సీఎం వైఎస్ జగన్ వైసీపీకి జీవిత కాల అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎన్నుకుంది. ఈమేరకు పార్టీ ప్లీనరీలో తీర్మానం చేశారు. అలాగే పార్టీ పేరును వైఎస్సార్సీపీగా మార్చారు. ఓ రాజకీయ పార్టీకి లైఫ్ టైమ్ అధ్యక్షుడిగా ఎన్నికగావడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా లేదా అనేది చూడాలి. ఈ పార్టీ తీరుపై అనేకమంది విపక్షాల నేతలు విమర్శలు సంధించారు. పలువురు మేథావులు సైతం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని పేర్కొన్నారు. వ్యక్తుల కలయికతో ఏర్పడే ఓ రాజకీయ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అనే భావన ఎక్కడా ఉండదని ఉటంకించారు. ఇంతకీ వైఎస్ జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక మర్మమేంటనేది పరిశీలిస్తే..
వైసీపీలో సీఎం వైఎస్ జగన్‌ను ప్రశ్నించేవాళ్లు లేరు. కనీసం అధ్యక్ష పదవికి పోటీపడేవాళ్లు అంతకన్నా లేరు. ఇప్పటిదాకా గౌరవాధ్యక్షులుగా ఉన్న వైఎస్ విజయమ్మ పక్కకు తప్పుకున్నారు. అది యాధృచ్ఛికమా.. ఒత్తిడి కారణమా అనేది పక్కన పెడితే ఇప్పుడు వైఎస్ కుటుంబం నుంచి జగన్‌తో పోటీ పడేవాళ్లెవరూ లేరు.
ఐదేళ్లకోసారి ప్లీనరీలు ప్రహసనంగా నిర్వహించినా ఎన్నికల నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి వచ్చింది. దీన్ని తోసిపుచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అని ఆలోచిస్తే.. దేశంలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలే కారణమని తెలుస్తోంది.
బీజేపీ ఎత్తుగడల వల్ల ముందస్తుగా జాగ్రత్త పడడమా !
కేంద్రంలోని బీజేపీకి సన్నిహితంగా ఉన్న ఏ పార్టీని అది వదల్లేదు. గతంలో తమిళనాట రాజకీయాల్లో అన్నాడీంకేను పావును చేసి ఆడించింది. జయలలిత మరణం అనంతరం శశికళను అవినీతి కేసులతో జైలుకు పంపారు. నిప్పు ఉప్పుగా ఉన్న పళనిస్వామి, పన్నీరు సెల్వాన్ని ఏకం చేశారు. అయినా అక్కడ కాషాయపార్టీ ఎత్తుగడలు బెడిసి కొట్టాయి.
తర్వాత ఎన్నికల్లో డీఎంకే విజయదుందుభి మోగించింది. ఇప్పుడు అన్నా డీంకేలోని పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. చివరకు పార్టీ సర్వసభ్య సమావేశం పన్నీరు సెల్వం వర్గాన్ని బయటకు నెట్టేసింది.
మహారాష్ట్ర అనుభవం అప్రమత్తం చేసినట్లుంది..
మొన్నటి మహారాష్ట్ర సంక్షోభం కూడా కమలనాధులు సృష్టించిందే. చివరకు ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ తమదేనన్నాడు. ఉద్దవ్‌ను ఇంటికి పంపేశారు. ఇలాంటివి గడచిన ఎనిమిదేళ్లలో బోలెడు ఉదాహరణలున్నాయి. ప్రాంతీయ పార్టీలతో చెలిమి చేయడం.. ఆనక ఆ పార్టీల్లో చిచ్చు పెట్టడం ద్వారా బలపడాలనే ఎత్తుగడలను బీజేపీ అనుసరిస్తూ వస్తోంది.
సమీప భవిష్యత్తులో వైసీపీకి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఏక వ్యక్తి స్వామ్యంతో నడిచే పార్టీలను చీల్చడం కమలనాధులకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి ప్రమాదాన్ని ఊహించే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేగాకుండా బీజేపీ పెద్దలు కేవలం జగన్‌కు అండదండలు ఇవ్వడానికే పరిమితం కాలేదు. ఓ వైపు జనసేనను చంకనెత్తుకున్నారు. మరోవైపు టీడీపీకి కన్నుగీటుతున్నారు. అందువల్ల కషాయ నేతలు ఎప్పుడు ఎవరిపై వేటు వేస్తారో ఊహించడం కష్టం. అందుకే ముందస్తు జగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హామీలు.. పథకాల అమలుకు నేనున్నాననే భరోసా ఇచ్చేందుకేనా !
మరోవైపున రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు.. సంక్షేమ పథకాలను అమలు చేసే పూచీ నాది అన్నట్లు సీఎం జగన్ ఫోకస్ కావాలనుకుంటున్నారు. సంక్షేమ పథకాల లోగోల్లో వైఎస్సార్ చిత్రాన్ని కనుమరుగు చేసేశారు. కేవలం జగన్ ఫొటో మాత్రమే కనిపిస్తోంది. పార్టీ నేతలు పథకాలు లేదా హామీలపై పెదవి విరిచినా నేనున్నాననే భరోసా ఇచ్చేందుకు జీవిత కాల అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
దీంతో ఇటు పార్టీలో మరెవ్వరితో పన్లేదు.. అంతా తానేనని చెప్పుకోవచ్చు. అటు ప్రజల్లో సంక్షేమ పథకాలు కొనసాగిస్తాననే భరోసా ఇచ్చేందుకు దోహదపడుతుంది. ఐదేళ్లకోసారి నిర్వహించే ప్లీనరీలో జగన్‌తో పోటీ పడేవాళ్లు లేకున్నా ఇలాంటి ఉపద్రవాలను ఊహించి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.