అంతా ఊహించినట్లే జరిగింది. మహా సర్కారును కూల్చేశారు. ఒకనాడు చెలిమి చేసిన నేరానికి ఉద్దవ్ ఠాక్రే మూల్యం చెల్లించుకున్నారు. ఏక్నాథ్ షిండేకు బీజేపీ మద్దతిచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. ఇక్కడ నుంచి కేంద్ర వినాశకర విధానాలను పొల్లుపోకుండా మహారాష్ట్రలో అమలు చేయొచ్చు. తర్వాత బీజేపీ టార్గెట్ తెలుగు రాష్ట్రాలేనని తెలుస్తోంది. కేరళ, తమిళనాడులో అడుగుపెట్టే సందు లేదు. కర్నాటకలో అత్తెసరు బలం. దక్షిణాదిలో పాగా వేయాలంటే తెలుగు రాష్ట్రాల్లోనే సాధ్యమని కాషాయ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఎదురు దాడి చేస్తున్నా.. ఆంధ్రాలో ప్రధాన పక్షాలు సాగిలపడుతున్నాయి.
ఇక సాలు మోడీ.. సంపకు మోడీ అంటూ హైదరాబాద్ అంతటా ఫ్లెక్సీలు వెలిశాయి. సామాన్యులు నిత్యం వినియోగించే మజ్జిగ, చికెన్, చేపలను కూడా కేంద్ర సర్కారు వదల్లేదు. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చి జనం మూలిగలు పీల్చడానికి సిద్దమైంది. అంతేకాదు. కేంద్ర భూగర్భ జల వనరుల శాఖ ఈ మధ్య ఓ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ శాఖ అనుమతి లేకుండా ఇప్పటిదాకా బోర్లు వేసిన వాళ్లు అనుమతి తీసుకోవాలని కోరింది. లేకుంటే అపరాధ రుసుంతో వసూళ్లు చేస్తామని హెచ్చరించింది. బోరు ఉన్న ప్రతీ కుటుంబం కనీసం రూ. 10వేలు చెల్లించాల్సివస్తుంది. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పక్షాల్లో కనీసం ఒక్కటీ స్పందించలేదు.
సగటు ప్రజల జేబులు కొట్టి కార్పొరేట్ గద్దలకు వేసే బీజేపీ విధానాలు తెలిసి కూడా ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు చెలిమికి తహతహలాడుతున్నాయి. వీళ్ల అధికారం కోసం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయడానికైనా వెనుకాడరని స్పష్టమవుతోంది.
ఈపాటికే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పేందుకు రంగం సిద్దమైంది. నదులపై పెత్తనం పోయింది. పోర్టులు పోయాయి. చివరకు భూగర్భ జలాలపై కూడా కేంద్రం జులుం ఏంటని అడిగే దిక్కు లేదు. ఓట్లు అడగడానికి వెళ్లినప్పుడు మూడు ప్రధాన పక్షాలను నిలదీయడానికి ప్రజలు సమాయత్తమవుతున్నారు.
ఏ గడ్డి కరిచైనా.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అయినా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తహతహలో బీజేపీ నేతలున్నారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. గడచిన తొమ్మిదేళ్లలో తమకు బలం లేకున్నా తొమ్మిది ప్రభుత్వాలను కూల్చిన ఘనాపాటీలు కమలనాధులు. వీళ్లతో పొత్తు పెట్టుకున్న పార్టీలను ప్రజలు బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్దమవుతున్నారు.
ఈపాటికే పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలతో మోతెక్కిస్తున్నారు. జీఎస్టీతో నిత్యావసరాల ధరలు చుక్కలు చూస్తున్నాయి. తాజాగా వేస్తున్న భారాలపై రాష్ర్టంలోని ప్రధాన పక్షాలను నిలదీయడం ఖాయం. ఇంకా కులమత మౌడ్యాలతోపాటు సంక్షేమ ముసుగులో ప్రజలను మభ్య పెట్టడం ఎల్లకాలం సాగకపోవచ్చు. ఎవరేంటనేది ఆలోచిస్తున్నారు. బీజేపీ సెగ తగలకముందే మేలుకోవాలి.