నేటి నుంచి రెండు రోజులపాటు అధికార వైసీపీ ప్లీనరీ జరుగుతుంది. గడచిన మూడేళ్లలో అమలు చేసిన విధానాలపై లోతయిన చర్చ జరుగుతుందా ? ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపగలదా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్లీనరీ మొదటి రోజు అజెండాలో మౌలికమైన విద్య, వైద్యం, మహిళా సాధికారత, నగదు బదిలీ పథకాల గురించి తీర్మానాలపై చర్చ జరుగుతుంది. కనీసం ఈ రంగాలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది.
కేంద్రం నిర్దేశించిన నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రాథమిక విద్య వరకు మాతృభాషలో బోధన ఉండాలనే అంశాన్ని విస్మరించింది. తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్లు ఇంగ్లిష్ మీడియంలోకి మార్చేశారు. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ప్రపంచ స్థాయిలో పోటీ పడగలరని సీఎం జగన్ విశ్వసిస్తున్నారు. తెలుగు మీడియంను కూడా కొనసాగించాలనే సూచనలను తోసిపుచ్చారు. దీనివల్ల పిల్లలకు ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలు అర్థంగాక గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపవుట్స్ పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది.
విలీనం.. రేషనలైజేషన్‌తో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలి
పాఠశాలల విలీనం, రేషనలైజేషన్ పేరుతో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని పెంచడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. చిన్నారులకు పాఠశాల అందుబాటులో లేకుండా పోతోంది. పాఠశాల కనీసం రెండు మూడు కిలో మీటర్ల దూరమవడంతో పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి మళ్లీ తీసుకురావడం కన్నవాళ్లకు కష్టమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పనులకు వెళ్తే పిల్లలు బడికి ఎలా వెళ్తారనే సమస్య ముందుకొస్తోంది.
ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరిగితే అది విద్యార్థులపై ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి బదులు బలహీన పరుస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ప్రభుత్వం భేషజాలకు పోకుండా ప్లీనరీలో సమగ్రంగా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటుందా.. లేక తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటూ ముందుకెళ్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి నిధులు పెంచాలి
ఇక వైద్య రంగానికి సంబంధించి ప్రభుత్వం నాడు – నేడు ద్వారా కొంతమేర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు నియామకాలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు వెచ్చించలేకపోవడంతో మందులు, ఇతర సామగ్రి సరఫరాలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో రోగులకు అందే సేవల్లో ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. వైద్యుల బయట ప్రాక్టీస్‌ను నిషేధించడం మంచి పరిణామం.
అన్ని వసతులున్న ప్రభుత్వ ఆస్పత్రులకే ఆరోగ్యశ్రీని పరిమితం చేయడం ద్వారా మరింత బలోపేతం కావడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకునే పరిస్థితి వస్తే తప్ప సర్కారు ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపడవు. ఆ దిశగా ప్లీనరీలో చర్చించి తగు విధి విధానాలు అమలు చేయాలి.
సుస్థిర ఉపాధి పథకాలకు నగదు బదిలీ కావాలి
సంక్షేమ పథకాలకు నగదు బదిలీలో పారదర్శకత కనిపిస్తోంది. కాకుంటే ఇవేవీ సుస్థిర ఉపాధికి దోహదపడడం లేదు. ఏటేటా పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకు కొంత ఆదరువుగా నిల్చిన స్వయం ఉపాధి పథకాలను రద్దు చేయడం వల్ల నిమ్న వర్గాల్లో తీవ్ర ఆక్రోశం నెలకొంది.
ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ వర్గాల యువతకు స్వయం ఉపాధికి ఊతమిచ్చే పథకాలు ఇదే పారదర్శకతో అమలు చేయాలి. ఏటా కనీసం కొద్దిమందినైనా దారిద్ర్య రేఖను దాటించాలి. ఆ దిశగా నగదు బదిలీ పథకాలుండేట్లు ప్లీనరీలో చర్చించి తుగు కార్యాచరణకు రూపమివ్వాలి. ఇంత లోతైన విశ్లేషణతో ప్లీనరీలో చర్చలు జరుగుతాయా ?