ఓ మనిషి తత్వాన్ని అర్థం చేసుకోవడం అంత తేలిక్కాదు.
అవాస్తవాల మధ్య జీవిస్తూ సత్యం కోసం అన్వేషిస్తుంటారు.
తాము చూసింది.. విన్నదే నిజమనే భ్రమల్లోకి జారిపోతుంటారు.
తర్కాన్ని వదిలేసి మూఢ భక్తిలో మునిగి తేలుతుంటారు.
నమ్మింది తప్పని తేలినా సమర్థించుకోవడానికే తపన పడుతుంటారు.
వాస్తవికతలోకి వచ్చేందుకు సిద్దం కాలేకపోతుంటారు.
ఇదీ.. మన దురవస్థకు మూలమని ఎందరు గ్రహిస్తారు !
నేడు మన పాలకులు ప్రజల కష్టార్జితంతో పోగుపడిన ఆస్తులను గుప్పెడు మంది నోటికి అందిస్తున్నారు. వాళ్లను ప్రపంచ కుబేరుల సరసన నిలిపేందుకు తహతహలాడుతున్నారు. వాళ్లిచ్చే ముడుపులతో అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనేస్తున్నారు. తమకు అడ్డొచ్చిన విపక్షాల రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు.. నియంతృత్వమని చాటుతున్నారు. ఇదేంటని ప్రశ్నించినా సహించలేకపోతున్నారు. ఐటీ, ఈడీ, ఎన్ఐఏలాంటి కేంద్ర సంస్థలను గుప్పెట పట్టి ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారు.
నిత్యావసర సరకుల ధరలను సామాన్యులు భరించలేకపోతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడంతో ధరలు కొండెక్కాయి. అదొక్కటే కారణం కాదు. జీఎస్టీ కౌన్సిల్ బాదే పన్నుల దెబ్బకు సగటు పౌరులు విలవిల్లాడుతున్నారు. సదరు కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ప్రతినిధులుంటారు. వాళ్లంతా అంగీకరిస్తేనే పన్నులు పెంచుతున్నారన్న సంగతిని మర్చిపోతున్నారు.
ఇలా ప్రజల మూలిగలు పీలుస్తూ కొద్దిమంది జేబులు నింపే దోపిడీ నిరంతరం కొనసాగుతున్నా సరే. మా జగన్‌కు జై.. మా కేసీఆర్‌కు జై.. అంటూ పూనకంతో ఊగిపోయేవాళ్లను ఏమంటాం ! మా చంద్రబాబు ఏం చెప్పినా రైటే. మా పవన్ దేముడని కొలవడం ఎంతటి వైపరీత్యం ! వీళ్లంతా కేంద్రానికి తొత్తులవడం వల్లే ప్రజలకు ఇన్ని కష్టాలని ఎప్పుడు గ్రహిస్తారు !
మరోవైపు కేంద్ర సర్కారుకు అధికారం లేకున్నా రాష్ట్రాలపై అడ్డగోలుగా జులుం ప్రదర్శిస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి గండికొడుతున్నా రాష్ట్రాల నేతలు కిమ్మనడం లేదు. నదులు, ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనమేంటీ ! విద్యుత్ రంగంలో కేంద్రం బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోంది. ఉమ్మడి పరిధిలోని వ్యవసాయాన్ని కబళించడానికి అడుగులు వేస్తోంది.
ప్రజల ఆహార భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నా నోరు మెదపని సామంత రాజుల్లా ముఖ్యమంత్రులుంటే ఎంత.. లేకుంటే ఎంత ! ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పరిపాలించాలని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వాళ్ల జీవితాలనే ఛిద్రం చేస్తున్నారు. అందుకే నిండా ఐదేళ్ల పాలన ముగియక ముందే ప్రజల చీత్కారాలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇవన్నీ చూసే ఎవరికి వాళ్లు తమ పార్టీలకు శాశ్వత అధ్యక్షులుగా ప్రకటించుకుంటున్నారు. వీళ్ల వాలకం చూస్తుంటే శాశ్వత ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులుగా ప్రకటించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజ్యాంగ విలువలను దర్జాగా పాతరేస్తున్న ఈ పాలక ప్రభుత్వాలను భూస్థాపితం చేయకుంటే భారత దేశం మరో బానిస సమాజంలోకి జారిపోవడం ఖాయం. అలాంటి మహత్తర పోరాటానికి ప్రజల చైతన్యం నాంది పలకాలి. మరో స్వతంత్ర ఉద్యమానికి సిద్దం కావాలి.