భారత రాజ్యాంగంలో ఎక్కడా మత ప్రస్తావన ఉండదు. అలాంటిది ప్రజల సొమ్ముతో చేపట్టే ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా మతపరమైన అంశాలను చొప్పించకూడదని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. ఇలాంటి మౌలిక సూత్రాలను పాతరేసే చదువుకున్న మూర్ఖ అధికారులకు తమిళనాడు ఎంపీ ఎస్ సెంథిల్ కుమార్ బాగానే గడ్డి పెట్టారు. భూమికి పూజ చేసేదేంటని నిలదీశారు. పూజా కార్యక్రమాన్ని తొలగించిన తర్వాతనే శంకుస్థాపన చేశారు. శబ్బాష్ సెంథిల్ కుమార్. మీలాంటోళ్లు ఈ గడ్డపై లేనందుకు తెలుగు ప్రజలు ఎంతో ఇదై పోతున్నారనుకో.
తమిళనాడులోని ధర్మపురి జిల్లా ఆలంపురంలో ఇటీవల పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించేందుకు ఎంపీ సెంథిల్ కుమార్‌ను ఆహ్వానించారు. అక్కడకు చేరుకున్న ఎంపీ భూమి పూజకు చేసిన ఏర్పాట్లపై దునుమాడారు. ఇదేమైనా హిందూ మత కార్యక్రమమా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది అన్ని మతాల ప్రజలకు సంబంధించిన రోడ్డు. అందులో దేవుడ్ని నమ్మని వాళ్లు కూడా ఉంటారు. అలాంటప్పుడు బ్రాహ్మణుడితోపాటు చర్చి ఫాదర్, మశీదు నుంచి ఇమామ్, హేతువాదులైన ద్రవిడ సంఘ పెద్దలను పిలవండి. మీరు చదువుకున్నారుగా.. ఇవన్నీ చేయకూడదని మీకు తెలియదా ! సీఎం స్టాలిన్ పాల్గొనే ఏ కార్యక్రమంలోనైనా ఇలాంటివి ఎప్పుడైనా చూశారా అంటూ ఇంజనీరింగ్ అధికారులపై అగ్గిలం మీద గుగ్గిలమయ్యారు. దీంతో బిక్కచచ్చిపోయిన అధికారులు తక్షణమే పూజాది క్రతువులను తొలగించారు.
ఆహా.. ఇది కదా ప్రజాస్వామ్యమంటే.. ఇది కదా ప్రజాభీష్ట పాలనంటే.. ఇదే కదా సమ భావనంటూ నెటిజన్లు ఎంపీ సెంథిల్ కుమార్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆయన పాల్గొన్న కార్యక్రమం వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇలాంటోళ్లు రాష్ట్రానికి ఒక్కడంటే ఒక్కడుంటే చాలు. మారదా ఈ పాడులోకం ! అంటూ జనం ఆ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు.