లోన్ రికవరీ రాక్షసుల వేధింపులకు ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. తీసుకున్న అప్పులు చెల్లించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ రుణ యాప్‌ల వేధింపులు ప్రజాప్రతినిధులను కూడా తాకాయి. వ్యవసాయ మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ దాకా అందరూ బాధితులే. ఇంత మంది ప్రజలను రుణాలు ఇచ్చిన సంస్థలు వేధిస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టదా ? వీళ్లంతా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే రేపు మీకు పన్నులు కట్టే ప్రజలు మిగులుతారా ?
ఎన్టీఆర్ జిల్లాలో కళ్ల ముందే తన తండ్రిని అప్పుల రికవరీ రాక్షసులు వేధిస్తుంటే తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ప్రభుత్వాల్లో చలనం రావడానికి ఇంకెందరు చనిపోవాలి ? ఇదే ప్రశ్న దేశ వ్యాప్తంగా సగటు ప్రజల నుంచి ఉత్పన్నమవుతోంది. ఓ సర్వే ప్రకారం ఏపీలో 93 శాతం మంది రుణగ్రస్తులుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంతగా అప్పుల్లో కూరుకుపోవిడానికి కారణం ఎవరు ? పనికిమాలిన పాలన చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాదా ! లోప భూయిష్టమైన మీ ఆర్థిక విధానాల వల్లే ప్రజలు అప్పులపాలైన సంగతి మరిచారా ! ఇప్పుడు అప్పులు సకాలంలో చెల్లించలేదని వేధిస్తుంటే చోద్యం చూస్తారా !
ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు సంపద మొత్తం కేంద్రీకరణకు దోహదపడింది. ఆర్థిక అసమానతలు తీవ్రమయ్యాయి. దేశ వ్యాప్తంగా 80 శాతం మంది కష్టార్జితం 20 శాతం మంది చేతుల్లోకి వెళ్లింది. కేవలం 20 శాతం సంపద మాత్రమే 80 శాతం ప్రజల చేతుల్లో ఉంది. ఇంతటి అసమానతలకు కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాలే కారణం. దీనికి సగటు ప్రజలను బలిచేస్తారా !
గతంలో అంతోఇంతో ప్రజలకు విరివిగా జాతీయ బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బ్యాంకుల మనుగడ కోసం కేవలం ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలకే రుణాలు ఇస్తున్నాయి. సగటు ప్రజల అవసరాలకు అప్పులు ఇవ్వడం లేదు. గత్యంతరం లేని స్థితిలో ప్రజలు ఆన్లైన్ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు.
కనీసం వీటికైనా విధి విధానాలు రూపొందించారా అంటే అదీ లేదు. ఆ కంపెనీల ఇష్టారాజ్యం. అప్పు తీసుకున్నోళ్లు ప్రాణాలను ఫణంగా పెట్టి అయినా తీర్చాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తుంటే ప్రభుత్వాలకు పట్టదా ?
మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌ను వేధించిన కాల్ మనీ సంస్థ రికవరీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని గంటల్లోనే వాళ్లను విడిపించడానికి డజను మంది అడ్వకేట్లు క్యూ కట్టారు. దీన్ని బట్టి ప్రభుత్వాలను ఈ సంస్థలు శాసిస్తున్నాయా ! ప్రభుత్వ పెద్దలు ఈ సంస్థలకు వత్తాసు పలుకుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. వీటిని కట్టడి చేసేందుకు సుప్రీం కోర్టు సుమోటోగా కేసు పెట్టి విచారణ చేపట్టాలి. సగటు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాజ్యాంగ సంస్థలు రంగంలోకి దిగాలి. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పౌర సమాజం కదలాలి.
I have to thank you for the efforts you have put in penning this website. Im hoping to see the same high-grade content by you in the future as well. In truth, your creative writing abilities has motivated me to get my own website now 😉