ఇంతకీ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై కుట్రకు పాల్పడుతోంది వైవీ సుబ్బారెడ్డా.. మాగుంట శ్రీనివాసుల రెడ్డా ! ప్రకాశం జిల్లా వైసీపీలో ముసలం తారా స్థాయికి చేరింది. తనను పనిగట్టుకొని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీకి తమ పార్టీ పెద్దనేత సహకరిస్తున్నారని బాలినేని నిన్నటి ప్రెస్ మీట్లో కుండ బద్దలు కొట్టారు. ఆ పెద్దనేత ఎవరనేది ఆయన పేరు చెప్పకున్నా అంతో ఇంతో రాజకీయాల్లో ఉన్నవాళ్లందరికీ తెలుసు. ఇక్కడ దాకా వచ్చాక ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు బా(వా)సూ ! తాడోపేడో తేల్చేస్తేనే బెటరంటూ బాలినేని అనుచరులు వాపోతున్నారు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కవితా రెడ్డి అనే మహిళ ధాన్యం బకాయిల గురించి బాలినేనిని ప్రశ్నించారు. టీడీపీ నేత దామచర్ల జనార్దన్ ఆమెను తనపైకి రెచ్చ గొట్టారని బాలినేని అనుకున్నారు. ఆమెను తనపై ఉసిగొల్పింది కేవలం జనార్దన్ అయితే బాలినేని అంతగా రియాక్ట్ అయ్యే చాన్స్ లేదు. తమ పార్టీ పెద్ద నేత ఉన్నట్లు బాలినేని వద్ద సమాచారం ఉంది. అందుకే ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
పార్టీకి చెందిన పెద్దనేతను అనలేక కవితా రెడ్డి, దామచర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న బాలినేని అనుచరుడు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణకు రాత్రి పూట కాల్ చేయడం వివాదాస్పదమైంది. ఇక్కడ కూడా బాలినేనే టార్గెట్ అయ్యారు. తన వెనకాల పెద్ద కుట్ర జరుగుతుందని వాసు భావించారు. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి నోరు విప్పినట్లు సమాచారం.
ఇన్ని కుట్రలకు బదులు నా కాళ్లు పట్టుకుంటే రాజకీయాల నుంచి తప్పుకునే వాడ్ని – బాలినేని
ఇన్ని కుట్రలకు పాల్పడే బదులు తన కాళ్లు పట్టుకుంటే రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కవితా రెడ్డి కాల్ డేటా బయటకు తీస్తే తనపై కుట్ర చేస్తున్నవాళ్ల రంగు బయటపడుతుందని చెప్పారు. దీనికి సంబంధించి ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని బాలినేని వెల్లడించారు. తనను టార్గెట్ చేస్తున్న వాళ్ల బండారాన్ని త్వరలో బయటపెడతానని హెచ్చరించారు.
ఇటీవల ఒంగోలులో స్వర్ణ ప్రకాశం పేరుతో పలువురు సాహిత్య వేత్తలు, కవులు ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. జిల్లాకు చెందిన కవులు, సాహిత్యం గురించి కూడా ప్రస్తావించ లేదు. ఏదో పొగాకు, శనగలకు ప్రసిద్ధి అంటూ చెప్పేసి వెళ్లిపోయారు.
జిల్లాలో పర్యటనల జోరు పెంచిన వైవీ సుబ్బారెడ్డి
ఈసందర్భంగా వైవీ అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. సదరు కార్యక్రమం ప్రారంభం కాకముందే ఫ్లెక్సీలను పీకేశారు. దీంతో వైవీ అనుచరులు ఆగ్రహంతో ఊగిపోయారు. వైవీ సుబ్బారెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఆశిస్తున్నారు. వైవీ టీటీడీ చైర్మన్ అయ్యాక ఆ దిశగా ఎన్నడూ ముందుకెళ్లలేదు. ఇటీవల జిల్లాలో పర్యటనల జోరు పెంచారు. ఈ నేపథ్యంలో తనను టార్గెట్ చేస్తోంది వైవీ సుబ్బారెడ్డేనని బాలినేని భావించి ఉండొచ్చు.
మంత్రి శ్రీనివాసరావు మాగుంట శ్రీనివాసుల రెడ్డికి బాగా సన్నిహితంగా ఉంటారు. బాలినేని ప్రెస్ మీట్లో తనను టార్గెట్ చేస్తున్న వారిలో మంత్రి శ్రీను కూడా ఉన్నట్లు ఆరోపించారు. ఈ కోణంలో ఆలోచించినప్పుడు మాగుంట పేరు ముందుకు వస్తోంది. ఆయన ఇటీవల కొండపి నియోజకవర్గంలో మాట్లాడుతూ ఇక్కడ పార్టీ అత్యంత తక్కువ ఓట్లతో ఓడినా తనకు ఐదు వేల మెజార్టీ వచ్చినట్లు చెప్పారు. అదంతా మాగుంట కుటుంబానికి ఉన్న బలం వల్లే తప్ప పార్టీ వల్ల కాదని చెప్పుకొచ్చారు. అందువల్ల మాగుంట కూడా బాలినేనిని టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇంత జరుగుతున్నా బాలినేని విషయంలో సీఎం జగన్ స్పందించకపోవడానికి కారణమేంటనేది సస్పెన్స్.