మానవ నాగరికతకు ఊపిరులూదిన జీవితాలు చేనేతలవి. నేడు రోజంతా వళ్లు హూనం చేసుకున్నా పూట గడవడం కష్టమవుతోంది. అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ కఠోర వాస్తవాలు రేపటి జాతీయ చేనేత దినోత్సవం నాడు కనిపించవు. చేనేతల కోసం మా ప్రభుత్వాలు ఎంతో చేశాయని నాయకులు గొప్పలు పోతారు. సీఎం బటన్ నొక్కి నగదు బదిలీ చేస్తారు. వందిమాగధులు, దళారుల చప్పట్ల మధ్య పండగ జరుపుకుంటారు. ఆల్ ఈజ్ వెల్ అంటూ వాళ్లకు వాళ్లే భుజం చరచుకొని వెళ్తారు. మళ్లీ చేనేతల కష్టాల కన్నీళ్లు యథావిధిగా కొనసాగుతాయి. ఇదే మేరా భారత్ మహాన్ !
మనదేశంలో ఒకప్పుడు చేనేత కుటుంబాలు కోటికిపైగా ఉన్నాయి. మరమగ్గాల రాకతో క్రమేణా తగ్గుతూ ఇప్పుడు సుమారు 28 లక్షలకు చేరాయి. ఏటా కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయింపులే తప్ప విడుదల చేసిన పాపాన పోవడం లేదు. 2022–23 బడ్జెట్లో చేనేతల అభివృద్ధి కోసం రూ.410 కోట్లు కేటాయించారు. ఇంతవరకు ఒక్క రూపాయి విడుదల చేసినట్లు లేదు.
చేనేత ఉత్పత్తులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి తక్కువ సమయంలో ఎక్కువ వస్త్రాలు తయారు చేసే యంత్రాలు వచ్చాయి. వాటిని వినియోగంలోకి తేవడంతోపాటు మార్కెట్ రక్షణ కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం లేదు. నెలకు సగటున కనీస వేతనం రూ.6,125 దక్కాల్సి ఉంటే కేవలం రూ. 5 వేలు మాత్రమే పొందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఏటేటా లబ్దిదారులను కుదించేస్తున్నారు
ఏపీలో నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేల చొప్పున 80 వేల కుటుంబాలకు నగదు అందజేస్తోంది. ఇప్పటికి మూడేళ్ల నుంచి పథకాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం ఐదేళ్లపాటు నగదు బదిలీ స్కీం కొనసాగుతుంది. ఈ పథకాన్ని లబ్దిదారులు పొందేందుకు ఏటేటా నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రతీ ఏడాది అర్హత కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఏటా లబ్దిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిపోవడం దేనికి సంకేతం ?
గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పలనాడు జిల్లాల పరిధిలో సుమారు 50 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇందులో 80 శాతం మాస్టర్ వీవర్ దగ్గర రోజువారీ మజూరీ తెచ్చుకొని పనిచేసేవాళ్లే. 2019లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17వేల చేనేత కుటుంబాలకుగాను నేతన్న నేస్తం పథకం దక్కింది 3,169 మందికి మాత్రమే.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 వేల కుటుంబాలుంటే 7,451 మందికే పథకాన్ని వర్తింపజేశారు. అప్పటి నుంచి 300 యూనిట్ల కరెంటు వాడకం, షెడ్డుల్లో మగ్గం నేయకూడదనే నిబంధనలు తీసుకొచ్చి ఏటా పది నుంచి పదిహేను శాతం లబ్దిదారుల సంఖ్యను కుదిస్తూ వచ్చారు. నేడు ప్రతీ ఐదుగురిలో ఓ కార్మికుడికి మాత్రమే పథకం అందుతోంది.
నూలు బిల్లుంటేనే ‘నేస్తం’ అంటే ఎలా !
నాలుగో ఏడాది పథకాన్ని వర్తింపజేయడానికి మరిన్ని నిబంధనలు విధించారు. నూలు కొనుగోలు బిల్లు సమర్పించాలనే కండిషన్ పెట్టారు. మాస్టర్ వీవర్ నూలు కొనుగోలు చేస్తాడు. ఆయన దగ్గర కార్మికులు పడుగు, నూలు,పేక, జరీ తీసుకొని వస్త్రాలు నేసి ఇస్తారు. మరి కార్మికులు నూలు బిల్లు ఎక్కడ నుంచి తీసుకొస్తారు ?
ఈ నిబంధనతో లబ్దిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 8వేల మందికే పథకం అందుతోంది. ఈదఫా 30 శాతానికి పైగా లబ్దిదారులు తగ్గిపోనున్నారు. ఇదే జరిగితే చేనేతలకు నేతన్న హస్తం శూన్య హస్తమే అవుతుంది.
మనుగడ కోసం పోరాటం తప్పదు..
మరోవైపు కేంద్ర సర్కారు చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించింది. ఇది చాలదన్నట్లు ఇటీవల 12 శాతానికి పెంచడంతో పెద్ద ఎత్తున ఆందోళన రేగింది. దీంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. 5 శాతం జీఎస్టీని తొలగించడానికి మాత్రం ససేమిరా అంటోంది. ఓ వైపు ఏటేటా కేంద్ర బడ్జెట్లో కోతలు పెట్టడమేగాకుండా ఏకంగా జీఎస్టీ పన్నులతో చేనేతను నిర్వీర్యం చేసే దిశగా విధి విధానాలను అమలు చేస్తోంది. చేనేత కుటుంబాలు మరోసారి మనుగడ కోసం పోరాడాల్సిన అవశ్యకత ఏర్పడింది.