మన మహిళలు టిక్ టాక్ వీడియోల్లో హొయలు కురిపిస్తుంటారు. అందమైన దుస్తులను ప్రదర్శిస్తూ ర్యాంపు మీద వయ్యారాలు పోతుంటారు. ఇంకా కొందరు సినిమా డ్యాన్సులతో కుర్రకారును ఉరకలెత్తిస్తుంటారు. ద్వంద్వర్థాల డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. అసలు అందమంటే ఇదేనన్నట్లు మన సామాజిక మాధ్యమాలు హోరెత్తిస్తుంటాయి. అదే చైనాలో మహిళలు పూర్తి భిన్నంగా కనిపిస్తుంటారు. పొలాల్లో స్వేదం చిందించే వీడియోలు తీస్తారు. సంప్రదాయ వంటకాలతో సహజ సిద్దమైన ఆహారానికి సంబంధించి వీడియోలు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
చైనా భూభాగంలో కేవలం పది శాతం భూముల్లోనే వ్యవసాయం పరిఢవిల్లుతోంది. ప్రపంచంలోనే నంబర్ వన్ స్థాయిలో దిగుబడులు సాధిస్తున్నారు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. సుమారు 20 కోట్ల రైతు కుటుంబాలున్నాయి. ఇక్కడ మనకు మాదిరిగా భూమి ఎవరి సొంతం కాదు. ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. సగటున ఒక్కో కుటుంబానికి 1.6 ఎకరాలు లీజుకు ఇస్తారు.
ఇక్కడ రైతు కుటుంబాల్లో మహిళలే ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటారు. ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న ఒకటిన్నర ఎకరంలో 75 శాతం ఆహార పంటలే పండిస్తారు. ఆ కుటుంబ ఆహార అవసరాలకు తగ్గట్లు వరి, సోయాబీన్, మొక్కజొన్న, కూరగాయలు, పండ్లు, ఇతర చిరు ధాన్యాల పంటలు సాగు చేస్తారు. ఇక్కడ రైతు మొదటి మూడు నెలల సగటు ఆదాయం 5,398 యువాన్లు. అది మన రూపాయల్లో చూస్తే 64,776. గత ఏడాది కన్నా 16.3 శాతం పెరిగినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది.
వివిధ పంటల సాగుకు సంబంధించి విత్తనాల దగ్గర నుంచి యంత్ర పరికరాలు, ఎరువులు, పురుగుమందులు దాకా ప్రభుత్వమే సమకూరుస్తుంది. కుటుంబ సభ్యులు మొత్తం పంటల సాగులో నిమగ్నమవుతారు. కొందరు ఉద్యోగాలకు వెళ్లినా ఖాళీ సమయంలో వ్యవసాయ పనులు చేస్తుంటారు.
కుటుంబ అవసరాలకు పోను మిగతా ఉత్పత్తులను విక్రయిస్తారు. ఇక్కడ వ్యవసాయానికి అనుసంధానంగా అనేక పరిశ్రమలు నెలకొల్పారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, శుద్ది, మార్కెటింగ్ రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడంతో గ్రామీణ తలసరి ఆదాయం అప్రహతంగా పెరుగుతోంది. ఇలాంటి ప్రగతిని మన దగ్గర కలలోనైనా చూడగలమా !