ప్రజా సంకల్ప యాత్రతో ఏడాది పాటు ప్రజలతో మమేకమైన సీఎం జగన్ అదే జనానికి దూరంగా జరుగుతూ వచ్చారు. కనీసం బాధలు చెప్పుకుందామని వచ్చే వాళ్లకు అవకాశమే ఇవ్వలేదు. చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. మంత్రులకే సీఎం అపాయింట్మెంటు దొరకడం గగనమైంది. సీఎం ఎక్కడకైనా పర్యటనకు వస్తున్నారంటే ఆమడ దూరంలో జన సంచారం లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారి పొడవునా ప్రజలు కనిపించకుండా దడి కట్టేస్తున్నారు. దీని ఆధారంగానే జనసేనాని పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఆయన నివాసం ముందు ప్రతి రోజు జనం క్యూ కట్టేది. ఉదయాన్నే ఏవేవో పనులపై వచ్చిన ప్రజలను పలకరించి వాళ్ల ఇబ్బందులు తెలుసుకునేందుకు రాజశేఖర్రెడ్డి కొంత సమయం వెచ్చించేది. తద్వారా తాము ప్రభుత్వ పరంగా ఏం చేస్తున్నాం.. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలేంటనేది గుర్తించడానికి దోహదపడేది.
ఎక్కడా పరిష్కారం కాని సమస్యలకు కూడా నాడు వైఎస్సార్ ఫుల్స్టాప్ పెట్టిన ఘటనలు కోకొల్లలు. ఇప్పుడు ప్రజల బాధలు వినేవాళ్లు లేరు. కనేవాళ్లు లేరు. గడపగడపకూ వెళ్తున్న ప్రజాప్రతినిధులను అడుగుతుంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులను జనసేనాని పవన్ కల్యాణ్ తనకు అనుకూలంగా మలచుకోవాలని భావించారు. అనుకున్నదే తడవుగా జన వాణి పేరుతో జూలై 3న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మొత్తం ఐదు ఆదివారాలపాటు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. మొట్టమొదట రెండు ఆదివారాలు విజయవాడలో నిర్వహిస్తారు. తర్వాత రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు మిగతా మూడు ఆదివారాలు కేటాయిస్తారు.
జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. వాటికి పార్టీ వలంటీర్లు రశీదులు ఇస్తారు. తర్వాత ఆయా వ్యక్తిగత, సామూహిక సమస్యల వారీ వర్గీకరిస్తారు. సంబంధిత శాఖల అధికారులను కలిసి అర్జీలను సమర్పిస్తారు. సమస్య పరిష్కారమైతే సరే. లేకుంటే ఆందోళన చేపడతారు.
ఇలా ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం కార్యాచరణను సిద్దం చేసుకున్నారు. ఇది జనసేన పార్టీ ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్లేందుకు దోహదపడుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత అవగాహనకు రావడానికి తోడ్పడుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ జన సేనాని !