ఇప్పటిదాకా వైసీపీ బ్యాక్ బోన్ క్లాస్ చెబుతున్న బడుగు బలహీన వర్గాల్లో ఆక్రోశం తారా స్థాయికి చేరింది. కుల కార్పొరేషన్లతో తమకు ఏం ఒరిగిందంటూ చైర్మన్లను ప్రశ్నిస్తున్నారు. మీరున్నది కేవలం ప్రభుత్వ పథకాల ప్రచారానికేనా అంటూ ఆయా సామాజిక వర్గాలు నిలేస్తున్నాయి. నేరుగా చట్ట సభలకు ఎన్నిక కాలేని అల్పసంఖ్యాక వర్గాలకు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ గురించి ఎందుకు మాట్లాడరనే ఆక్రోశం నెలకొంది. కొన్ని కులాలను ఎస్సీ, ఎస్టీల్లో చేరుస్తామన్న హామీని మరిచారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
“అత్యల్పసంఖ్యాక బీసీ కులాల్లో జనాభా పరంగా రజకులు మొదటి స్థానంలో ఉంటారు. ఎస్సీల్లో చేరుస్తామన్న హామీ ఏమైందని మా జనం అడుగుతుంటే సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ఎమ్మెల్సీ సంగతి ఏందంటే నీళ్లు నమలాల్సివస్తోంది. గత ప్రభుత్వం రజక కార్పొరేషన్ ద్వారా ఏటా రూ. 33 కోట్లు ఇస్తే.. వైసీపీ ప్రభుత్వం పదివేల చొప్పున రూ.88 కోట్లు ఇస్తోందన్న తృప్తి మాత్రమే మిగిలింది! ”అంటూ వైసీపీకి చెందిన రజక సంఘ నేత పొటికలపూడి జయరాం నిర్లిప్తత వెలిబుచ్చారు.
“ కొత్త దోబీ ఘాట్లకు స్థలాల్లేవు. వృత్తి పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కోకొల్లలు. రజకులపై దాడులను గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అసలు సమస్యలను వినే నాయకులేరీ ! ” అంటూ వైసీపీకి చెందిన రజక సంఘం నేత పొటికలపూడి జయరాం ఆవేదన వ్యక్తం చేశారు.
వడ్డెరలకు లేబర్ కాంట్రాక్టులేవీ !
గత ప్రభుత్వ హయాంలో వడ్డెర సంఘాల ఫెడరేషన్‌కు అనేక లేబర్ కాంట్రాక్టులు దక్కేవి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక్క వర్క్ ఇచ్చిన దాఖలాల్లేవు. ప్రభుత్వ పథకాలను వడ్డెరల వద్దకెళ్లి ప్రచారం చేయడానికి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ వెనకాడుతున్నారు. పనుల గురించి ఎక్కడ నిలదీస్తారోనన్న దిగులు పట్టుకుంది.
వృత్తి కూడుపెట్టడం లేదు.. ప్రత్యామ్నాయ ఉపాధి ఏదీ
కుమ్మరి శాలివాహన ఫెడరేషన్‌కు గతంలో ఇబ్బడి ముబ్బడిగా నిధులుండేవి. వృత్తి కనుమరుగవుతున్న కారణంగా ఇతర రంగాల్లో స్వయం ఉపాధి కల్పనకు ఫెడరేషన్ వెన్నుదన్నుగా నిలిచేది. ఇప్పుడు శాలివాహన కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి విదిల్చిన పాపాన పోలేదు. కుండలు అమ్ముకునేవాళ్లకు కేవలం పది వేల బ్యాంకు రుణం ఇప్పించడానికే ప్రభుత్వం పరిమితమైంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ఎస్సీఎస్టీబీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లు నిర్వీర్యంగా పడి ఉన్నాయి. ఒక్క కార్పొరేషన్‌కు నిధులు కేటాయించలేదు. చివరకు ఎస్సీఎస్టీలకు కేంద్రం నుంచి వచ్చిన ఎన్ఎస్ఎఫ్డీసీ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో తొక్కిపట్టింది.
పప్పు ఉప్పులోకి తాళింపు పథకాలు.. వెన్ను విరిచే భారాలు
గత ప్రభుత్వాలు అణగారిన వర్గాలకు చెందిన కొన్ని వేల కుటుంబాలనైనా స్వయం ఉపాధి పథకాలతో దారిద్య్ర రేఖ నుంచి ఎగువకు తెచ్చేది. అలాంటి వాటన్నింటినీ ప్రభుత్వం అటకెక్కించింది. పప్పులోకి ఉప్పులోకి తాలింపులా పనికొచ్చే పథకాలతోనే సరిపెడుతోంది. ఇవే గొప్పన్నట్లు ప్రచారం చేయాలని ఆయా కార్పొరేషన్ల పాలకవర్గాలను ఆదేశిస్తోంది.
ఓవైపు బడుగు బలహీన వర్గాల బడ్జెట్‌ను ఊరుమ్మడి పథకాలకు వెచ్చిస్తోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని జీఎస్టీ పన్నులతో ఎడాపెడా బాదేస్తున్నాయి. రోజంతా కష్టం చేసినా పొయ్యిలో పిల్లి లేవని దుస్థితికి నెట్టేశారు. ప్రజలు నిరంతరం వినియోగించే పాలు, పెరుగు, మజ్జిగపై కూడా పన్నులు విధిస్తున్నారు. కరెంటు, రవాణా చార్జీలు ఠారెత్తిస్తున్నాయి.
నిత్యావసర సరకుల కొనుగోలుకే ఆదాయం సరిపోని దురవస్థలో అత్యధిక ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలున్నాయి. అందుకే ప్రభుత్వంపై ఆక్రోశం వ్యక్తమవుతోంది. వైసీపీకి బ్యాక్ బోన్ క్లాస్ గా ఉన్న వాళ్లనే ప్రభుత్వం వెన్ను విరుస్తుందంటూ ఆగ్రహావేశాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై వైసీపీ పెద్దలు ఎలా స్పందిస్తారో !