తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా శ్రమిస్తోంది. తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాలేదన్న నిరాశలో ఉన్న కాంగ్రెస్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. టీఆర్ఎస్ నుంచి వలసలూ పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ, మంత్రి కేటీఆర్ ఒకే వేదికపై నిలవడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల కూటమి నుంచి యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ కు కూడా మద్దతు ఇచ్చింది. సపోర్ట్ చేయడమే కాదు సిన్హా నామినేషన్ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా వచ్చారు.
రాహుల్ గాంధీతో కలిసి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. రాహుల్ తో కలిసి వేదికను పంచుకోవడమే కాదు. కాంగ్రెస్ నేతలతో సరదాగా గడిపారు కేటీఆర్. రాహుల్ తోనూ ముచ్చటింటారు. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.
టీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధాలు ఉండవని వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించారు. అందుకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతోంది.
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని కమలం లీడర్లు పదేపదే ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని రేవంత్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఇదే విషయాన్ని వరంగల్ సభలో రాహుల్ నోట చెప్పించారు.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉండటంతో రేవంత్ రెడ్డి వర్గీయులు కలవరపడుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలుస్తాయన్న సంకేతం జనంలోకి వెళితే తమకు తీరని నష్టం కలుగుతుందనే భావనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. అదంతా తమకు ఫ్లస్ అవుతుందనే ధీమాలో ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోతాయన్న సంకేతం వస్తే.. ప్రజా వ్యతిరేక ఓటు మొత్తం బీజేపీకి ట్రాన్స్ ఫర్ అవుతుందనే ఆందోళనలో టీపీసీసీ నేతలున్నారు.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి షాకింగ్ గా మారిందని అంటున్నారు. కేసీఆర్ టార్గెట్ గానే రాజకీయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. భవిష్యత్ లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలవాల్సి వస్తే ఆయన జీరోగా మారడం ఖాయం.
అందుకే కాంగ్రెస్ కూటమికి టీఆర్ఎస్ సపోర్ట్ రాష్ట్రపతి ఎన్నికల వరకే పరిమితం కావాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఢిల్లీలో రాహుల్ తో కలిసి కేటీఆర్ వేదిక పంచుకున్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లి ఆ రెండు పార్టీలను ఇబ్బంది పెట్టే ప్లాన్ లో కమలనాధులు ఉన్నట్లు తెలుస్తోంది