంకా చూడని వాళ్లుంటే చూసి జయమ్మకి మీ ఈడ్లు చదివించేయండి !
– నిహారికా రెడ్డి
Actually ma village language adi …memu screen pi chuste wow anipistundi …Idi real Kada anukinnamu memantha , ippatiki eedu anedi oka samasye maaku .. super cinema idi