ఎవరేం చేసుకున్నా నా వెంట్రుక కూడా పీకలేరని సీఎం జగన్ చిందులు తొక్కుతున్నారు. నన్ను అప్రదిష్టపాలు చేసేందుకు మా పార్టీ వాళ్లే కుట్రకు పాల్పడుతున్నారు. వాళ్ల కాళ్లు విరగ్గొడతానని మాజీమంత్రి బాలినేని కన్నెర్రజేస్తున్నారు. బాలినేనిలాగే తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాపోతున్నారు. ఇక బయటపడకుండా లోలోపల కుమిలే వాళ్లకు లెక్కలేదు. అసలు ఇదేం ప్రభుత్వం.. ఈ సీఎం ఏమిటనుకునే ప్రజాప్రతినిధులకూ కొదవలేదు. ముచ్చటగా మూడేళ్లకే అధికార వైసీపీ డొల్లతనం బయపడింది.
అధికార పార్టీ వ్యవస్థలన్నింటినీ తోసిరాజని ఓటు బ్యాంకులను సిద్దం చేసుకుంటుందనే అక్కసుతో ప్రతిపక్ష టీడీపీ నేతలు కువకువలాడుతున్నారు. నిద్ర లేచింది మొదలు ప్రభుత్వం ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడుతుందనే దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
రోజుకు పదిమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ నేతలను దుమ్మెత్తిపోసే పనిలో నిమగ్నమవుతున్నారు. భజన మీడియాతో ప్రజల మస్తిష్కాలను తమవైపు తిప్పుకునేందుకు కుస్తీ పడుతున్నారు. జనంతో మమేకమయ్యేందుకు బదులు వీటితోనే కోల్పోయిన ప్రజల మద్దతు తిరిగి పొందగలమనే ఊహల్లో విహరిస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల నుంచి తర్వాత స్థానిక సంస్థల దాకా వైసీపీ, టీడీపీ బలాబలాలను పరిశీలిస్తే సుమారు ఓ పది శాతం ఓట్లు తేడా కనిపిస్తోంది. అందులో ఐదు శాతం ప్రతిపక్షానికి మళ్లిందంటే వైసీపీ బొమ్మ తిరగబడినట్లే. ప్రభుత్వ వ్యతిరేక ఓటులో జనసేన ఓ ఐదు శాతం లాక్కున్నా అధికార పార్టీకి కష్టాలే. వైసీపీలో కుమ్ములాటలు ఆ పార్టీని ఏ దరి చేరుస్తాయో ఊహకందడం లేదు. టీడీపీ నేతలు జనాన్ని గాలికొదిలేసి ఊహల్లో విహరిస్తున్నారు. జగనే అధికారాన్ని పువ్వుల్లో పెట్టి తమకిస్తారనే భ్రమల్లో ఉన్నారు. జనసేనాని బీజేపీ సంకనెక్కి ఇంకా రూటు మ్యాపు కోసం ఎదురు చూస్తున్నారా.. కమలాబాయి సంక దిగి జనంలో పడతారా అనేది స్పష్టత లేదు.
ఎవరి పార్టీ ఓటు బ్యాంకులు వాళ్లకున్నా ఓ ఐదు శాతం ఓటర్లు తటస్ఠంగా ఉంటారు. ఆ సమయానికి వాళ్ల ఆలోచనలు, భౌతిక పరిస్థితులపై అవగాహన కొద్దీ ఓటేస్తారు. వీళ్లే రానున్న ఎన్నికల్లో కీలకం కానున్నారు. తటస్థుల్ని ప్రభావితం చేయడానికి ఈ మూడు పార్టీలు అనుసరిస్తున్న వ్యూహ్యాలు ఏమీ కనిపించడం లేదు. వాళ్ల వాళ్ల భజంత్రీల హోరులో మునిగి తేలుతున్నారు. అసలు తటస్థులు ఇంకా ఉన్నారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తటస్థంగా ఆలోచించే వాళ్లకు రంగు.. రూపం, వాసన కనిపించదు. ఎన్నికల సమయంలో బ్యాలెట్ ద్వారానే వాళ్ల నిర్ణయం వ్యక్తమవుతుంది.
తటస్థ వైఖరి కలిగిన ఓటర్లు నిత్యం అన్ని పార్టీల తీరును గమనిస్తుంటారు. ఎవరేం చెబుతున్నారు.. మరెవరు ఏం చేస్తున్నారు.. చెబుతున్నదేంటీ.. చేస్తున్నదేంటీ.. అనేవి నిరంతరం పరిశీలిస్తుంటారు. డబ్బు, కులం, ప్రాంతంతో వీళ్ల మద్దతు పొందలేరు. ఎన్నికల సమయానికి బరిలో ఉన్న నేతల తీరు, ఆ పార్టీ అప్పటిదాకా అనుసరించిన విధి విధానాలే వీళ్ల ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. ఇంతకీ తటస్థులు ఈసారి ఎవరి వైపు మొగ్గుచూపుతారో !