టీడీపీ మహానాడుకు తరలిన వారిలో ఓ క్రమశిక్షణ కనిపించింది. కుటుంబాలతో సహా కదిలి వచ్చారు. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే కసి వ్యక్తమైంది. అందుకోసం ఎందాకైనా వెళ్తామనే ధీమా ఆవిష్కృతమైంది. అనేక ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయని పట్టుదల కనిపించింది. అదే వైసీపీ ప్లీనరీలో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే తపన క్యాడర్లో బయటపడలేదు. సగం మంది వేదిక వద్ద ఉంటే మరో సగం మంది రోడ్లపైన, వాహనాలకే పరిమితమయ్యారు. మధ్యాహ్నం తర్వాత కూడా గ్రామాల్లో జనం లేక బస్సులు బయల్దేరలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు ప్రభుత్వ యంత్రాంగంపై ఎంతటి ఒత్తిడి పెట్టినా అంతంత మాత్రంగానే నెట్టుకొచ్చారు.
తెలుగు దేశం పార్టీ మహానాడుకు ప్రభుత్వం అనేక ప్రతిబంధకాలను సృష్టించింది. ఆర్టీసీ బస్సులను కేటాయించలేదు. విద్యాసంస్థల వాహనాలను ఇస్తే ఊరుకోబోమని అధికారులు కన్నెర్రజేశారు. చివరకు వేదిక కోసం దరఖాస్తు చేసుకున్నా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు ససేమిరా అన్నారు. చివరకు మండువారిపాలెం రైతులు ముందుకొచ్చి స్వచ్చందంగా వాళ్ల భూములు ఇచ్చారు.
మహానాడుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడానికి పార్టీ అభిమానులే కీలక పాత్ర పోషించారు. ఖర్చుపెట్టి వాహనాలు సమకూర్చలేమని మండల నాయకులు చేతులెత్తేసినా టూ వీలర్స్, సైకిళ్లు, ట్రాక్టర్లు, ఆటోల్లో భారీగా తరలి వచ్చారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణించారు. చిన్నారులను వెంటబెట్టుకొని కుటుంబాలు కదిలాయి. ఇన్ని లక్షల మంది వస్తున్నారన్నా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ఒక్క పోలీసు కనిపించలేదు. అక్కడక్కడా వాహనాలను అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. తెలుగు తమ్ముళ్లే వలంటీర్లుగా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా విధులు చేపట్టారు.
వైసీపీ ప్లీనరీ రెండోరోజు సుమారు మూడున్నర లక్షల మందికి పైగా హాజరైనట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ పత్రికా ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుమారు రెండు వేల బస్సులను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయాన్నే బయల్దేరిన బస్సులు నిర్దేశించిన పార్కింగ్‌లో పెట్టాయి. అందులో వచ్చిన అభిమానులు వేదిక వద్దకు చేరుకున్నారు. చాలా బస్సులు ఒంటిగంట తర్వాత గ్రామాల నుంచి బయల్దేరాయి. వాటిల్లో వచ్చిన వాళ్లు ప్లీనరీ ప్రాంగణం వద్దకు చేరుకోలేకపోయారు. దాదాపు మూడు కిలో మీటర్ల అవతలే నిల్చిపోయారు.
తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ఆరాటం కార్యకర్తల్లో అంతగా వ్యక్తం కాలేదు. ఏదో ఇష్టం లేకున్నా హాజరైనట్లు కనిపించింది. పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడ్డాం. ఇప్పుడు ప్లీనరీకి వెళ్లకుంటే తమ కష్టమంతా వృథా అవుతుందేమోనన్న భావనతో వచ్చినట్లుంది. మిగతా వాళ్లకన్నా ఎక్కడ వెనకబడి పోతామోనన్న అభద్రతా భావం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఎన్నికలకు సిద్దం కావాలని సీఎం జగన్ పిలుపునిచ్చినా క్యాడర్లో అంతటి జోష్ కనిపించలేదు. ఇంకా మరో ఏడాదిన్నర సమయం ఉంది. ఈలోగా వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు.