రానున్న ఏడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించారు. ఇప్పటిదాకా ఎన్డీయే ప్రభుత్వంలో దక్కిన ఉద్యోగాలను చూస్తే నోటి మీద వేలేసుకోవాల్సిందే. ప్రధాని మోడీ హామీలన్నీ ఇలాగే ఉంటాయని మేథావులు తోసిపుచ్చుతున్నారు. నిరుద్యోగ యువతను ఆకర్షించడానికి ఉత్తుత్తి హామీలు ఇస్తుంటారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీ ఇప్పటిదాకా 300 హామీలను తుంగలో తొక్కేశారు. ఈ హామీ కూడా అలాంటిదేనంటున్నారు.
మోడీ ప్రభుత్వం వచ్చిన ఎనిమిదేళ్లలో ఎంత మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.. ఎంతమందికి ఉద్యోగాలు దక్కాయని పరిశీలిస్తే.. యువత ఎంపవర్మెంట్ గురించి ఊదరగొట్టే మోడీ పాలనలో ఏటా సగటున 2.75 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు దక్కుతోంది కేవలం సగటున 90,288 మందికి మాత్రమే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సుమారు 26 లక్షల ఉద్యోగ ఖాళీలున్నట్లు అంచనా.
2014–15లో 2.32 కోట్ల మంది ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకుంటే ఎంపికైయింది కేవలం 1,30,423 మంది మాత్రమే. 2015–16లో 2.95 కోట్ల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే 1,11,803 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. 2016–17లో 2.28 కోట్ల మంది దరఖాస్తుదారుల్లో 1,01,333 మందికి మాత్రమే కొలువులు దక్కాయి. 2017–18లో 3.94 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రయత్నిస్తే 76,147 మందికే వచ్చాయి. 2018–19లో 5.09 కోట్ల మందికి గాను 38,100 మంది మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారు.
2019–20లో 1.78 కోట్ల మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే 1,47,096 మందికే వచ్చాయి. 2020–21లో 1.80 కోట్ల మందికి గాను 78,555 మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కాయి. 2021–22లో 1.86 కోట్ల మంది దరఖాస్తుదారుల్లో 38,500 మందే ఉద్యోగాలు పొందగలిగారు.
గడచిన ఎనిమిదేళ్లలో మొత్తంగా 22 కోట్ల మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 7.2 లక్షల మంది మాత్రమే కొలువులు సాధించారు. ఈ లెక్కలన్నీ ఎవరో సృష్టించినవి కావు. పార్లమెంటులో స్వయానా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించినవే. ప్రధాని నరేంద్ర మోడీ జపం చేసే యువ సాధికారత డొల్లతనం ఇదే.
అందుకే కేంద్రాన్ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేనని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ప్రైవేటు రంగంలో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా అడుగులు వేస్తున్నారు. క్లౌడ్ కిచెన్ రంగంలో ఉన్న అవకాశాల గురించి అధ్యయనం చేస్తున్నారు.
నేటి స్పీడ్ యుగంలో ఎక్కువ మంది రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి తినడానికి తగినంత సమయం, డబ్బు వెచ్చించలేరు. ఇలాంటి వాళ్ల కోసం ఎక్కడికక్కడే ఎలాంటి హంగూ ఆర్భాటాల్లేకుండా అత్యంత తక్కువ ధరకే ఆహారం అందుబాటులోకి తెచ్చే దాన్నే క్లౌడ్ కిచెన్ అంటున్నారు. ఈ రంగంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.