‘‘నాపై తప్పుడు గూఢచర్యం కేసు మోపారు. సీబీఐ విచారణ చేపట్టింది. నన్ను నిర్దోషిగా సుప్రీం కోర్టు తేల్చింది. అంటే దోషి ఎవరో ఉండి ఉండాలి కదా ! అందుకే కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేశా. డబ్బు కోసం కాదు. నాపై పడిన నిందను తొలగించుకోవడానికి.. దోషి ఎవరో తేల్చడానికే.” ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ తనను ఇంటర్వ్యూ చేస్తున్న సూర్య తో అన్న మాటలు మన ప్రభుత్వ వ్యవస్థల డొల్లతననాన్ని బోనులో నిలిపి ప్రశ్నిస్తున్నట్లున్నాయి. నంబి నారాయణన్ ఆటోబయోగ్రఫీతో తెరకెక్కిన సినిమా ‘రాకెట్రీ’. సినిమాను మాధవన్ అద్భుతంగా తీశారు. నంబి నారాయణన్ గురించి ప్రపంచానికి చాటారు.
నాసాలో అవకాశం కోసం ఎందరో శాస్త్రవేత్తలు ఎదురు చూస్తుంటారు. అలాంటి అవకాశాన్ని కాదనుకొని నంబి నారాయణన్ అనే రాకెట్ శాస్త్రవేత్త త్రివేండ్రం ఇస్రోలో చేరతాడు. మనదేశాన్ని శాటిలైట్ లాంచింగ్ మార్కెట్ లో అగ్రగామిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తాడు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాల సాయం పొందేందుకు ఆయన చేసిన కృషి అనితర సాధ్యమనిపిస్తుంది.
అలాంటి గొప్ప శాస్త్రవేత్తని ఓ తప్పుడు గూఢచర్యం కేసులో ఇరికిస్తారు. థర్డ్ డిగ్రీ ప్రయోగంతో దారుణంగా హింసిస్తారు. ఆయన కుటుంబాన్ని దాదాపు సాంఘిక బహిష్కరణకు గురిచేస్తారు. ఈ కుట్ర వల్ల నంబి నారాయణన్ కుటుంబం మాత్రమే నష్టపోలేదు. ఇస్రో సాధించాల్సిన విజయాలు కనీసం 15 ఏళ్లు ఆలస్యం అయ్యాయి. అలా దేశం నష్టపోయింది. ఇంత పెద్ద కుట్రకి పాల్పడింది మనదేశస్తులా..లేక విదేశీ హస్తం ఉందా అన్నది ఇప్పటికీ నిగ్గు తేల్చలేదు.
సంభాషణలు బాగా ఆకట్టుకుంటాయి..
సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగా ప్రజలకు కనెక్ట్ అవుతాయి. ‘బేసిగ్గా భారతీయులు తమ భార్యలను ప్రేమగా చూసుకుంటారు. అందుకే అంత జనాభా!’ అని నంబి ఫ్రాన్స్ శాస్త్రవేత్త దంపతులతో అంటాడు. ‘సైంటిస్టులు వింతయిన వ్యక్తులు. మావాళ్లకు రాకెట్ కింద పడితే ఎలా ఫీలవ్వాలో తెలుసేమో కానీ.. మనిషి పడిపోతే ఎలా ఫీలవ్వాలో తెలీదేమో!’ అని సీబీఐ అధికారితో చెబుతాడు. ఈ సంభాషణలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
ఇంతటి గొప్ప శాస్త్రవేత్తను మానసిక క్షోభకు గురి చేసినందుకు దేశ ప్రజల తరపున క్షమాపణలు చెబుతున్నానని ఇంటర్వ్యూ చివరలో సూర్య అంటున్నప్పుడు హృదయం ద్రవిస్తోంది. క్షమాపణలను తాను స్వీకరించనని నంబి అనడం విశేషంగా ఆకట్టుకుంటుంది. తనపై తప్పుడు కేసు పెట్టినందుకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు చెబుతాడు. డబ్బు కోసం కాదు. తాను నిర్దోషినని ప్రపంచానికి తెలియాలి. దోషి ఎవరో తేలాలని అంటాడు. ఈ సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.
నంబి జీవిత చరిత్రను మాధవన్ అద్భుతంగా తెరకెక్కించారు..

నంబి పాత్రలో మాధవన్ ఒదిగిపోయారు. బేసిగ్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావడంతో రాకెట్ సైన్స్‌కు సంబంధించి సాలిడ్ ఇంజిన్, లిక్విడ్ ఫ్యూయల్ ఇంజిన్, క్రయోజనిక్ ఇంజిన్ గురించి వివరించే ప్రయత్నం చేశారు. మాధవన్ భార్యగా సిమ్రాన్ నటించింది. మాధవన్ స్వయంగా దర్శకత్వం వహించిన తొలి మూవీ ఇది.
సినిమాలో చివరి ఐదు నిముషాలు అసలు నంబినారాయణన్ గారిని తెరపై చూపించడం బావుంది. రాష్ట్రపతి కోవింద్ చేతులమీదగా పద్మభూషణ్ అవార్డు ఇచ్చే సన్నివేశం రియల్ వీడియోను ప్రదర్శించారు. ఈ చిత్రం తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. నేటి తరం చూడదగ్గ సినిమా.
I have to thank you for the efforts you have put in penning this website. Im hoping to see the same high-grade content by you in the future as well. In truth, your creative writing abilities has motivated me to get my own website now 😉