సగటు మహిళల్లో ఇంతటి ఆక్రోశం మునుపెన్నడూ చూడలేదు. నిత్యావసరాలు, వంట గ్యాస్ ధరల పెంపుతో కాపురాలు నెట్టుకు రాలేక పోతున్నారు. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల ద్వారా నగదు అందుకుంటున్నారుగా అంటే పథకాలతో వచ్చేదెంత ? పెరిగిన ధరలెంతని ప్రశ్నిస్తున్నారు. ఇంకా స్థానిక మౌలిక సదుపాయాల కొరతపై నిరసిస్తున్నట్లు సీపీఎం బాపట్ల జిల్లా కార్యదర్శి చింతలపూడి గంగయ్య వెల్లడించారు. ఇటీవల ఇంటింటికీ సీపీఎం పర్యటనలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.
ఏపీ ప్రభుత్వం 90 శాతం మహిళలకే సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. జనాభాలో సగమైన మహిళలు మళ్లీ వైసీపీకి బ్రహ్మరథం పడతారనే అంచనాల్లో ఉంది. నవరత్నాలతో అధికారాన్ని కైవసం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది. అవినీతికి తావు లేకుండా సుమారు 1.49 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా లబ్దిదారులకు నగదు అందించినట్లు సీఎం జగన్ అనేక వేదికలపై వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయం నుంచి పంటల బీమా అందిస్తూ రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నట్లు సీఎం చెబుతున్నారు.

మరోవైపు బాదుడే బాదుడు పేరుతో అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్తున్నాయి. విద్యుత్ చార్జీల నుంచి ఆస్తి, ఇంటి పన్నుల పెంపు, చెత్తపై పన్ను వేయడాన్ని ప్రజలు నిరసిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెబుతున్నారు. మహిళలకు 45 ఏళ్లకే పింఛను ఇస్తామన్న హామీ ఏమైందంటూ నిలదీశారు. కరెంటు వినియోగం పెరిగిందని అమ్మ ఒడి తొలగించడం, ఒంటరి మహిళల పింఛన్లలో నిబంధనలు మార్చడంపై ప్రజలు మండిపడుతున్నట్లు రవికుమార్ చెప్పారు.
‘గడప గడపకూ మన ప్రభుత్వం’ ఎన్నో సమస్యలను పరిష్కరించింది
గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట జనం దగ్గరకు వెళ్లడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించడానికి దోహదపడిందని పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి రావి రామనాధం బాబు వెల్లడించారు. ఇప్పటికి 50 రోజులపాటు నిరంతరం కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. భూములకు సంబంధించి ఆన్ లైన్ నమోదు, ఎస్సీల శ్మశాన వాటికలకు స్థలం కొరతలాంటి వాటిని పరిష్కరించామన్నారు. తటస్థంగా ఉన్నవాళ్లు, టీడీపీకి చెందిన కుటుంబాలకు సైతం ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది చేకూరిందో తెలియజేయడానికి కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నట్లు తెలిపారు.

“ ప్రధానంగా ఎస్సీఎస్టీబీసీ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల సమస్య నెలకొంది. వీటికి సంబంధించి గ్రానైట్ క్వారీ వేస్ట్‌తో రోడ్లు వేయాలనుకుంటున్నాం. ఇందుకోసం రూ.64 లక్షలతో ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్‌కు ఇచ్చాం. త్వరలో పనులు మొదలు పెడతాం ” అంటూ రామనాధం బాబు వివరించారు. ఈ దఫా తిరుగులేని ఆధిక్యంతో పర్చూరులో వైసీపీ విజయకేతనం ఎగరేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
మహిళలే కాదు.. అన్ని వర్గాల్లోనూ అసంతృప్తులే
“కేవలం మహిళలే కాదు. అసలు అన్ని వర్గాలు ప్రభుత్వ తీరుపై కన్నెర్రజేస్తున్నాయి. రైతులు, నిరుద్యోగులు, అణగారిన వర్గాల్లో ఎంతో ఆవేదన నెలకొంది. ప్రధానంగా కౌలు రైతుల జీవితాలు ఛిద్రమైనా ప్రభుత్వం ఆదుకున్న దాఖలాల్లేవు. నాలుగు నెలల నుంచి ధాన్యం బకాయిలు పేరుకుపోయాయి. ఎస్సీలకు 200 యూనిట్ల కరెంటు రాయితీకి కొర్రీలు వేశారు. ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలను పరిష్కరించడంలేదు. అందుకే ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది !” అంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య పేర్కొన్నారు.
రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి నాలుగు నెలలైనా బకాయిలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభమైనా పంట కాల్వల్లో గుర్రపుడెక్క తొలగించకపోవడంతో నీటి ప్రవాహం తగినంతగా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. భట్రిప్రోలు వద్ద ఏడు కిలోమీటర్ల కెనాల్లో గుర్రపుడెక్క తొలగించడానికి రూ. లక్షా 10 వేలు కేటాయించారు. ఆగస్టు లోపల క్లియర్ చేస్తామని అధికారులు చెబుతుంటే రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు.

చందోలులో యువకులు ఎక్కువగా సాయుధ దళాల్లో చేరుతుంటారు. ఆర్మీకి సంబంధించి అన్ని పరీక్షలు పాసై తుది దశలో ఉండగా అగ్ని పథ్ ప్రకటన వెలువడడంపై తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం దీన్ని వ్యతిరేకించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఇంకా భట్టిప్రోలు జగనన్న కాలనీల్లో లబ్దిదారులు ఇల్లు కట్టుకోవడానికి అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో బిల్లులు రాక ఆందోళన చెందుతున్నారు.