రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఉచితాలు ప్రకటిస్తున్నందువల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్నట్లు సుప్రీం కోర్టులో ఓ పిల్ దాఖలైంది. అత్యున్నత న్యాయస్థానం దీంతో ఏకీభవించింది. కేంద్ర ఎన్నికల సంఘం, ఆర్థిక లా కమిషన్, నీతి అయోగ్, ఆర్బీఐతోపాటు రాజకీయ పార్టీలతో కమిటీ వేయాలని సుప్రీం నిర్దేశించింది. ఇంతకీ ఉచిత పథకాలు మంచివా కావా అనే చర్చ బదులు అవి ఎవరికి అందించాలనే దానిపై చర్చించాలి. తీవ్ర ఆర్థిక అసమానతలున్న దేశంలో ఉచిత పథకాలకు ఇస్తున్నదెంత.. గుప్పెడు కార్పొరేట్ కుబేరులకు ఇస్తున్న రాయితీలెంతనే లెక్క కూడా తీయాల్సిందే.
సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం వెనుక రాజకీయ ప్రయోజనాలను కూడా లోతుగా చర్చించాలి. నేడు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్రం లాగేసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో ఉన్న అంశాలపై తానే పెత్తనం చేస్తోంది. రాష్ట్రాల ఆదాయాలను ఒకే పన్ను పేరుతో బలవంతంగా గుంజుకుంటోంది. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది..
వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు మనుగడ కోసం కేంద్రంపై ఆధారపడాల్సివస్తోంది. ఆయా పార్టీల ఉనికిని కాపాడుకునేందుకు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రమే ఈ పథకాలను అమలు చేస్తున్నాయి. ఉచిత పథకాల్లేకుండా చేస్తే కేంద్ర సర్కారు ఏకఛత్రాధిపత్యానికి తిరుగుండదనే దురాశ ఈ పిల్ ఉద్దేశంగా ఉన్నట్లు అనుమానించాల్సి వస్తోంది.
అదే సందర్భంలో ఉచిత పథకాలు ఎవరికి అందించాలనేది కూడా పరిశీలించాలి. నేడు ఇవి ఓటు బ్యాంకులు సృష్టించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. నిరుద్యోగిత ఆకాశానికి ఎగబాకుతున్న సమయంలో స్వయం ఉపాధికి నిధుల్లేమిని సృష్టిస్తోంది. ఉచిత పథకాలతో కొద్దిమందినైనా పేదలను దారిద్య్ర రేఖ నుంచి ఎగువకు తీసుకొచ్చే స్థాయిలో ఉండాలి. సగటు కొనుగోలు శక్తి పెంచేందుకు దోహదపడాలి. ప్రభుత్వాల చేయూత ద్వారా ఏటా కొన్ని లక్షల కుటుంబాలు పేదరికం నుంచి విముక్తి కల్పించేట్లుండాలి.
సంపన్నులకు దోచిపెడుతున్న దాంట్లో ఉచితాలెంత !
ఇదే తరుణంలో ఏటా కేంద్ర బడ్జెట్లో వేళ్లపై లెక్కపెట్టగలిగినన్ని కార్పొరేట్ సంస్థలకు రూ.5.5 లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు కార్పొరేట్ పన్నులను పెంచుతుంటే ఇక్కడ 35 నుంచి 25 శాతానికి తగ్గించారు. జీఎస్టీ పన్నుల్లో సగటు ప్రజలు వినియోగించే వస్తువులపై అధిక శాతం పన్నులు విధిస్తున్నారు. సంపన్నులు వినియోగించే వాటిపై అత్యంత తక్కువ పన్నులేస్తున్నారు.
చివరకు రుణాల పేరుతో బ్యాంకులను కొల్లగొట్టిన సంస్థలకు గత ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లను రైట్ ఆఫ్ చేశారు. ఓ సామాన్యుడు రుణం చెల్లించకుంటే ఇలా మాఫీ చేస్తారా ! వీటన్నింటితో పోలిస్తే పేదలకు ఇచ్చే ఉచిత పథకాలకు వెచ్చిస్తున్నదెంతనేది పరిశీలించాలి.
ఓ సాధారణ రైతు ఆదాయం రోజుకు రూ.49 ఉంటే.. అదే ఓ కార్పొరేట్ సంస్థ యజమాని ఆదాయం వెయ్యి కోట్లు ఉంది. ఎవరి కష్టాన్ని ఎవరికి దోచి పెడుతున్నారో ఇది తేటతెల్లం చేస్తోంది. ఈ అసమానతలను తగ్గించడం కోసం ఉచితాలను అమలు చేసేట్లు సుప్రీం కోర్టు మార్గనిర్దేశనంలో ఏర్పాటయ్యే కమిటీ లోతుగా అధ్యయనం చేయాలి.