అసలే ఎస్సీఎస్టీల పథకాలన్నీ ఎత్తేశారని ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ప్రత్యేకించి ఈ వర్గాలకు ఉన్న పథకాలను రద్దు చేసి ఊరందరికీ ఇచ్చేవే తమకూ ఇస్తున్నారన్న ఉక్రోషం నెలకొంది. వీటిని గమనంలోకి తీసుకున్న వైసీపీ సర్కారు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రకటించింది. ఇది ఎస్సీఎస్టీ విద్యార్థులకు వరమంటూ ఊదరగొట్టింది. ఈ పథకాన్ని పొందడానికి విధించిన నియమ నిబంధనలు చూస్తే నిమ్న వర్గాలకు చెందిన ఒక్కరూ వినియోగించుకునే పరిస్థితి లేదు.
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం మార్గదర్శకాల్లో ప్రధానమైంది టాప్ 200 యూనివర్శిటీల్లో సీటు తెచ్చుకోవడం. ప్రభుత్వం నిర్దేశించిన ఈ విశ్వ విద్యాలయాల్లో అట్టడుగున 196వ స్థానంలో ఉన్న వాండర్బిల్ట్ యూనివర్శిటీలో ప్రవేశం అంత ఈజీ కాదు. అమెరికాలో పుట్టి పెరిగి ఇక్కడ చదువుకున్న పిల్లలకే అందులో సీటు రావడమే కష్టం. ఇక ఆంధ్రాలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ పిల్లలకు అందులో సీటు వస్తుందో చెప్పనవసరం లేదు.
ఒకవేళ చచ్చీ చెడీ అందులో సీటొచ్చినా 196వ యూనివర్శిటీ కాబట్టి జగనన్న దీవించేది 50శాతం ఫీజు మాత్రమే. మిగతా 50శాతం చెల్లించగల ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎంతమంది ఉంటారు ? టాప్ 200 యూనివర్శిటీల జాబితాలో చిట్టచివరి వాండర్బిల్ట్ విశ్వ విద్యాలయంలో ఏడాదికి ట్యూషన్ ఫీజు 50 వేల డాలర్లపైనే. అంటే సుమారు రూ. 44 లక్షలు. సదరు యూనివర్శిటీ రెండో సగం లిస్టులో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చేది అందులో సగమే. అంటే రూ.22 లక్షలు.
ఏడాదికి రూ.8 లక్షల ఆదాయంలోపు కుటుంబాలకు చెందిన వారికే ఈ పథకం వర్తిస్తుంది. నిమ్న వర్గాల కుటుంబాల్లో ఒక పిల్లో, పిల్లాడో వాండర్బిల్ట్లాంటి పెద్ద యూనివర్శిటీలో సీటు సంపాదించినా ఆ మిగిలిన రూ. 22 లక్షలు ఎలా చెల్లించగలడు ? ఇక ప్రభుత్వం ఆదేశంలో మరో ఆణిముత్యం కూడా ఉంది. ఈ పథకాన్ని కుల,జాతి, మత,ప్రాంత భేదాల్లేకుండా వర్తింపజేస్తామంటున్నారు. ఇక 60 శాతం మార్కులు ఉండాలి. 35 ఏళ్ల లోపుండాలనేవి అదనపు నిబంధనలు.
పై మార్గదర్శకాలను లోతుగా పరిశీలిస్తే.. జగనన్న విద్యా దీవెన లభించేది విదేశాల్లో చదవగలిగిన స్తోమతు ఉన్నోళ్లకు మాత్రమేనని స్పష్టమవుతోంది. ఎస్సీఎస్టీలకు ఈ పథకం ఎండమావిలాంటిదే. దూరాన్నుంచి చూస్తే ఎస్సీఎస్టీల కోసమే అన్నట్లుంటుంది. ఆచరణలో ఒక్కరు కూడా అందిపుచ్చుకునే అవకాశమే లేదు. డబ్బున్నవాడు ఏదో ఓ మూలనున్న యూనివర్శిటీలో సీటు సంపాదిస్తాడు. ఆ రెండేళ్ల కోర్సు అయిపోయాక హెచ్1 వీసా సంపాదించి ఒక చేత్తో భారతీయ సంప్రదాయాన్ని కాపుకాస్తూ.. మరో చేత్తో డాలర్లను వడిసిపడుతూ ఉంటే ఈ టాప్ యూనివర్శిటీల గొడవ ప్రభుత్వ లబ్దిదారులకే ఏల జగనన్నా?
- Credits to Prasad Charasala