“ఇరవై నాలుగు గంటలూ నీటి సరఫరా. సిమెంటు రోడ్లు.. వాటి పక్కనే ఫుట్ పాత్లుంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఎటు చూసినా పచ్చదనంతో పార్కులు. పిల్లల ఆట స్థలాలు.. ఆస్పత్రులు, స్కూళ్లుంటాయి. అసలు జగనన్న కాలనీ అంటే గతంలో ఎవరూ ఇలా కట్టి ఉండరు. ఇక కట్టబోరనేట్లుంటాయి. ”పేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పినప్పుడు సీఎం జగన్ కాలనీల రూపాన్ని కళ్ల ముందట ఆవిష్కరించారు. కనీసం ప్రతిపక్షాలు కూడా విమర్శించలేని స్థాయిలో జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతుందనే భరోసా ఇచ్చారు. ఆచరణలో చూస్తే దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.
విజయవాడ సిటీకి అతి సమీపంలోని వణుకూరులో జగనన్న కాలనీ నిర్మిస్తున్నారు. సుమారు 500 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కాలనీలోకి అడుగు పెట్టాలంటే బురద తొక్కకుండా వెళ్లలేని దుస్థితి. సామగ్రి తీసుకొచ్చే వాహనాలు సైతం బురదలో కూరుకుపోతున్నాయి. రోడ్లు వేయలేదు. కరెంటు స్తంభాలు మాత్రమే వేశారు. లైన్లు వేయడం మరిచినట్లున్నారు. నీటి వసతి లేదు.
కాలనీలో లబ్దిదారులు ఇల్లు కట్టుకుంటున్న వాళ్ల అవస్థలు అన్నీఇన్నీ కావు. కనీస సదుపాయాలు కల్పించనేలేదు. మొదటి రెండు ఆప్షన్లలో ఇల్లు కట్టకుంటే స్థలం దక్కదని అధికారులు దబాయించారు. దీంతో దొరికిన కాడికి అప్పులు చేసి కడుతున్నారు.
ప్రభుత్వమైనా.. ప్రైవేటు సంస్థలైనా లేఅవుట్లలో ముందుగా తారు లేదా సిమెంటు రోడ్లు వేయాలి. కనీసం మెటల్ రోడ్లన్నా ఉండాలి. కరెంటు నీటి వసతి కల్పించాలి. ఇవన్నీ లేకుండా ఎవరైనా ఎక్కడైనా ఇల్లు కట్టడం సాధ్యమవుతుందా ! ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఎంఐజీ ప్లాట్లు వేసి అమ్మడానికి సిద్దమవుతోంది. వాటిల్లో కూడా ఇలాంటి వసతుల్లేకుండా విక్రయించగలదా ! కొనడానికి ఎవరైనా ముందుకొస్తారా ?
మరి జగనన్న కాలనీల్లో ఈ సదుపాయాలను ముందుగా ఎందుకు ఏర్పాటు చేయలేదంటే సమాధానం చెప్పేవాళ్లు లేరు. ఊరికే ప్లాట్లు వేసి ఇళ్లు కట్టుకోమంటే ఎలా సాధ్యపడుతుందో అధికారులకే తెలియాలి. కట్టకుంటే స్థలం దక్కదనే భయంతో లబ్దిదారులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.
గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ఇందిరమ్మ కాలనీల్లో ఇప్పటికీ కనీస సదుపాయాలకు నోచుకోక పేదలు అల్లాడుతున్నారు. ఇక జగనన్న కాలనీలు కూడా వాటి సరసన చేరతాయోమోనన్న ఆందోళన లబ్దిదారుల్లో నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దాలి.
– రాజేశ్వరరావు కొండా, సీనియర్ జర్నలిస్టు