ఇంటింటికీ రేషన్ సరకులు ఇస్తున్నప్పుడు ఇక డీలర్లతో పనేముంది ! డీలర్ల వ్యవస్థను రద్దు చేసేద్దామని సీఎం వైఎస్ జగన్ చెప్పేశారు. ప్రజాపంపిణీపై సమీక్ష సందర్బంగా సీఎం ఇలా వ్యాఖ్యానించారు. రేషన్ బియ్యాన్ని లబ్దిదారులు వాడుకోవడం లేదు. బయట మార్కెట్లో అమ్మేస్తున్నందున సన్న బియ్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈపాటికే డీలర్ల సంఘం ఇంటింటికీ రేషన్ సరకులు ఇవ్వడం సరికాదని హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
“ప్రభుత్వ స్కూళ్లు పనికిమాలినవి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సరిగా చెయ్యరు. చౌక డిపోల్లో ఇచ్చే బియ్యం తినలేం ! అంటూ ఈపాటికే ప్రభుత్వాలు పిచ్చి కుక్క ముద్ర వేశాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యా బోధన ఉన్నా.. ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించినా సరే. నాణ్యమైన రేషన్ బియ్యం ఇచ్చినా వాటిపై కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ముద్ర అంత తేలిగ్గా సమసిపోదు.

ప్రజలు వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేట్లు చేయాలన్న చిత్తశుద్ది ప్రభుత్వాలకు లేదు. రేపోమాపో రేషన్ సరకులకు నగదు బదిలీ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు”అంటూ ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వడం లేదనే అమ్ముకుంటున్నారు
రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్ల బీపీఎల్ కార్డులున్నాయి. అందులో దాదాపు 50 లక్షల బియ్యం కార్డులకు రేషన్ సరకుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. కార్డుదారులకు నాణ్యమైన సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆమేరకు కొంత కాలం ఇచ్చారు.
తర్వాత అన్నం నిల్వ ఉండడం లేదని.. ముద్దవుతుందని తినడం మానేశారు. బియ్యాన్ని హోటళ్లు, టిఫిన్ బళ్ల వాళ్లకు అమ్ముకుంటున్నారు. మరికొందరు రేషన్ వాహనం వాళ్లకే కిలో రూ.7 లెక్కన ఇచ్చేస్తున్నారు. బయట మార్కెట్లో కిలో రూ.40–50 వెచ్చించి కొనుక్కుంటున్నారు.
రేషన్ సరకుల సంఖ్యను క్రమేణా కుదించారు
ఒకప్పుడు రేషన్ దుకాణాల్లో బియ్యంతోపాటు కేజీ చొప్పున పంచదార, కందిపప్పు, గోధుమలు, పామాయిల్, ఉప్పు ఇచ్చేది. క్రమేణా అన్నీ కనుమరుగై ఇప్పుడు బియ్యం, కందిపప్పు మాత్రమే ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులను అన్ని రకాల సరకులు అమ్మే రిటైల్ షాపులుగా మార్చడానికి ఓ ప్రయత్నం చేశారు.
ఫ్యూచర్ గ్రూపుతో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. ఎందుకో మళ్లీ వెనకడుగేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గోనె సంచులకు ధర పెట్టి డీలర్ల నోరు కొట్టింది. ఇంటింటికీ సరకులను చేరుస్తూ ఏకంగా డీలర్ల వ్యవస్థనే రద్దు చేయడానికి సిద్దమైంది.
త్వరలో సరకులకు బదులు నగదు బదిలీ ?
త్వరలో ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేసి బియ్యం కార్డుదారులకు నగదు బదిలీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కిలో బియ్యానికి రూ. 10 లేదా రూ.12 ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో తమకు సబ్సిడీ భారం తగ్గుతుందని కేంద్ర సర్కారు భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కేంద్రం అడ్డు చెప్పకపోవచ్చు. కొన్నాళ్లకు గ్యాస్ సబ్సిడీలాగా ఇది కూడా ఎత్తేసినా ఎవరూ పట్టించుకోరు.
ఇప్పుడు డీలర్ల వ్యవస్థను రద్దు చేసినా కేంద్రం పట్టించుకోకపోవచ్చు. పేదలకు ఆహార భద్రతను కల్పించాల్సిన సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైతే దేశంలో మరింతగా ఆకలి చావులు, పౌష్టికాహార లోపం తలెత్తుతుందని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తే ఈ హెచ్చరికలను పట్టించుకోకపోవచ్చు.