“ వచ్చే అరకొర వేతనాలతో చావలేక బతుకుతున్నాం. మూడు నెలలపాటు వేతనాలు పెండింగ్ పెడితే ఏం చెయ్యాలి ! పథకాలకు డబ్బులుంటున్నాయి. మాకు జీతాలు ఇచ్చేందుకు లేవా ! ఇదేం పాలన సార్ !” తిరుపతి రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ సెక్యూరిటీ గార్డు ఆవేదన ఇది. నెలకు వచ్చేది పదకొండు వేలు. వాటితో నెలంతా కుటుంబం గడుస్తుందా ! ఏళ్ల తరబడి చేస్తున్నా ఇవే వేతనాలు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి అల్లాడుతున్నారు. ఇక్కడ పనిచేసే ఎంఎన్‌వో, ఎఫ్ ఎన్వోలు ఆప్కాస్‌లో చేరినా ఇదే పరిస్థితి.
పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న పారిశుద్య సిబ్బందికి జీతాలు పెంచామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. మూల వేతనం పెంచకుండా హెల్త్ అలవెన్స్ పేరుతో కొద్ది నెలలు ఇచ్చింది. దాదాపు ఐదు నెలల నుంచి హెల్త్ అలవెన్స్ ఇవ్వడం లేదు. దీంతో పాత వేతనాలతో కుటుంబాలు గడవక విలవిల్లాడుతున్నారు. వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారు. నగరాలు, పట్టణాలు విస్తరిస్తున్నా సిబ్బందిని పెంచడం లేదు. ఓ వైపు పనిభారం పెంచుతూ ఇవ్వాల్సిన వేతనాలు పెండింగ్ పెట్టడంతో అనివార్యంగా సమ్మె బాట పట్టారు.
లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు. ప్రజలపై విపరీతంగా భారాలు వేస్తూ మూలిగలు పీలుస్తున్నారు. అయినా అరకొర వేతనాలతో బతికే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు నెలనెలా చెల్లించడానికి నిధులు ఉండవు. అప్పుడెప్పుడో కరోనా కాలంలో మాస్కులు కుట్టిన దర్జీలకు రూ. 5 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదంటే.. అసలు నగదు చెల్లింపుల్లో ప్రభుత్వ ప్రాధాన్యాలేమిటి అనే ప్రశ్న తలెత్తుతోంది.
నిద్ర లేచింది మొదలు వేదికలపై సంక్షేమ జపం చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ ముద్ర వేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో వెచ్చించిన దానికన్నా అదనంగా ఖర్చు పెట్టిందీ అంతగా లేదు. ఈమాత్రం దానికి ఎంతమంది కార్మికులు, చిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారు ! పది పదిహేను వేలలోపు వేతనాలతో బతికే వాళ్లకు నెలల తరబడి ఇవ్వకుంటే వాళ్లు ఎలా బతకాలి !
ఉచిత నగదు పథకాలకు డబ్బులుంటాయి. మీడియాలో భజనకు వందల కోట్లు తగలెయ్యడానికి నిధుల కొరత లేదు. ఈ అల్ప జీవుల వేతనాలు మాత్రం చెల్లించడానికి నిధులు ఉండవు. పేద కార్మికులు, చిరుద్యోగులంటే లెక్కలేని తనమా ! దీన్ని అద్భుత పాలనంటారా ! ఆలోచించండి !