మూడేళ్ల పాలనలో వైసీపీ సర్కారు తనదైన ముద్ర వేసుకుందని సీఎం వైఎస్ జగన్ గొప్పగా వెల్లడించారు. గత పాలనకు మన పాలనకు వ్యత్యాసం చూపించినట్లు పార్టీ ప్లీనరీలో సగర్వంగా ప్రకటించారు. మార్పును స్వాగతించాల్సిందే. అదే సమయంలో మార్పు అభివృద్ధికి దోహదపడాలి. పాత సమస్యలు పోయి కొత్తవి సృష్టించేట్లు ఉండకూడదు. ఈ వాస్తవాన్ని వైసీపీ ప్రభుత్వం మరచినట్లు కనిపిస్తోంది. ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుందని భావిస్తున్నారంటే.. ఎందువల్లనేది ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరం.
వైసీపీ ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసినట్లు ప్లీనరీలో సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నవరత్నాలు అమలు చేస్తామని ప్రకటించారు. అధికారానికి వచ్చాక కరోనా వచ్చింది. ప్రభుత్వ ఆదాయంతోపాటు ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఉపాధి పోయింది. జీవన వ్యయం పెరిగింది. కనీస అవసరాల జాబితా చాంతాడంత అయింది.
అమానవీయ లాక్డౌన్, ఆంక్షలతో దెబ్బతిన్న సగటు కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదు. ఇలాంటి విపత్కర స్థితిలోనూ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో విఫలమైంది. కేవలం నగదు బదిలీ పథకాలతో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టామని చెప్పుకోవడానికే పరిమితమైంది.
గృహ నిర్మాణంతో పేదలు మరింత అప్పుల్లోకి జారిపోతున్నారు
గృహ నిర్మాణానికి సంబంధించి పేదలు సొంతంగా ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లేవు. నగరాలు, పట్టణాలకు దూరంగా నివేశన స్థలాలు ఇవ్వడం.. నివాస యోగ్యంగా లేకపోవడం.. సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో కనీసం రూ.6 లక్షలు వెచ్చించనిదే నిర్మాణం సాధ్యం కాదు. ఇది ఆర్థిక వెసులుబాటు ఉన్నవాళ్లకు తప్ప పేదలు కట్టుకోలేరు.
పైగా అంత దూరం నుంచి నిత్యం పనులకు రావాలంటే కష్టమవుతుందని పేద లబ్దిదారుల్లో అసంతృప్తి నెలకొంది. ఈపాటికే నిర్మాణాలు చేపట్టిన వాటికి సకాలంలో బిల్లులు ఇవ్వలేకపోవడంతో పేదలను మరింత అప్పుల ఊబిలోకి నెడుతోంది.
నాడు– నేడుతో పాఠశాలలు, ఆస్పత్రులు అభివృద్ధి చేస్తున్నా వాటిని ప్రజలంతా వినియోగించుకోలగినప్పుడే అంతిమ ప్రయోజనం నెరవేరుతుంది. ప్రస్తుతానికి మౌలిక సదుపాయాలు కల్పించడం శుభ పరిణామం. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీని ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా ఇది కొంత దోహదపడుతుంది. పాఠశాలలు.. ఆస్పత్రులు పేదలకు చెందినవనే ముద్ర తొలగించినప్పుడే ప్రభుత్వం చేస్తున్న కృషికి నిజమైన సార్థకత ఏర్పడుతుంది. ఆ దిశగా ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపించడం లేదు.
కౌలు రైతులు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది
గతంలో లోపభూయిష్టంగా ఉన్న కౌల్దారీ చట్టంలో మార్పులు చేశారు. వీటితో కౌలు రైతులకు మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భూయజమాని రాతపూర్వక లేఖతోనే కౌలు గుర్తింపు అనడంతో బోగస్ పేర్లు ఈ క్రాప్‌లో నమోదవుతున్నాయి. వాస్తవ కౌల్దారులు గుర్తింపునకు నోచుకోవడం లేదు.
రైతు భరోసా, పంట నష్ట పరిహారం , పంట రుణాలు పొందలేక తీవ్రంగా నష్టపోతున్నారు. చివరకు ఆత్మహత్యలు పెరగడానికి ఇవ్వన్నీ దోహదపడుతున్నాయి. దీనిపై ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించలేదా.. ఉద్దేశపూర్వకంగా వదిలేసిందా అనేది చెప్పాలి.
నూతన విద్యా విధానం అమలులో ఎన్నో చిక్కులు
నూతన విద్యా విధానం అమలులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. పాఠశాలల విలీనం.. రేషనలైజేషన్‌తో స్కూళ్ల సంఖ్య తగ్గిపోతుంది. ఉపాధ్యాయులపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. పసి పిల్లలు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరానున్న పాఠశాలకు రావాలంటే కష్టం. అందులోనూ కూలీనాలీ చేసుకునే పేద తల్లిదండ్రులకు ఇది మరింత చిక్కులు తెచ్చిపెడుతోంది.
ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో బోధన తప్పనిసరని ఎన్ఈపీ నిర్దేశిస్తున్నా ప్రభుత్వం మొండిగా ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చింది. ఇది డ్రాప్ అవుట్స్‌కు దారితీసే అవకాశాలున్నాయి. ఇదంతా ఉపాధ్యాయల సంఖ్యను కుదించి భర్తీ చేయాల్సిన పోస్టుల స్థానంలో మిగులు చూపే ప్రయత్నంలా కనిపిస్తోంది. ఇంటర్ తీసేసి పన్నెండో తరగతి దాకా కొనసాగించడం ఆహ్వానించదగ్గ పరిణామం.
కేంద్రంపై వ్యతిరేకత రాష్ట్ర సర్కారునూ తాకొచ్చు
కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ప్రజలను తీవ్ర కష్టాల్లోకి నెడుతున్నాయి. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంపుతో సగటు ప్రజల ఆదాయాల్లో భారీ కోత పడింది. కేంద్ర సర్కారు సంస్కరణలు అమలు కోసం అప్పులకు లింకు పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నింటికీ ఎస్ బాస్ అంటోంది. చెత్య, ఆస్తి, ఇంటి పన్నుల పెంపుదల, జీఎస్టీతో నిత్యాసవరాల ధరలు పెరగడం కూడా ప్రజల ఆక్రోశానికి కారణమవుతోంది.
కేంద్ర విద్యుత్ సంస్కరణలతో కరెంటు చార్జీల మోత దారుణంగా పెరిగింది. ఇది రాష్ట్ర విద్యుత్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయకుండా ముందుకెళ్తే ప్రజల్లో మరింత వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఖాయం. ఆ దిశగా ఆలోచిస్తారా !