“ సీఎం జగన్ మీట నొక్కి పథకాల డబ్బులేస్తే ఆయనకు పేరొస్తోంది. మరి ఎమ్మెల్యేల పరిస్థితేమిటి ! గడప గడపకూ వెళ్తుంటే జనం నిలేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అడుగుతున్నారు. మూడేళ్ల నుంచి ఓట్లేయించిన కార్యకర్తలను పట్టించుకోలేదు. ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలకు కొన్ని పనులు ఇచ్చాం. వాటికి సంబంధించి వంద కోట్లు ఇప్పటికీ విడుదల చేయలేదు. వాళ్లంతా అప్పులపాలై కుమిలిపోతున్నారు. ఇలాగైతే చాలా కష్టం !” అంటూ ప్రకాశం జిల్లా వైసీపీ ప్లీనరీలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుండ బద్దలు కొట్టారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నుంచే నాడు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఇదే బాధ గూడు కట్టుకుంది. కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు అడుక్కుతినాల్సిందేననే నానుడి ఉంది. అది నేటి వైసీపీ పాలనలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నేతల విజయం కోసం పని చేసిన వాళ్లను మర్చిపోయే గుణం వాళ్ల నైజమనే భావన ఇప్పటికీ కొనసాగుతోంది.
అందుకే అధికారానికి వచ్చి మూడేళ్లవుతున్నా పార్టీ కార్యకర్తలు అనే వాళ్లున్నారనే విషయాన్నే మర్చిపోయారు. ఆ అసంతృప్తులు, ఆక్రోశాన్ని ఎమ్మెల్యే వేణుగోపాల్ కక్కిపారేశారు. కాస్త ఆలస్యంగా కళ్లు తెరిచిన మంత్రి ధర్మాన ప్రసాదరావులాంటి సీనియర్ నేతలైతే పార్టీని నమ్ముకొని బతకొద్దని కార్యకర్తలకు నిర్దేశించారు. పార్టీ నుంచి ఎలాంటి సహకారం ఉండదని నిర్మొహమాటంగా చెప్పేశారు.
ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో పార్టీకి జోక్యం కల్పిస్తూ రైలు పట్టాల మాదిరిగా సాగాలి. పార్టీ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ పాలనలో లోపాలను దిద్దుకుంటూ వెళ్లాలి. అప్పుడే అధికారాన్ని కోల్పోయినా పార్టీ సజీవంగా జనంలో నిలుస్తుంది. అధికార పీఠమెక్కిన దగ్గర నుంచి వైసీపీ పాలన దీనికి విరుద్దంగా సాగుతోంది.
కేవలం సీఎం జగన్ మీట నొక్కి పథకాల డబ్బులు వేయడమే పాలనలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలకు పన్లేదు. పార్టీ కార్యకర్తలకు ఓ కార్యక్రమం అంటూ లేదు. అన్ని శాఖల నిధులు సీఎం గల్లా పెట్లెలో వేసుకోవడంతో అధికార యంత్రాంగమే గోళ్లు గిల్లుకుంటూ కాలం నెట్టుకొస్తోంది. ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రులదాకా పథకాల భజనకే పరిమితం చేశారు. దాని పర్యవసనాన్ని ఇప్పుడు ఎదుర్కోవాల్సివస్తోంది.
ఇప్పుడు కేవలం వేణుగోపాల్ మాత్రమే నోరు విప్పారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మళ్లీ సీటిచ్చినా పోటీ చేయడం వృథా అనుకుంటున్నారు. ఆయన ఎమ్మెల్యే కాకుంటే వెళ్లి వ్యాపారం చేసుకుంటారు. పెద్దగా నష్టపోయేదేమీ లేదు. కేవలం సీఎం జగన్ దయాదాక్షిణ్యాలపై రాజకీయాల్లో కొనసాగుతున్న వాళ్లు మినహా మిగతా ఎమ్మెల్యేలందరిలోనూ ఇదే భావన నెలకొంది. ఇది ఇంకా పెరిగి ఏదో ఒకనాడు లావాలా ఎగసి పడుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకుంటారా ! అనుమానమే.